నేరాలు చేశారు లేదో నిర్ధారణ జరుగకుండానే వేలమంది ఏండ్ల తరబడి విచారణ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో సుమారు 6000 మంది విచారణ ఖైదీలుగా బందీలుగా నలిగిపోతున్నారు. రాజకీయ ఖైదీలపై కేసులను ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజాస్వామికవాదులు, న్యాయవాదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచుతున్నారు. మరోవైపు జైలులోనే దీక్షలు చేస్తూ రాజకీయ ఖైదీలు కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు.
రాజకీయ ఖైదీలు హక్కుల కోసం ఆందోళనబాట పడుతున్నారు. జైలు గోడల మధ్యనే నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా జగదల్పూర్, భువనేశ్వర్, రాయపూర్, సుకుమా జైళ్లలో గతంలో పలువురు ఖైదీలు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ దాదా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెట్టారు. 6000 మంది ఖైదీలను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కోరారు.
దీనికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 2026 ఆగస్టు 15న తొలి విడతలో వెయ్యి మందిని విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా విడుదల చేయలేదు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీకి చెందిన ఆర్కే సహచరి శిరీష, బాలకృష్ణ సహచరి అనురాధ ఛత్తీస్‌గఢ్ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. జార్ఖండ్‌కు చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు అశుతోష్ రాంచీలో కేసులో ఆలస్యం చేస్తున్నారని అతని న్యాయవాది ఆరోపించారు.
తెలంగాణలోని తిరుమలగిరికి చెందిన కోసపు అశోక్‌రెడ్డితోపాటు ఆయన సహచరి ఆశ మధ్యప్రదేశ్‌లోని జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇదే అశోక్‌రెడ్డిపై జార్ఖండ్ జైలు అధికారులు విచక్షణారహితంగా దాడి చేశారు. విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో సుమారు 80 మంది జైలు జీవితం అనుభవిస్తున్నారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ బ్యూరో సభ్యుడు కిషన్ జార్ఖండ్ జైలులో వృద్ధాప్యం, అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కిషన్ సహచరి జార్ఖండ్‌కు చెందిన గీతు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీపక్ అనే ఖైదీ కలకత్తా జైలులో మగ్గుతున్నాడు. తమిళనాడు రాష్ట్ర కమిటీ సభ్యుడు మరో దీపక్ ఛత్తీస్‌గఢ్‌లో దవాఖానలో అరెస్టయ్యాడు. తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి. దామోదర్ భార్య రజిత ఆశన్న సహచరి శ్రీవిద్య చంచలగూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
శివారెడ్డి అలియాస్ కిరణ్ వేంగు కూడా జైలు జీవితం అనుభవిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన దుబాసి శంకర్ అలియాస్ మహేందర్ రమేశ్ ఏడేండ్లుగా భువనేశ్వర్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. శంకర్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నది. 2017లో రామడుగు ఎన్కౌంటర్లో శంకర్ భార్య లత అలియాస్ భారతి చనిపోయారు. కందమాల్ కలహంజా నవపాడ జైళ్లలో మావోయిస్టు రాజకీయ ఖైదీలు 1000 మందికి పైగానే విచారణ ఖైదీలుగా ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీ ఖైదీల జీవితాలు జైలులోనే అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. కోర్డులు శిక్షలు వేయకుండానే ఏండ్లకు ఏండ్లు జైళ్లలో నలిగిపోతున్నారు.
సరైన వైద్యం అందక పలువురు చనిపోతున్నారు. పరివర్తన కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. నయాగుడి దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసిన రవి అనే ఆదివాసి, 2021లో భువనేశ్వర్ జైలులో గుండెపోటుతో చనిపోయారు. కానీ కోర్టు మాత్రం రవిని నిర్దోషిగా ప్రకటించింది. తెలంగాణకు చెందిన నిర్మల మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జైలులో 2022లో వైద్యమందక చనిపోయారు. ఇలా ఎంతోమంది విచారణ ఖైదీలు శిక్షలు పడకుండానే విచారణ ఖైదీలుగా, దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు, తుదిశ్వాస విడుస్తున్నారు. విచారణ ఖైదీలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
దేశంలో మావోయిస్టు పార్టీనే లేనప్పుడు మావోయిస్టు సానుభూతిపరుల పేరిట కేసులు, అరెస్టులు, జైలు శిక్షలు ఎందుకు? ఆదివాసుల అరెస్టులు ఎందు కు? మావోయిస్టు నేతలను, అనారోగ్యంతో బాధపడుతున్న రాజకీయ ఖైదీలను, ఏండ్ల తరబడి జైలులో మగ్గుతున్న వారిని విడుదల చేయాలి. నాలుగు గోడల మధ్య మిగిలిపోతున్న వారి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో స్పందించాలి.
-దామరపల్లి నర్సింహారెడ్డి