కనీవినీ ఎరుగని జలప్రళయంలో చిక్కుకుని నేపాల్ అతలాకుతలమైంది. వందల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు వార్తలు వెలువడ్డాయి. గల్లంతైనవారి లెక్కతేలితే గానీ పూర్తి ప్రాణనష్టం అంచనా వేసే పరిస్థితి లేదు. ఇక ఆస్తినష్టమైతే అసాధారణ స్థాయిలో ఉన్నట్టు దృశ్యాలను బట్టి తెలుస్తున్నది. భోటే కోశీ నది అనూహ్యమైన రీతిలో పొంగిపొర్లడం ఈ ఉత్పాతానికి కారణమని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. అంతర్జాతీయ పర్యాటకం గమ్యస్థానం కావడంతో మృతుల్లో, గల్లంతైన వారిలో విదేశీ పౌరులు, మరీ ముఖ్యంగా భారతీయులు భారీసంఖ్యలో ఉండటం గమనార్హం. ఓ భారీ హిమానీనదం బద్దలై అందులోని ఓ పెద్ద శకలం హఠాత్తుగా నదికి అడ్డం పడిపోయింది.
తనతోపాటుగా ఆ శకలం మంచుముద్దలు, మట్టి, రాళ్లు తెచ్చిపోసింది. దాంతో అదొక తాత్కాలిక ఆనకట్టగా మారి నదీ గమనానికి అడ్డుపడింది. ఫలితంగా నది తన ప్రవాహ మార్గాన్ని వదిలి ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాలపై విరుచుకుపడింది. హిమానీనదం శకలం వచ్చిపడిన ధాటికి ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఆ కారణంగా భూకంపం వచ్చిందని అనుకున్నప్పటికీ అంతిమంగా హిమానీనదం కారణంగా ఘోరకలి సంభవించినట్టు ఇస్రో తదితర ఉపగ్రహ నిఘా సంస్థలు నిర్ధారించాయి. పర్వత శిఖరాల మీద ఉండే మంచుగడ్డలు బలహీనపడి, ఒక్కుమ్మడిగా కూలిపోతున్నాయి. ఈ భారీ మంచు, రాళ్ల ప్రవాహం కింద ఉన్న నదీ మార్గాన్ని తాత్కాలికంగా అడ్డుకుని, తర్వాత ఒక్కసారిగా తెరుచుకోవడం వల్ల ఏమాత్రం సమయం ఇవ్వకుండా వరద ముంచెత్తింది. దాంతో నదీమార్గం వెంబడి ఘోర విధ్వంసం సంభవించింది.
అయితే ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? మనం వాటిని ఎదుర్కొనేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. హిమాలయ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు, రోడ్లు, హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతి సమతౌల్యానికి భంగం కలిగిస్తూ ముందుకు దూసుకుపోతున్న ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఈ విపత్తులకు పరోక్షంగా కారణమవుతుండటం స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకవైపు వాతావరణ మార్పులను అరికట్టడంలో ప్రపంచదేశాలు విఫలమవుతుంటే, మరోవైపు సున్నిత ప్రాంతాల్లో అడ్డూఅదుపూ లేకుండా నిర్మాణాలు చేపట్టడం ప్రమాదాన్ని మరింత పెంచుతున్నది.
హిమాలయ పర్వత శ్రేణుల్లో చోటుచేసుకున్న ఈ విపత్తు సాధారణంగా అప్పుడప్పుడు జరిగే ప్రకృతి ఉత్పాతంగా భావించడానికి వీల్లేదు. ఎందుకంటే కొండచరియలు విరిగిపడటం ఆ ప్రాంతాల్లో తరచుగా జరుగుతుంటుంది. కానీ హిమానీనదం బద్దలుకావడం అనేది ఓ అసాధారణ ఉత్పాతమే. అది మానవ కల్పితమేననే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల భయానక వాస్తవానికి ఘోర సాక్ష్యంగా నిలిచింది నేపాల్ జలవిలయం. హిమాలయం నదులకు అనాదిగా జీవం పోసే గ్లేసియర్లు లేదా హిమానీనదాలు గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రభావితమవుతున్నాయి. ఈ విధమైన భౌగోళిక ఘటనలను ‘హిమానీనద విస్ఫోటం’గా పిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి అనేది శాస్త్రవేత్తల హెచ్చరిక. అలా బద్దలైనప్పుడు వాటిలోని మంచు అతి వేగంగా కరుగుతుంది. మరోవైపు అడవుల నరికివేత, జనావాసాల విస్తరణ యథేచ్ఛగా జరిగిపోతున్నది. ఇవన్నీ వెరసి హిమానీనదాల స్థిరత్వాన్ని దెబ్బతీసి ఘోరకలి సృష్టిస్తున్నాయి. ఒక గ్లేసియర్ అకస్మాత్తుగా బద్దలైపోవడం అనేది పైకి సహజమైన ఘటనగా కనిపించినా, దాని వెనుకనున్న మానవ విధ్వంసాన్ని విస్మరిస్తే మరిన్ని ఉత్పాతాలకు తెరతీసినట్టే అవుతుంది.