‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం’ అనే సామెత భూతాప సమస్యకు సరిగ్గా సరిపోతుంది. నేపాల్‌లో వారం రోజుల క్రితం హిమానీనదం బద్దలుకావడంతో సంభవించిన ఘోర ఉత్పాతంతో వందలాది మంది మరణించడం, వేలాది మంది గల్లంతు కావడం ప్రపంచాన్ని కలచివేసింది. ఇప్పటివరకు అత్యవసర బృందాలు 1,100కు పైగా మృతదేహాలను వెలికితీశాయి. దాదాపు 4,500 మంది కనిపించకుండా పోయారు. అందుకు పర్యావరణ విధ్వంసమే ప్రధాన కారణమని దాదాపుగా రూఢీ అయింది. ఈ విపత్తుకు సంబంధించి పెద్ద దేశాల నుంచి ‘వాతావరణ న్యాయం’ కోరుతున్నది. భూతాపానికి కారణమయ్యే వాయువులు వెలువరించడంలో తమ పాత్ర ఏమీ లేకపోయినప్పటికీ విపరిణామాల భారాన్ని మాత్రం తాము మోయాల్సి వస్తున్నదనేది నేపాల్ వాదన.
2015లో ప్యారిస్ ఒప్పందంలో భూతాపం పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీలు దాటిపోకుండా చూడాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే ఆ లక్ష్యం సాధించడం దాదాపు అసాధ్యమని తాజా అంచనాలు తేల్చాయి. రానున్న కొన్ని రోజుల్లో భూతాపం పెరుగుదల 1.5 సెల్సియస్ డిగ్రీలు దాటిపోతుందని, దీనివల్ల తిరుగులేని పరిణామాలు సంభవిస్తాయని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమ సంస్థ (యూఎన్ఈపీ) తాజా నివేదికలో హెచ్చరించడం గమనార్హం. అన్ని దేశాలూ తమతమ లక్ష్యాలను పూర్తి చేయగలిగినా భూతాపం పెరుగుదల 1.8 డిగ్రీలకు చేరుకుంటుందని యూఎన్ఈపీ నివేదిక స్పష్టం చేసింది. ఈ తాపం ఎన్నేండ్లు కొనసాగుతుంది అనేదాన్ని బట్టి పర్యావరణ విధ్వంసం జరుగడం ఖాయమని సంస్థ అంటున్నది. ఇక 2100 నాటికి పెరుగుదల 2.6కు చేరుకుంటుందని అంచనా.
ఇప్పటికే వాతావరణ మార్పులతో మనుషుల జీవనోపాధిపై, ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడుతున్నాయి. సముద్రాలు వేడెక్కి ఎల్ నినో విజృంభించి రుతువులు గతి తప్పుతున్నాయి. అన్నింటా ‘అతి’ చోటుచేసుకుంటున్నది. అయితే అతివృష్టి, కాకపోతే అనావృష్టి అన్నట్టుగా ప్రకృతి కల్లోలంతో జనజీవనం అతలాకుతలం అవుతున్నది. ఈసారి వర్షాలు తగినంతగా కురువకపోవడం, ఫలితంగా వ్యవసాయం కుదేలు కావడం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఎండలు విజృంభించి అడవులను దహించివేస్తున్నాయి. అమెరికా, యూరప్‌ల్లో భారీగా అడవులు మంటలకు ఆహుతవుతున్నాయి. సముద్ర తాపం వల్ల ప్రవాళ దీవులు కూలిపోతున్నాయి. ధ్రువాల మంచు కరిగిపోతున్నది. దీనివల్ల సముద్రమట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ముప్పు ఏర్పడుతున్నది. హిమానీనదాలు బద్దలు కావడం వల్ల నేపాల్ తరహాలో ఘోర ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే సంక్షోభాలు ఈ స్థాయిలో ఉంటే ఇక భూతాపం పతాక స్థాయికి చేరుకుంటే అవి ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ప్రకృతి దేశాల భౌగోళిక సరిహద్దులను పట్టించుకోదు. అన్ని దేశాలకూ ముప్పు సమానంగా ఉంటుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఈ సంక్షోభాల నుంచి గట్టెక్కాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించడం ఒక్కటే పరిష్కారం కాదు. ఈ సరికే గాలిలో చేరిపోయిన ఉద్గారాలను తటస్థం చేయాలంటే అడవుల పెంపకాన్ని యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాల్సి ఉంటుంది. ఇక్కడే ఖర్చు ఎవరు భరించాలనే ప్రశ్న ఓ సవాల్‌గా నిలుస్తున్నది. చారిత్రకంగా సంపన్న దేశాలు ఉద్గారాలను అధికంగా విడుదల చేశాయి కనుక, అవి అధిక భారాన్ని మోయాలనేది ఒక వాదన. చైనా, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రస్తుతం అధిక ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి, కనుక ఖర్చులో అవి గణనీయమైన వాటాను భరించాలని మరొక వాదన. ఇక్కడే పీటముడి పడింది. సంపన్న దేశాలు సమకూర్చేందుకు సిద్ధమైన 100 బిలియన్ డాలర్లు ఏ మూలకూ సరిపోవనేది ఇంకొక వాదన. ఈ వాదనల నడుమ జరుగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉన్నది. మరిన్ని నేపాల్ తరహా ఉత్పాతాలు జరుగకుండా ఉండాలంటే ప్రపంచ దేశాలు సత్వరమే నడుం బిగించి, భూతాపం తగ్గించేందుకు సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాల్సింది. లేకపోతే మానవ వ్యవస్థలు, పర్యావరణ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలుతాయని యూఎన్ఈపీ స్పష్టం చేసింది. భూతాపం పెరుగుదలను కనీసం 1.5 సెల్సియస్ డిగ్రీల వద్ద నిలబెట్టడం అనేది ఓ ఎంపిక కాదనీ, అది తప్పనిసరి బాధ్యత అనీ అంతర్జాతీయ న్యాయస్థానం ఇటీవలే తీర్పు చెప్పింది.