అడవి రాముడు సినిమా కోసం కవి వేటూరి సుందర రామమూర్తి రచించిన మాస్ మసాల గీతంలోని ‘ఆరేసుకోబోయి పారేసుకొన్నాను -కోకెత్తు కెళ్లింది కొండ గాలి! అన్న వాక్యాలను గణ విభజన చేసి, యతి మైత్రిని చూస్తే .. అది సీస పద్య పాదం అని మనందరికీ తెలుస్తుంది. ఒక సినీ గీతంలో ఛందః ప్రయోగం ఒక గొప్ప విశేషంగా అందరూ చెప్పుకొంటుంటారు.
కానీ ఇట్లాంటి ప్రయోగం అంతకు ఎన్నో ఏండ్ల ముందే మరొక సీనియర్ కవి రచించిన పాటలో కూడ ఉందని పెద్దగా ఎవరూ గమనించినట్టు లేదు. ఎక్కడా ఎవరూ ఉటంకించిన దాఖలాలు కూడ లేవు. ఇటీవలే ఈ విషయం నేను పరిశీలించాక అందరితో పంచుకోవాలనిపించింది. ఆయన ప్రయోగించింది కూడ సాధారణ ఛందస్సు కాదు. ఒక విశిష్ట ఛందస్సు. అది ఉత్సాహవృత్తం. ఆ సీనియర్ కవి ఎవరో కాదు, పద్య కవిత్వాన్ని విప్లవ కవిత్వంగా మలిచి నిజాం నవాబు నిరంకుశ పాలనను తూర్పార బట్టి, జైలు శిక్షను కూడ అనుభవించిన దేశ భక్తుడు, మహాకవి డాక్టర్ దాశరథి!
-ఆచార్య ఫణీంద్ర
99598 82963