పొలవాస అంటే ఇప్పటి పొలాస. జగిత్యాల పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామం. పొలాసలో, పరిసర గ్రామాల్లో కాకతీయ సామ్రాజ్యం ఏర్పడక ముందునాటి రాజ్యం ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. పొలాల్లో, ఎల్లమ్మ గుడి దగ్గర, చెరువు గట్టుపైన విగ్రహాలు, శిల్ప శకలాలు జగిత్యాల జిల్లాలో సుమారు వెయ్యేండ్ల కిందటి పొలవాస రాజ్య ఆధారాలు. పొలాస కాకతీయ సామ్రాజ్యానికి ముందే ఏర్పడిన ఒక రాజ్యానికి కేంద్రం. ప్రముఖ వర్తక శ్రేణి అయిన వీరబలాంజ శ్రేణి పులస్తేశ్వరుడికి చేసిన దానం పొలాసకున్న ఆర్థిక ప్రాధాన్యానికి నిదర్శనం. కాకతీయులు, కందూరు చోడుల లాగే పొలవాస పాలకులు కూడా కళ్యాణి చాళుక్య సామంతులే.
పొలవాస రాజుల పూర్వికులు, కాకతీయులు-ఇద్దరూ రాష్ట్ర కూట సామంతులు. పొలాసలోని పులస్తేశ్వరాలయంలో ఉన్న శాసనంలో మహా మండలేశ్వర మేడ క్షమాపతి బిరుదుల్లో ఉన్న ‘సువర్ణ గరుడధ్వజ’ రాష్ట్రకూట మూలాలను సూచిస్తుంది. రాష్ట్రకూటుల పతనం తర్వాత వచ్చిన కళ్యాణి చాళుక్యులు వారిని మహా మండలేశ్వరులుగా కొనసాగనిచ్చారు. కాకతీయులు ఎదగాలంటే పక్కనే ఉన్న పొలవాసను కలుపుకోవడం తప్పనిసరైంది. పొలవాస రాజులు తమ వంశ మూల పురుషుడు మాధవ వర్మ లేక మాధవ చక్రవర్తి అని క్రీ.శ. 1122 నాటి నర్సంపేట దగ్గరి గోవిందాపురం చెరువు శాసనంలో చెప్పుకొన్నారు. చరిత్రలో దొరకని ఈ మాధవ వర్మ సైన్యంలో 8 వేల ఏనుగులు, 10 కోట్ల గుర్రాలు, అనంతమైన కాల్బలం ఉందని శాసనంలో ఉన్నది. ఈ అతిశయోక్తి.
పొలవాసను పాలించిన రాజుల వివరాలు శాసనాల ద్వారా తెలుస్తున్నది. వీరి పాలన దుర్గరాజు(ప్రారంభం తెలీదు కానీ క్రీ.శ.1080 వరకు)తో మొదలై, మొదటి మేడరాజు (క్రీ.శ. 1080 -1110), మొదటి జగ్గరాజ లేక జగద్దేవ (క్రీ.శ.1110-1116), పొలవాసలో రెండవ మేడరాజు (క్రీ.శ.1116-1158) మంత్రకూటం(మంథని)లో గుండరాజు (క్రీ.శ.1116 -1136) పాలించారు. మేడరాజు రెండవ ప్రోలరాజు చేతిలో ఓడినా, రుద్రదేవుని చేతిలో ఓటమి తర్వాతే, పొలవాస కాకతీయ రాజ్యంలో కలిసిపోయింది. హన్మకొండ వేయి స్థంబాల గుడి శాసనం రుద్రదేవుడి చేతిలో ఓటమిని రికార్డు చేసింది. మేడ రాజును ఓడించి పొలవాస పట్టణాన్ని రుద్రదేవుడు తగులబెట్టించడం, కందూరు చోడుల వర్ధమానపురాన్ని కాల్చి బూడిద చేయడాన్ని గుర్తుచేస్తున్నది. అంటే రుద్రదేవుడి కాకతీయ సామ్రాజ్య విస్తరణ సమకాలీన సామంతుల భస్మీపటలమైన అయిన రాజధానుల మీదుగా సాగిందని చెప్పాలి. హన్మకొండలో రాజరాజ నరేంద్ర గ్రంథాలయం ప్రాంగణంలో ఉన్న అసంపూర్ణ శాసనంలో, పొలవాస మేడరాజును ఓడించి తీసుకున్న పరిహారంతో కాకతీయ మంత్రి గంగాధర హన్మకొండలో ప్రసన్న కేశవ ఆలయాన్ని కట్టించాడనీ, ప్రయాగ, వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో గంగా స్నానం చేసి పూర్వికులకు పిండ ప్రదానాలు చేశాడని ఉంది.
పొలాస ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్న ఒక వీరగల్లు ప్రత్యేకమైనది. ఈ వీరగల్లులో ఒక స్త్రీ కత్తిపట్టి శత్రు సంహారం చేస్తున్నట్టు ఉన్నది. ఆ వీరవనితను చెక్కిన శైలి, ఆమె సాధారణ యోధురాలిగా కాకుండా, పాలక వర్గ స్త్రీ లాగానే అనిపిస్తున్నది. ఆ వీరగల్లుపై ఏ శాసనం లేదు. రుద్రమదేవి శిల్పం అందామంటే ఆధారం ఉండాలి. మరి ఆ యోధురాలు ఎవరు? అందుకే పొలాస పరిసరాల్లో కాకతీయ సామ్రాజ్య ఇతర ఆధారాలు ఇంకా వెతకాల్సి ఉన్నది.
కళ్యాణి చాళుక్యుల లాగానే వీళ్లు కూడా జైనాన్ని పోషించారు. క్రీ.శ. 1082 నాటి బానాజీపేట శాసనంలో మొదటి మేడరాజు వీరకమల జినాలయాన్ని కట్టించినట్టు తెలుస్తున్నది. గోవిందాపురం శాసనంలో పార్శ్వనాథుడి విగ్రహం పెట్టడం, హన్మకొండ పద్మాక్షమ్మ గుట్ట మీద కాకతీయ మంత్రి బేత భార్య మైలమతో పాటు మేడ రాజు కదలాలయ బసదిని నిర్మించడం వీరి జైన ఆచరణను సూచిస్తుంది. పొలాసలో ఇప్పటికీ జైన విగ్రహాలున్నాయి. పొలాసకు పక్కనే లక్ష్మీపురంలో బాహుబలి విగ్రహం బండకు చెక్కి ఉంది. నేటికీ లక్ష్మీపురం రెడ్లు దసరా రోజు బాహుబలికి పూజ చేసిన తర్వాతే మిగతా పండగ పనులు చేసుకుంటారు. పొలవాస రాజులు జైనంతో పాటు శైవ, వైష్ణవాల్ని కూడా ఆదరించారు. అందుకే పొలాసలో పౌలస్త్యేశ్వరాలయం శైవానికి, చాళుక్య శైలిలో ఉన్న వేణుగోపాల ఆలయం వైష్ణవానికి ఉదాహరణలు. ఇక్కడ దొరికిన మహిషాసురమర్ధిని, భైరవ, గణపతి శిల్పాలు శైలి రీత్యా కళ్యాణి చాళుక్య నుంచి కాకతీయకాలం వరకు కనిపిస్తాయి. నంది మేడారంలో సైతం రెండవ మేడరాజు కట్టించిన త్రికూటాలయం ఉందని జైశెట్టి రమణయ్య రాశారు.
ఇప్పటి జగిత్యాల పట్టణం పొలవాస రాజ్యంలో భాగంగా ఏర్పడ్డదే. పొలవాస పాలకుడైన జగద్దేవ పేరిట కట్టిన ‘జగదాలయ’ నేటి జగిత్యాల అనే జైశెట్టి రమణయ్య భావనకు ఇంకొంత బలమైన ఆధారం దొరకాల్సి ఉన్నది. ఏదేమైనా జగిత్యాల జిల్లా చరిత్రనే కాదు, పాత కరీంనగర్ జిల్లా చరిత్ర, ఇంకా మునుపటి అస్తిత్వమైన సబ్బి సారయ మండలపు చరిత్రలో పొలవాసది ప్రత్యేక అస్తిత్వమే. ఇప్పటి పొలాస, చుట్టూ ఉన్న మట్టికోట, పక్క గ్రామాలు ఎన్నో ఆధారాలను ఇప్పటికీ తమలో దాచుకునే ఉన్నాయి.
డా. ఎం.ఎ. శ్రీనివాసన్
81069 35000