కార్తిక మాసానికి కౌముది మాసం అని పేరు. కౌముది అంటే వెన్నెల. శరదృతువులో నిర్మల ఆకాశంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. ఈ మాసంలో చేసే పూజ, అర్చన, దాన, జప, స్నాన, అభిషేకాదులు విశేష ఫలితాన్నిస్తాయి. కార్తిక వ్రతంతో పోల్చదగిన వ్రతం మరొకటి లేదని చెబుతారు. ఈ నెలలోనే యోగనిద్రలో ఉన్న శేషశాయి మేల్కొంటాడు. వైకుంఠద్వారం తెరుచుకునే ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తుంది. అంటే మానవుడికి మోక్షమార్గం తెరుచుకుంటుందని అర్థం. అందువల్ల ఈ మాసంలో నిర్వర్తించే దైవ సంబంధ కార్యాలు సకల శుభాలను అనుగ్రహిస్తాయి.
శివకేశవుల అభేదాన్ని ప్రకటించే మాసం కార్తికం. ఈ నెలలో శివారాధన ఎంత విశేషమో, విష్ణుమూర్తి పూజ కూడా అంతే పుణ్యప్రదం. కార్తిక పురాణం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. కార్తికంలో నిత్యం స్నానం తర్వాత బిల్వ పత్రాలతో శివుడికీ, తులసీ దళాలతో విష్ణుమూర్తికీ అర్చనలు చేయాలి. ఉభయ సంధ్యల్లో దీపారాధన చేయడం విశేష ఫలాన్నిస్తుంది. ఈ మాసంలో దీపదానం చేయాలని చెబుతారు. ఇంట్లో కన్నా తులసి, ఉసిరి చెట్టు సమీపంలో చేసే దీపదానం శ్రేష్ఠమైంది. దీనికన్నా ఆలయంలో చేసే దానం ఉత్తమం. నదీ, సముద్రతీరంలో చేసే దానం అంతకన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కార్తిక బహుళ చతుర్దశి ఇందుకు శ్రేష్ఠం. కార్తిక పౌర్ణమి, లేదంటే ఈ నెలలో ఏదో ఒక రోజు ‘నమః పితృభ్యో ప్రేతేభ్యో నమో ధర్మాణ విష్ణవే, నమః సూర్యాయ రుద్రాయ కాన్తార పతయే నమః’ శ్లోకం చదువుతూ దీపాన్ని దానం చేయాలని శాస్త్ర వచనం.
కార్తికంలో ప్రతి శివాలయంలోనూ ఆకాశదీపం ఉంచుతారు. స్వయంగా ఆకాశదీపం పెడితే అంతకన్నా ఉత్తమ అర్చన మరొకటి ఉండదు. కుదరని పక్షంలో కనీసం ఆకాశదీపాన్ని చూసి, భక్తిభావంతో నమస్కరించినా విశేష ఫలితాలు కలుగుతాయి. ‘సర్వలోకాధిపో భూత్వా సర్వ సంపత్సమన్వితః, ఇహలోకే సుఖం భుక్త్వా చాన్తే మోక్షమవాప్నుయాత్’ అనే శ్లోకం చదువుతూ ఆకాశదీప దర్శనం, దానం వల్ల మోక్షం కలుగుతుందని నమ్మకం. కార్తికంలో క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, సత్యనారాయణ వ్రతం, కేదారేశ్వర వ్రతాలు ఆచరిస్తారు. ఈ నెలలో ‘కార్తిక పురాణం’ పఠించే నియమం ఉంది. కార్తిక మాస విశిష్టత, శివ, కేశవుల గొప్పదనంతోపాటు, జీవన సూత్రాలను తెలియజేసే ఈ పురాణాన్ని చదివినా, విన్నా పుణ్యప్రదం. – ఎ.భరత్‌కుమార్ శర్మ