‘హల్లో.. మాట్లాడేది లలితనేనా?’
‘ఔను లలితనే, మీరెవ్వలు సార్..?’
‘అమ్మా… నేను మంత్రి గంగుల కమలాకర్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్న. నీ పేరు మీద చెక్కచ్చింది. రేప్పొద్దున 11 గంటలకు ఆఫీసుకచ్చి చెక్కు తీస్కొనివో..’
‘సరే సార్.., అయితమాయెగని అదేం చెక్కు సార్?’ అని నీనిట్ల అడుగతనే ఉన్నా ఔతలి దిక్కున్న సార్ ఫోన్ కట్జేయనే జేసిండు. ఆయన జెప్పినట్టే తెల్లారి నా కొడుకును దోల్కొని కమలాకర్ సార్ ఆఫీసుకు వోయిన. అప్పటిదాన్క నాగ్గూడ తెల్వదు అచ్చిందేం చెక్కో. నేను వొయ్యేసరికి అక్కడ నా అసొంటోళ్లు మస్తుమందే ఉన్నరు. నేన్గూడ ఆ గుంపుల గల్సిన.
‘ఎవరవ్వా.. బిడ్డకు పెండ్లి చేస్తే గిట్ల లచ్చ రూపాలిచ్చింది?’
‘ఇయ్యాళ్ల, రేపు కిందవడితే జూసి నవ్వేటోళ్లే మస్తు మంది ఉంటరు గని, రూపాయి సాయం జేసేటోడుండడు. ఇగ ఎవ్వరోనటా.. నీకు లచ్చ రూపాలిత్తరా?. అయినా ఆడివిల్ల పెండ్లి జేత్తే తల్లిదండ్రులు ఎంత కర్సులపాలైతరో ఆ బాధ ఆడివిల్ల పెండ్లి జేసినోళ్లకే తెలుస్తది, రెండు పైసల మిత్తికి లచ్చ రూపాలు దెచ్చి లగ్గం ఎల్లదీసిన. ఇగిప్పుడు కమలాకర్ సార్ ఇచ్చే చెక్కును ఇడిపిచ్చి ఎవ్వలయాళ్లకు ముట్టజెప్తే నాకు పెద్ద లొల్లి వోతది..’
అక్కడున్న నా అసొంటి తల్లులిద్దరు ముచ్చట వెట్టుకుంటున్నరు. వాళ్ల మాటలిన్న నాకు సిన్న బిడ్డ సమత పెండ్లి బాపతు కల్యాణలక్ష్మి చెక్కు అచ్చిందని అర్థమైంది. ఒక్కసారి నా పెద్దబిడ్డ శ్వేత లగ్గం యాదికొచ్చింది.
అన్నట్టూ… నేనెవ్వలో ఎరుకేనా? నా పేరు కసిర లలిత. నా పెనిమిటి పేరు రాజయ్య. మాది కన్నారమే. కన్నారం దగ్గర బొమ్మకల్ రోడ్డుకుండే లారీల కార్ఖానల పన్జేసేటోడు. 2002ల లారీ కార్ఖానల కట్టెల పన్జేస్తుండంగనే శెక్కరచ్చి, గిర్రుమని తిర్గి కిందవడిపోయిండంటే ఇగ మళ్ల లెవ్వలే. దగ్గెర దగ్గెర పదేండ్లు మంచాలనే ఉన్నడు. ఆయన మంచిగున్నప్పుడు నన్నూ, నా కొడుకును, నలుగురు ఆడివిల్లల్ని అయినంగ, అపురూపంగ జూసుకున్నడు. మమ్ముల కంటికి రెప్పలా కాపాడుకున్నడు. గనీ, ఆ దేవునింట్ల మన్ను వొయ్యా.. ఆ దేవుని కన్లే ఓర్వలే.
ఆల్షమైనా మంచిదేగని, నా పెనిమిటి రాజయ్య మళ్లా లేసి తిరుగుతడనే ఆశ నాకుండె. నా నలుగురు బిడ్డలకు కాళ్లు కడిగి కన్యాదానం జేస్తడనే నమ్మకమూ ఉండె. గనీ, నా నమ్మకం ఉత్తదే అయింది. నా ఆశలల్ల నీళ్లువోసి 2012ల మార్చి 17న జీవిడిసిండు. అప్పటికి నలుగురిట్ల ఒక్కల్ది గూడ లగ్గం గాలె. నా కొడుకు నాగరాజు సిన్నపోరడు. నేనూ, వాడు నా నలుగురు బిడ్డల్ని జూసుకుంటా బిక్కుబిక్కుమని బతికినం.
ఆ గంగవ్వ కడుపు సల్లగుండా, మా అవ్వ గౌరవ్వ తర్వాత నాకు అవ్వసువంటిది. గంగవ్వ మా ఇంటిముందల ఉండే ఓ పెద్దమనిషి. ఆపతికో, సంపతికో గంగవ్వనే ఇంటిపెద్దయి నిలవడుతుండె. కట్టమో, సుఖమో గంగవ్వ కొడుకులే తోడవుట్టినోళ్లయిన్రు. రాజయ్య కాలంజేసినంక రెణ్నెల్లకు పెద్ద బిడ్డకు లగ్గం దోరింపైంది. పదేండ్ల వట్టి మంచాన వడి ఉన్న రాజయ్యను మంచిగ జేస్కోవడానికే లచ్చల అప్పయింది. ఇగ పెద్ద బిడ్డ పెండ్లి ఎట్లా జేసుడా అని బాధ వడ్తుంటె గంగవ్వ కొడుకులే ముందటవడ్డరు. తలా ఇంత సాయం జేసి పెద్దబిడ్డ శ్వేతకు లగ్గం జేసిర్రు.
పెండ్లి మా జేసినం గని అటు రాజయ్య రోగానికి, ఇటు పెద్దబిడ్డ పెండ్లికైన అప్పే కుప్పయి గూసున్నది. ఇప్పట్లెక్క ఆడివిల్ల పెండ్లి జేస్తే లచ్చ రూపాలు ఇచ్చే స్కీం అప్పుడుంటే మంచిగుండు. అది లేకనే ఉన్న నాలుగ్గుంటల భూమి అగ్గువకు అమ్ముడువోయింది. అదే భూమి ఇప్పుడుంటెనా కోటి రూపాలస్తుండె గావొచ్చు! తతిమా ముగ్గురు బిడ్డల పెండ్లిళ్లు వోంగ కొన్ని పైసలు గూడ మిగిలేటియి గావొచ్చు! నలుగురాడివిల్లల పెండ్లిళ్ల కోసం నా కొడుకు నాగరాజు చేయరాని కట్టం జేసిండు. నా పెనిమిటి రాజయ్య ఉంటే మాకీ గతి రాకపోతుండెనేమో.. ఆయన లేకనే నా జీవితం మిత్తీలు కట్టుడుకే సరిపోయింది. నా పెద్దల్లుడు సత్తీషు సక్కదనాల మనిషి. అల్లుడు కాలువెట్టినంకనే ఇంటికి లక్ష్మి అచ్చింది. సత్తీషు పెద్ద దిక్కయి ఇంటిని ముందటుండి నడిపిచ్చిండు.
2023 ఫిబ్రవరి 21 మంగలారం పగటీలి పన్నెండు గొడ్తున్నది. మంత్రి కమలాకర్ సార్ రానే అచ్చిండు ఆఫీసుకు. ఒగలెన్క ఒగల్కి మూడు వందల కల్యాణలక్ష్మి చెక్కులు అందించిండు. ఆ చెక్కులను అందుకున్నోళ్లందరు మస్తు సంబురవడ్డరు. చెక్కులిచ్చే కార్యం అయిపోయినంక అందరం గల్సి ఆయనకు రెండుజేతులా దండం వెట్టినం.
‘అవ్వలూ… మీరు మొక్కాల్సింది నాగ్గాదు, అగ్గొ పట్నం నుంచి మీకు చెక్కులు పంపిన గా పెద్దాయ్నకు మొక్కుర్రి’ అని గోడకున్న పోట్వను సూపెట్టిండు కమలాకర్ సార్. ఆ పోట్వల కేసీఆర్ సార్ నవ్వుకుంటా గనవడ్డడు.
‘సారూ.. మా అసొంటి పేదోళ్ల దీవెనలు మీకెప్పటికీ ఉంటయి. మీరు నిండు నూరేండ్లు సల్లగుండాలె. మీరు మంచిగుంటనే ఈ రాష్టం పచ్చగ కళకళలాడుతది’ అని ఎవ్వలో అనవట్టిర్రు.
‘ఔను నిజమే కదా’ నాగ్గూడ అట్లనే అనిపిచ్చింది.
గడ్డం సతీష్: 99590 59041