నిజాయితీ గల న్యాయమూర్తికి సీబీఐ అన్నా, ఏ ప్రభుత్వమన్నా భయం ఉండదు. చట్టం ముందు ఎవరు ఉన్నతులు, ఎవరు సామాన్యులు అనే భేదం ఉండకూడదు అనే సూత్రాన్ని తమ తీర్పుల ద్వారా నిలబెట్టేవారు న్యాయవ్యవస్థకు అసలైన బలం. ఇటీవలి మూడు ఘటనలు ఇందుకు నిదర్శనం. ఇవన్నీ కలిపి చూస్తే భారత న్యాయవ్యవస్థ స్వతంత్రత, ధైర్యం, బాధ్యత గురించి విస్తృత చర్చకు దారితీస్తాయి.
న్యాయపరమైన ధైర్యానికి ప్రతీక జడ్జి జితేంద్ర ప్రతాప్‌సింగ్ తీర్పు గౌరవనీయులైన న్యాయమూర్తి జితేంద్ర ప్రతాప్‌సింగ్ ఒక కీలక కేసులో అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించారు. కేసులో ఉన్న అందరు నిందితులను విముక్తి చేస్తూ, ఇది ట్రయల్ నిర్వహించడానికి తగిన కేసు కాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసు విచారణ నిర్వహించడమంటే విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయడం, నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులను అనవసరంగా వేధించడం అవుతుందని అన్నారు.
ఆయన గమనించిన ప్రధాన అంశం ఏమిటంటే- సరైన ఆధారాలు లేకుండా, కేవలం అప్రూవర్ వాం గ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయడం చట్టసమ్మతం కాదు. దర్యాప్తు ప్రక్రియలో చట్టపరమైన ప్రమాణాలు పాటించకపోవడం గురించి దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి ఆదేశించడం మరింత ప్రాధాన్యత కలిగిన విషయం. ఈ తీర్పు.. న్యాయపరమైన ధైర్యానికి, నైతిక స్థైర్యానికి ప్రతీక. ప్రజాస్వామ్యంలో దర్యాప్తు సంస్థలపైనా, అధికార యంత్రాంగంపైనా కోర్టు పర్యవేక్షణ ఎంత ముఖ్యమో ఈ తీర్పు చూపించింది.
జూలై 2025లో, జైపూర్‌లోని వాణిజ్య కోర్టు న్యాయమూర్తి దినేశ్‌కుమార్ గుప్తా ఒక కీలక తీర్పు వెలువరించారు. ఈ వివాదం Parsa Kente Collieries Limited (Adani Group ఆధ్వర్యంలోని సంస్థ), రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన విద్యుత్తు సంస్థ మధ్య సాగింది. ప్రాజెక్టులో 74% వాటాతో ఆ సంస్థ మెజారిటీ భాగస్వామిగా ఉన్నది. వివాదం బొగ్గు రవాణా ఖర్చులపై జరిగింది. ఒప్పందం ప్రకారం కంపెనీ స్వయంగా నిర్మించాల్సిన రైల్వే సైడింగ్ వరకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉండగా, రోడ్డు రవాణా ఖర్చుల పేరుతో రాష్ట్ర విద్యుత్తు సంస్థ నుంచి రూ.1,400 కోట్లకు పైగా వసూలు చేసినట్టు కోర్టు గుర్తించింది.
ఈ నేపథ్యంలో సంస్థపై కోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా, సంస్థల మధ్య ఒప్పందాన్ని కాగ్ ద్వారా ఆడిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అదే రోజు జడ్జి గుప్తా బదిలీ కావడం సంచలనంగా మారింది. వెంటనే రాజస్థాన్ హైకోర్ట్ ఆయనను బ్యావర్ జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. వాణిజ్య కోర్టు బాధ్యతల నుంచి ఆయన దూరమయ్యారు. ప్రభుత్వం ఈ బదిలీని సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమని పేర్కొన్నప్పటికీ, కార్పొరేట్ సంస్థపై తీర్పు వెలువడిన రోజునే బదిలీ జరగడం ప్రజల్లో అనుమానాలకు తావిచ్చింది.
మరో ముఖ్యమైన ఉదాహరణగా ఎన్డీటీవీ వ్యవహారం నిలుస్తుంది. సంస్థ యజమానులు ప్రణయ్‌రాయ్, రాధికా రాయ్‌పై 2016లో ఆదాయపన్నుశాఖ రీఅసెస్మెంట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇచ్చిన వడ్డీ రహిత రుణాలపై పన్ను అంశాన్ని ప్రస్తావించాయి. అయితే, ఇదే అంశంపై 2011లో విచారణ ప్రారంభమై 2013లో ముగిసిన తర్వాత, మళ్లీ 2016లో అదే విషయాన్ని పునఃపరిశీలించడం చట్టబద్ధం కాదని ఢిల్లీ హైకోర్ట్ స్పష్టం చేసింది.
ఆ నోటీసులను పూర్తిగా రద్దు చేసింది. అంతేకాకుండా, ఆదాయపన్ను శాఖపై రూ. 2 లక్షల ఖర్చు జరిమానా విధించింది. ఒకే అంశాన్ని మళ్లీ మళ్లీ తెరపైకి తేవడం అనవసరమైన అనిశ్చితిని కలిగిస్తుందని కోర్టు పేర్కొన్నది. ఈ తీర్పు ద్వారా ప్రణయ్‌రాయ్, రాధికారాయ్పై ఆ ప్రత్యేక పన్ను వివాదం ముగిసింది. కానీ ఈ వ్యవహారం దాదాపు 18 ఏండ్లపాటు కొనసాగడం గమనార్హం. న్యాయప్రక్రియలో ఆలస్యం ఎంతటి వ్యక్తిగత, వృత్తిపరమైన నష్టాన్ని కలిగిస్తుందో ఈ వ్యవహారం చూపించింది.
ఈ మూడు ఉదాహరణలను కలిపి చూస్తే కొన్ని ప్రధానాంశాలు వెలుగులోకి వస్తాయి:
1. దర్యాప్తు ప్రమాణాలు: కేవలం అప్రూవర్ వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేయడం న్యాయసిద్ధాంతాలకు విరుద్ధం.
2. కార్పొరేట్-రాష్ట్ర సంబంధాలు: భారీ కార్పొరేట్ సంస్థలపై తీర్పులు వెలువడిన సందర్భంలో పరిపాలనా చర్యలు ప్రజల్లో అనుమానాలకు దారితీస్తాయి.
3. పన్ను అధికారుల జోక్యం: ఒకే అంశంపై పునరావృత రీయసెస్మెంట్ చర్యలు వ్యక్తులపై దీర్ఘకాలిక ఒత్తిడిని సృష్టిస్తాయి.
4. న్యాయవ్యవస్థ స్వతంత్రత: ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే న్యాయమూర్తులే వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెడతారు.
భారత రాజ్యాంగం న్యాయవ్యవస్థకు స్వతంత్ర స్థానం ఇచ్చింది. కార్యనిర్వాహక, శాసన, న్యాయ విభాగాల మధ్య సమతౌల్యం ప్రజాస్వామ్యానికి ప్రాణం. జస్టిస్ జితేంద్ర ప్రతాప్ సింగ్ లాంటి న్యాయమూర్తులు, చట్టాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుని ఇచ్చే తీర్పులు ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాయి. మరోవైపు, జడ్జీల బదిలీల వంటి పరిణామాలు పారదర్శకంగా జరిగితేనే అనుమానాలు తొలగుతాయి. ఎన్డీటీవీ వ్యవహారం చూపినట్టు, కోర్టులు చివరకు చట్టబద్ధతను కాపాడగలవు. కానీ న్యాయప్రక్రియ వేగవంతం కావడం కూడా అంతే అవసరం.
న్యాయవ్యవస్థ స్వతంత్రత కేవలం రాజ్యాంగ పాఠ్యంలో ఉండే మాట కాదు. అది ప్రతి తీర్పులోనూ ప్రతిఫలించాలి. దర్యాప్తు సంస్థలు, పన్ను శాఖలు, ప్రభుత్వ యంత్రాంగం- ఇవన్నీ చట్టపరమైన పరిమితుల్లోనే పనిచేయాలి. జితేంద్ర ప్రతాప్ సింగ్ ధైర్యమైన తీర్పు, జైపూర్ వాణిజ్య కోర్టు తీర్పు చుట్టూ జరిగిన పరిణామాలు, ఢిల్లీ హైకోర్టు ఎన్డీటీవీ వ్యవహారంలో తీసుకున్న నిర్ణయం ఇవన్నీ కలిసి ఒక సందేశం ఇస్తున్నాయి.
న్యాయం ఆలస్యమవుతుండవచ్చు, కానీ ధైర్యంగా నిలబడే న్యాయమూర్తులు ఉన్నంతకాలం న్యాయం నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసమే పెద్ద బలం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టేది చట్టం ముందు సమానత్వం, పారదర్శకత, నిర్భయ న్యాయ నిర్ణయాలే. భారత న్యాయవ్యవస్థ వర్ధిల్లాలి!
(వ్యాసకర్త: న్యాయవాది)
-తన్నీరు శ్రీరంగారావు