బేగంపేటలోని స్వామి రామానందతీర్థ అంటేనే ప్రకృతితో మమేకమైన సంస్థ. వనాలను కంటికి రెప్పలా చూసుకునే సంస్థ అది. ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై ప్రచారం చేసే బాధ్యతనూ నెత్తిన పెట్టుకుంది. అలాంటి సంస్థకు చైర్‌పర్సన్‌గా నేను బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఇప్పుడు అంశం ఆ సంస్థ గురించి కాదు, ఆ సంస్థలో కొన్నేండ్ల క్రితం జరిగిన ఓ ఘటన గురించి, కంచ గచ్చిబౌలి చుట్టూ అలుముకుంటున్న వివాదం గురించి, ప్రకృతిపై గొడ్డలి వేటు గురించి.
కొన్నేండ్ల క్రితం వరద బీభత్సంతో దాదాపు హైదరాబాద్ నగరం నీట మునిగిపోయింది. స్వామి రామానందతీర్థను సైతం వరద ముంచెత్తింది. ఆ ప్రభావంతో ఐదారు దశాబ్దాల నాటి రెండు చెట్ల కొమ్మలు నేలకొరగడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో సిబ్బంది ఆ కొమ్మలను తొలగించారు.
ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ కొమ్మలను తొలగించిన పాపానికి ఆగమేఘాలపై అర్బన్ ఫారెస్ట్ విభాగం కదిలివచ్చింది. ‘మీరు చెట్లను నరికివేశారు’ అంటూ కేసు నమోదు చేసింది. మల్లారెడ్డి అనే ఉద్యోగిని కార్యాలయానికి తీసుకెళ్లి రోజంతా కూర్చోబెట్టారు. ఆ తర్వాత విషయం తెలిసి నేను అధికారులతో మాట్లాడాక గానీ, వారికి నిజం తెలియలేదు. సంస్థ చేస్తున్న కార్యకలాపాల గురించి, ప్రకృతి పరిరక్షణ గురించి తెలుసుకొని అధికారులు నాలుక్కరుచుకున్నారు. అయితే, ‘మేడం.. కేసు నమోదైంది కదా, ఇప్పుడు ఏమీ చేయలేం. రూ.25 వేలు జరిమానా చెల్లించండి’ అని చెప్పడంతో చేసేదేమీ లేక ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. రెండు కొమ్మలను నరికితే ఏకంగా చెట్లనే నరికివేశారంటూ అర్బన్ ఫారెస్టు అధికారులు తీసుకున్న చర్యలు ఇవి. అందులోనూ హైదరాబాద్ స్టేట్ విమోచనం కోసం పోరాడిన స్వామి రామానందతీర్థ, ఆయన శిష్యుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నెలకొల్పిన భవన ప్రాంగణం అని కూడా ఆలోచించకుండా చర్యలకు దిగారు.
నిజానిజాలను పక్కనబెడితే చెట్లు నరికారన్న విషయం తెలుసుకొని ఆ అధికారులు స్పందించిన తీరు నిజంగా శభాష్ అనాల్సిందే. మరి ఇప్పుడు కంచ గచ్చిబౌలి పరిస్థితి ఏమిటి? నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న వేల చెట్ల పరిస్థితి ఏమిటి? ఎకో పార్కు అంటూ సర్కారు చేసే కుట్రలో 400 ఎకరాల్లో జంతుజాలం, వృక్షజాతుల మనుగడ ఏమిటి? అన్నది ప్రశ్నార్థకం. భవిష్యత్తులో మానవ మనుగడకు ‘ఆయువు’పట్టుగా ఉన్న వృక్షసంపదను హరింపజేసేందుకు సిద్ధమవుతున్న సర్కారును ఏమనాలి? స్థలం ప్రభుత్వానిదా.. లేక హెచ్సీయూదా? అని అడగడం లేదు. కానీ, 400 ఎకరాల అడవిని రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారమెత్తి వేలం వేయడం ద్వారా అటవీ సంపద నాశనం కాదా? ప్రకృతి అంటే జీవన విధానం. అలాంటి ప్రకృతిని నాశనం చేసేలా కంచ అడవులను వేలం వేయడం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే.
ఒకవైపు జనాభా పెరుగుతున్నది.అర్బనైజేషనూ విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో మనిషి మనుగడకు ఏ మేరకు ఆక్సిజన్ అవసరమో గుర్తించాలి. ఆ మేరకు ఉన్న వృక్ష సంపదను కాపాడుకుంటూ మరింతగా మొక్కలు నాటే కార్యక్రమం ఒక ఉద్యమంలా కొనసాగించాల్సిన తరుణంలో ఉన్న ప్రకృతిపై వేటు వేయడం సరైనదా అన్నది పర్యావరణవేత్తలు, మేధావులు ఆలోచన చేయాలి. గళం విప్పాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో పచ్చదనాన్ని పెంచినట్టు జాతీయ సంస్థల నివేదికలే స్పష్టం చేశాయి. పెరుగుతున్న ప్రజావసరాలకు అనుగుణంగా ఒక బాధ్యతగా పచ్చదనాన్ని పెంచాల్సిన ప్రస్తుత సర్కారు ఇప్పుడు అటవీ సంపదపై వేటు వేయడం ఏ మాత్రం హర్షదాయకం కాదు. (వ్యాసకర్త: శాసనమండలి సభ్యురాలు)
– వాణీదేవి