నువ్వు పయనమైన దారినిండా
మోదుగుపూల రెక్కలు,
మల్లియల పరిమళాలు
పరుచుకున్నాయి అనుకున్నావా?
పరిచినవన్నీ పల్లేరుకాయలు.
నీవే ప్రాణం, నీ మీదే ప్రాణం అంటూ
నీలోకి దిగబడే గాలపు కోరలు.
ఆదమరిచి అరమోడ్పు కన్నుల చూస్తున్నావా?
విషపునవ్వుల పూలు అవి.
క్షణకాలంలో నీకుత్తుకలో జారి
నిన్నే మాయం చేసే సైనేడ్ మోహమది.
ఊసులకు తీయని తేనె పూసిన నైజం అది.
ప్రాణ నాడుల్ని తుంచి, తుదముట్టించే ప్రణయపు చేతులవి.
వెక్కిళ్లు వెక్కిళ్లుగా నువ్వు తెగిపడినా
తడి తాకని అహం అది.
కాలం చుట్టూ నువ్వల్లుకున్న స్వప్నాలలోకి చొరబడి
నాకిప్పుడే ముగించాలని లేదు అంటూ
పారవశ్యపు గీతం వినిపించి,
కాలికింద మసిగా మార్చే రహస్య తాంత్రికుడు వాడు.
నీ నమ్మికలపైన సమాధికి సైతం మెత్తటి
పూరెక్కల పరిమళాల తాపడం చేయగల సాహసి.
ప్రేమ పిపాసి మారుపేరుతో
నీ వెనకే, నీ వెంటే, నీతోనే అంటూ
అడుగులకు మడుగులొత్తుతాడు.
జర భద్రం సెల్లె, జరపైలం అక్కా.
భ్రమల కాలం నడుస్తున్నది,
నటనల కీర్తిబావుటాలు ఎగురుతున్నవి.
కాలిబూడిదైనా!
ఈ పర్వంలో చిక్కుముడులు వీడకనే ముగిసిన
జీవం గురించే ప్రశ్నలు.
జర భద్రం. జర పైలం..
సీహెచ్ ఉషారాణి: 94412 28142