అవునులే
ఏడవడం నీక్కొత్తకాదుగా
మనిషి నాగరికత నేర్చుకున్నది మొదలు
అభివృద్ధి చక్రాల క్రింద
ప్రతిరోజూ నలిగిపోతున్నదానివి
ఏడుపిప్పుడు
నీ ఉనికిని చాటే గుండె చప్పుడయ్యింది
అది విపత్తులకు ఆహ్వానమో!
వినాశనానికి సంకేతమో!
నీకు మాటలు రాకపోతేనేం?
చల్లని గాలితో పలకరిస్తావు
నీకు కళ్లు లేకపోతేనేం?
అందరినీ సమదృష్టితోనే చూస్తావు
నీకు చేతులు లేకపోతేనేం?
నీ నీడ గొడుగులోకి అక్కున చేర్చుకుంటావు
నీకు చెవులు లేకపోతేనేం?
అన్నార్తుల బాధలు విని ఆకలి తీరుస్తావు
కాటికైనా, కాగితానికైనా నీ దేహాన్నిచ్చి
ఏ క్రతువులూ చేయకుండానే
మోక్షాన్ని పొందుతావు
అందుకేనేమో!
కొన్ని ఓర్వలేని కళ్లు-నీ గొంతు కోస్తున్నాయి
తల్లి తనపు ప్రేమను పంచి
తండ్రి తనపు త్యాగాన్ని నేర్పి
దేశం కోసం సైనికుడు ప్రాణమొదిలినట్టు
మనుషుల కోసం ప్రాణాలొదిలేసే నీకు
నీ కోసం నువ్వు బ్రతికేరోజు రావాలి
నిన్ను నేలపై కాకుండా
మనిషి తన గుండెల్లో నాటుకునే రోజు రావాలి
నీ దిగులు చీకట్లను తొలగించి
నీ పెదాలపై
నవ్వుల పువ్వులు పూయించే రోజొకటి రావాలి
ఎన్. నరేశ్ చారి
97013 34516