మా ఊరి కోదండరామాలయం పూజారి రత్నమాచారి ప్రస్తావన ఇంతకుముందొకసారి వచ్చింది. ఆయన బతుకడానికి పూజారి అయినప్పటికీ కడు ప్రజ్ఞావంతుడు. మా ఊరి కరణం పంతులుగారు, పోలీస్ పటేల్, మాలీ పటేల్ అవసరమైనప్పుడు ఆచారిగారితో సంప్రదింపులు జరిపేవారు.
రోజూ జరిగే సాయంకాల సమావేశాల్లో పెద్దమనుషులకు రత్నమాచారి ఉర్దూ ప్రాచీన, ఆధునిక కవిత్వంలోని ఎన్నో రసవత్తర వాక్యాలను వినిపించే వాడు. 1948 సెప్టెంబర్ 17న ముగిసిన పోలీసు చర్య అనంతరం పూజారి చారి వైఖరి మారింది. ఆయన ఉర్దూ కవితలను మానేసి, హఠాత్తుగ పోతన, వేమన పద్యాలను, ఆధునిక కవితలను వినిపించడం ప్రారంభించాడు. అప్పటివరకున్న ఉర్దూ వాతావరణం తెలుగు వాతావరణమైంది! మా ఊరిలోనే కాదు, తెలంగాణ అంతటా గ్రామాల్లో మార్పు, యుగపరివర్తన స్పష్టంగా కన్పించింది. గ్రామాల్లో, పట్టణాల్లో సారస్వత పరిషత్తు తెలుగు పరీక్షలు రాసే వారి సంఖ్య బాగా పెరిగింది. తెలంగాణ అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులో విద్యాబోధన ప్రారంభం కావడం చరిత్రాత్మక పరిణామం. తెలంగాణ చరిత్రలో, తెలుగు భాషపట్ల ప్రజల్లో మహత్తరమైన మార్పు.
తెలంగాణ స్త్రీల భాషలో, పురుషుల పదజాలంలో కాళేశ్వరం జలతరంగాల వలె ఉర్దూ పదాలు ఎగసిపడిన రోజులు అవి. ఉర్దూ మాతృభాష అయిన వారికంటె తెలుగు మాతృభాష అయినవారే ఉర్దూలో ఎక్కువ పండితులన్న అభిప్రాయం ఏర్పడిన రోజుల వి. వరంగల్లో మా ఇంటికి రోజూ ఉర్దూ దినపత్రిక ‘రయ్యత్’ వచ్చేది. ఇంటిలో అందరు స్త్రీలు, పురుషు లు ఆ పత్రికనే చదివేవారు. మా బాపు (నాయన), నలుగురు అన్నలు తెలుగు, ఉర్దూ కవులు, రచయిత లు. ‘లల్కార్ (పిలుపు) పత్రికలో రాసేవారు. మా అక్క ఉర్దూ పదాలు లేకుండా తెలుగు మాట్లాడేది కాదు. ఆమె అత్తగారి ఊరు కూనూరు, వరంగల్ జఫర్ గఢ్ దగ్గరి ఒక గ్రామం. అక్కడి ముక్తేదారుల కుటుంబాల్లో ఉర్దూ ఎక్కువగా మాట్లాడేవారు. వారి ముఖద్దమా అదాలత్లో ఉర్దూ ఎక్కువగా ఉండేది. ఇజ్జత్, జిందగి, మొహబ్బత్, మస్లా, పరేషాన్, తాతీలు, ఖబ్జా, దూర్, జోర్, జమీన్, జోష్, జబర్దస్త్, ఇజలాష్, ఇంత్యహాన్, ఇంత్యజార్, ఇంఖిలాబ్, ఇబ్తదాయి వంటి ఉర్దూ పదాలు ఆమె మాటల్లో వినిపించేవి. కాలానుగుణ్యమైన మార్పు మా ఇంటిలోనూ వచ్చింది.. తెలుగు భాషకే ప్రాధాన్యం లభించింది.
దాదాపు వందేండ్ల కిందట హైదరాబాద్లో ఒక సమావేశంలో ఒక తెలుగుబిడ్డ (హైదరాబాదీ) తెలుగులో ప్రసంగించబోగా అవహేళన, అవమానం జరిగాయి. దీని కారణంగా ఆ రోజు సాయంత్రమే పది మందితో తెలంగాణ తెలుగు పరిరక్షణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. అనంతరం-ఆ అంకురమే క్రమంగా భవిష్యత్తులో బహుముఖ మహోద్యమమై ఒక మహా ప్రజానాయకుని నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అవతరణకు దోహదపడింది. తెలంగాణలో తెలుగు భాష, సారస్వతాలు బతికి ఉన్నాయని సురవ రం ప్రతాపరెడ్డి 80 ఏండ్ల కిందటనే సాక్ష్యాధారాలతో నిరూపించారు. 1930 నుంచి 1943 వరకు ఆంధ్ర మహాసభ వార్షిక మహాసభలు, సారస్వత పరిషత్తు సభలు, కార్యక్రమాలు.. తెలంగాణలో ఎవరు ప్రాబ ల్యం వహించినా- తెలుగు భాషకు తెగులు పట్టబోదని, తెలంగాణ తెలుగు చచ్చు భాష కాదని నిరూపించాయి. తెలంగాణ ఉద్యమ ఫలం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రం, ఒక సాహిత్యవేత్త నేతృత్వం.. తెలుగు భా ష-సారస్వతాల నిరంతర వికాసానికి పెట్టని కోటలు.
దేవులపల్లిపల్లి ప్రభాకరరావు