వ్యవసాయం ఆయాసంగా
మారిన ఆ రోజులు
వర్షాలకై ఎదురుచూపులు
అవి రాక కన్నీళ్లతోనే తడారిన బతుకులు!
మందు సంచులకై
దుకాణాల ముందు చెప్పుల బాటలు
చేతికర్ర చేయూతగా కునికిపాట్లు
ఆకలితో అలమటించిన ఇక్కట్లు!
కరెంటు కోసం కండ్లల్లో వొత్తులు
తీగలు దండాల వరుసలుగా!
పెట్టుబడులు లేక ఆస్తుల తాకట్టు
కుదువపెట్టిన తాళిబొట్టు!
ఆడపిల్ల పెండ్లికుంటే
చేయలేక పెండ్లి ఆలస్యమైతే
లోకుల ఎగతాళి తట్టుకోలేక
ఎన్ని తాళ్ళు ఉరితాళ్లయ్యాయో?
నేడు కనురెప్ప పాటు కూడా
కోతలు లేని కరెంటు
కళకళలాడే జలసిరులు
నేల తనువు అణువణువు తడుపు!
రైతుబంధుతో రైతుకు
పెట్టుబడికి లేని బాదర బంది
ధాన్యం రాశులు రాశులుగా
మార్కెట్లన్నీ నిండుకుంటున్న వైనం!
ఇంటిలక్ష్మిని కల్యాణలక్ష్మి
పలుకరిస్తున్న అనుభూతులు
ఆరోగ్యం మహాభాగ్యంగా
ఆరోగ్యశ్రీ అందరికీ రక్షగా!
తెలంగాణాన సాంఘిక మార్పులు
సాంస్కృతిక విజయాలు
తెలంగాణ యాస విలన్ భాష కాదంటూ
ఆస్కార్‌కు మన నాటు పాట!
ఈ విజయాలన్నీ నాడు కలలు
నేడు నెరవేరిన స్వప్నాలు
ఇన్ని సాధించిన తెలంగాణకు నమస్తే!
మంచి అన్నది మంచిదే కదా విస్తరిస్తే!!