సూర్యుడొచ్చే పొద్దుకే
కొట్టంలోని ఎద్దులకు కాడిమాకు పెట్టినట్లు
మమ్మల్ని నీ పాదాలకు తొడిగితివి
మీ నాన్న నాగలిసాలు దున్నినట్టు
మైదానమంతా నాలుగు చుట్లు పరిగెత్తితివి
వరిమడిలో బురద చిట్లకుండా
ఎద్దు తోకను పగ్గానికి ముడివేసినట్టు
మైదానంలో కాళ్ళల్లోకి ఇసుకెళ్ళకుండా
సాక్స్‌లు తొడిగి లేసులతో బిగించి కట్టితివి
మసక మసక చీకటి ఉండంగనే
మీ నాన్న పొలంలో కష్టపడుతాడు
లక్ష్యం కోసం నీవు పరుగులు పెడుతుంటావు
ఆకలి పోరాటం మీ నాన్నది
ఉద్యోగంకై ఆఖరి పోరాటం నీది
ఒడ్డుచెక్కి చమట చిందిస్తున్న మీ నాన్న వలే
శరీరాన్ని హూనం చేస్తూ చమట చిందిస్తావు
వరిమడిలో చమటచుక్క సంద్రమై మెరిస్తే
మైదానంలో చమటచుక్కే ప్రతిబింబమై నిలిచే
సేద్యం చేసే రైతుకు, దుక్కి దున్నే
ఎద్దులకు విరామం లేనట్టు
మాకు నీకు విరామముండదు
పరుగుపందెంలో విజయం సాధించే వరకు
రైతుకు తోడుగా ఎద్దులున్నట్టు
నీకు తోడుగా మేమున్నామంటూ
ధ్యానం చేస్తే మానసిక శక్తి లభించినట్టు
పరుగెడుతుంటే శారీరక దృఢత్వం లభిస్తుందని
పెందలాడే నన్ను పరుగెత్తిస్తున్నాయి
నా రన్నింగ్ బూట్లు
ఎజ్జు మల్లయ్య
96528 71915