నువ్వెంత
గట్టి విత్తనానివైనా
మట్టిపొర స్పర్శ లేనిదే
మొక్కయి మొలకెత్తలేవు!
ఎంత సారవంతమైన
మట్టిపొరను కప్పుకొన్నా
ఒక్క వాన చినుకు రాలందే
నిటారుగా నిలబడలేవు!
ఉద్వేగంతో ఎంత పైకి ఎదిగినా
దినకరుని వెచ్చని చూపు సోకందే
పచ్చదనం పులుముకొని
నేల తల్లికి హరితహారం కాలేవు!
ఇక్కడెవ్వరూ స్వతంత్రులు కారు
ఒకరి భుజం మీద మరొకరు
విశ్వాసంతో చెయ్యేసి నడవందే
పొద్దు పొడవదు ముద్ద దిగదు!
మట్టికీ ఆకాశానికీ
అంతరమెంత ఉన్నా
అదృశ్య బంధమొకటి
హరివిల్లయి అల్లుకుంటది!
విద్వేషాలు విచ్ఛిన్నాలే
జాతిచరిత్రకు అంటిన మరకలు
తడిసిన రక్తచరిత్రలవి ఎప్పటికైనా
రాగరంజితం చేసేవి సహనశీలాలే!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి: 94402 33261