పదో తరగతి అయిపోయేదాకా నేను పలురకాల పుస్తకాలు, పత్రికల మీది బొమ్మలు, కార్టూన్లను చూసి ప్రేమలో పడిపోయాను. నేనూ అలాంటి బొమ్మలు గీయాలని కలగన్నాను. అలా బొమ్మల మీది ప్రేమ నన్ను ఓ ఆర్టిస్టును చేసింది. దీనికంతటికీ కారణం.. చంద్ర సార్. బొమ్మలను చూస్తూ వాటిని గీస్తూ, దగ్గరి పోలికలుంటే ఎగిరి గంతేసి మురిసిపోయేది. అలా బొమ్మలు, కార్టూన్లు గీసే క్రమంలోనే వాటిని గీసింది ఆర్టిస్ట్ చంద్ర అని తెలిసింది. స్కూల్ ఎడ్యుకేషన్ భువనగిరిలో అయిపోయినంక హైదరాబాద్ చేరిన. చంద్రగారి బొమ్మల కోసం పాత పుస్తకాలు, మ్యాగజైన్లు వెతికి దాచుకునే వాడ్ని.
నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో అనుకుంటా 1984లో ఓ పత్రికలో చేరాను. అప్పటినుంచి చంద్ర సార్‌ను కలిసేవాడిని. ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఉంటుందని తెలియడంతో అందులో చేరాలనుకున్నా. ఓ రోజు బాగ్‌లింగంపల్లిలో బండిమీద పోతుంటే చంద్ర సార్ ఎదురయ్యారు. ‘సార్ నేను ఫైన్ ఆర్ట్స్‌లో చేరుతా’నన్నా. ఆయన వెంటనే ‘అవసరం లేదు’ అన్నాడు. ఎందుకంటే.. అప్పటికే నాకు పెండ్లి అయి ఓ బిడ్డ కూడా. ఫైన్ ఆర్ట్స్‌లో చేరితో ఉద్యోగం మానేయాల్సి వస్తుందని, బతకటం కష్టమవుతుందని ఆయన బాధ. పెద్దాయన ముందు.. సరేనని తలూపి వెళ్లిపోయయాను. కానీ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాలన్న కోరిక పోలేదు. చివరికి ఫైన్ ఆర్ట్స్‌లో చేరాను. ఐదేండ్ల ఫైన్ ఆర్ట్స్ కోర్స్ అయిపోయే దాకా చంద్రం గారిని కలువలేదు. ఎందుకంటే.. ఆయన మాట జవదాటాను కదా అనే అపరాధ భావం నన్ను వెంటాడింది.
నేనూ, మా తరంవాళ్లం చంద్ర సార్‌కు ఏకలవ్య శిష్యులం. అయన గీతను అనుసరిస్తూ, అనుకరిస్తూ పెరిగినవాళ్లం. ఆయన మీది గౌరవం తీర్చుకోవటం కోసం 1987లో భువనగిరిలో నా బొమ్మల ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసి దానికి అతిథులుగా చంద్రం, మోహన్ గార్లను పిలిచాను. ఆ తర్వాతి కాలంలోనూ.. ఎప్పుడు కొంత సమయం దొరికినా ఆయన దగ్గర గడపాలనే తపన ఉండేది. ఆయన రాస్తున్నప్పుడూ, బొమ్మలు గీస్తున్నప్పుడూ ఆయన వేళ్లను చూడాలి..! ఆ చేతివేళ్లలోనే ఏదో మహత్తు ఉన్నదనిపించేది. అంత వయ్యారంగా అవి వంపులు తిరుగుతూ ఉండేవి. ఆయన గీసిన బొమ్మలు ఎంత అందంగా ఉంటాయో.., చంద్ర సార్ కూడా అంతే అందగాడు. ఆయన రూపం, హేర్ ైస్టెల్.. అందానికి అదనపు అందాలు అద్దేవిగా ఉండేవి. ఆయన వ్యక్తిత్వం కూడా అంత స్వచ్ఛమైనది. తీయటి పలకరింపు, పంచే మమతానురాగం మరువరానివి.
ఆర్టిస్ట్ చంద్రం అంటే.. మహోజ్వల చైతన్య తెలంగాణ కాలానికి ప్రతీక. ప్రజా ఉద్యమకెరటాలకు సంకేతంగా, ఆయన గీసిన బొమ్మలు, అక్షరాలు చైతన్య జ్వాలలుగా నేటికీ ఉత్తేజాన్నిస్తాయి. ఉద్యమ సాహిత్య పుస్తకాలన్నింటిపై ఆయన గీసిన బొమ్మలే. అందమైన బొమ్మలే కాదు, జ్వాలాగ్నులైన గీతలు ఆయనవి. అలాగే ఇతర మ్యాగజైన్లలో గీసిన బొమ్మలు, కార్టూన్లు వేటికవే సాటి. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఓ తరాన్ని తన గీతతో.., బొమ్మతో ప్రభావితం చేసిన చంద్రం సార్‌కు కన్నీటి నివాళి.
ఏలె లక్ష్మణ్