మన చుట్టూ ఉన్న జీవావరణాన్ని అక్షరాల్లోకి ఒంపిన కవి గోరటి వెంకన్న. కష్టజీవుల కన్నీళ్లే కాదు, ప్రకృతిని ఆవరించి ఉన్న ప్రేమానురాగాలను, జీవిత భిన్న పార్శ్వాలను పట్టుకున్న వాగ్గేయకారుడు ఆయన. తాను రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటిలోని చెమట చుక్కల సువాసనలను, ప్రకృతి రమణీయ కమనీయ ప్రతిబింబాలను ముందు తరాలకు అందించిన తాత్వికత విశిష్టమైనది.
గోరటి వెంకన్న పాలమూరు జిల్లా కరువుగోస నుంచి తెలంగాణ అస్తిత్వ వేదన వరకు ప్రతి సందర్భాన్ని ఒడిసి పట్టుకున్న కవి. ‘ఏకునాదం మోత’, ‘అలసెంద్రవంక’, ‘పూసిన పున్న మి’, ‘రేలపూతలు’ వంటి పాటల ఊటను చూస్తే.. జనజీవితం జాలు వారుతుంది. ఆయన రాసిన ప్రతి పదంలోనూ, వేసిన ప్రతీ అడుగులోనూ అంతులేని వేదన కన్పిస్తుంది. మన జీవితాలను, మన చుట్టూ ఉన్న అంశాలను అధ్యయనం చేస్తే గాని గుండెను తాకేలా అక్షరాలను సంధించలేరు. ఎవ్వరూ ముట్టని, చూడని అంశాలు, జీవితాలు, వెంకన్న పాటకు ఎరువయ్యాయి.
‘గాలిలోన ఈదుకుంటూ..
గంగవై ఉరుకుతున్నకొంగమ్మా..’ పాటలో గతకాలపు కన్నీటి చెలిమెలను తడిమితే, ‘ఎలే ఎన్నో ల్లో..’ అంటూ బాల్యపు జీవిత అడుగులను మన ముందుపరుస్తారు. అంతేకాదు ‘ఓ నల్లతుమ్మా..’ అంటూ వెంకన్న ఏ కవి ముట్ట ని ఆ చెట్టును తెలుగు సాహిత్య వినీలాకాశపు సింహాసనంపైకి ఎక్కించారు.
వెంకన్న పాటల్లో తట్టని పార్శ్వం అంటూ లేదు. తెలుగు సాహిత్యంలో తన కవిత్వం ద్వారా ‘ఈ తరం నాదే’నని చెప్పకనే చెప్పుకొన్నారు. తెలంగాణ ఉద్యమానికి వెంకన్న పాటలు వంతెనలయ్యాయి. తెలంగాణ పల్లె లు ఎప్పుడూ ఉద్యమాలు, ఆరాటాలు, పోరాటాలు మాత్రమే కాదు.. వెలకట్టలేని రసరమ్య సుమధుర సుందర ప్రేమ కావ్యాలని చూపారు. దుఃఖాల పల్లెకు ప్రేమ గంధా న్ని పూసి.. ఇదిగో మన ఊళ్లు ఇట్లా ఉన్నాయని సరికొత్త కోణాన్ని చూపిన సాహిత్య శ్రామికుడు వెంకన్న. ‘నా పల్లె అందాలు’ పాట దీనికి సరి పోతుంది.
వెంకన్నలో ఒక పోతులూరు వీరేంద్ర స్వామిలాగా సమాజపు భవిష్యత్ దర్శనం ఉంది. ఆ తర్వాత నూతన ఆర్థిక విధానాల నాలుగో దశలో ‘అద్దాల అంగిడి మాయ’ పాటలో భౌమన్ థీయరినీ రాశారు. పెద్ద పెద్ద విషయాలు మన జీవితంలోనే ఉన్నాయని సుభోధకంగా, సులభంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం వెంకన్న ప్రత్యేకత. ‘సంత’ గురించి రాలయన్నా, వేల ఏండ్లయినా మనిషి ఎంత ముందుకెళ్లినా.. జ్ఞానం మాత్రం ఇంకా ఎంత వెనక ఉందో చెప్పడం గోరటి వెంకన్న కలానికే సాధ్యం. ఆయన సమాజం చుట్టు, దాంతో పాటు మారుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక చలనశీల అంశాలను పట్టుకుని చరిత్రలోకి పాట రూపంలో తీసుకెళ్లడం ఈ వాగ్గేయ కారుని ప్రత్యేకత. తెలుగు సమాజంలో వేమ న పద్వాల తర్వాత ఐదు వందల ఏండ్లకు మళ్లీ గోరటి వెంకన్న పాటలు ప్రతి తెలుగు ఇంటి నాలుకలపై నానుతున్నాయి. వెంకన్న పాటలు వెయ్యేండ్ల తెలుగు సమాజపు గుర్తులుగా చిర స్థాయిగా నిలిచి పోయేవి.
వెంకన్న పాటల్లో అలంకారాలు, వ్యక్తీకరణలు, పదాల ఇంపులు, సొంపులు అద్భు తం. ఆధునిక తెలుగు సాహిత్యంలో కృష్ణ శాస్త్రి, గుర్రం జాషువాల సాహిత్య వారసత్వ పరంపర వెంకన్న పాటల్లో కన్పిస్తుంది.
వెంకన్న పాటలు రాసే తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. కాలిబాటల ఉన్నా, కారులో వెళ్తున్నా వెంకన్న నాలుకపై పదాలు నిత్యం నాట్యం చేస్తూనే ఉంటాయి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు తాను కూర్చున్న సీటుపైనే దరువేస్తూ క్షణాల్లో పాటను అల్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. అడిగిన వెంటనే ఇదిగో అంటూ చెవులకింపుగా, మెదడుకు పదును పెట్టేలా అద్భుతమైన అక్షరాల మాలికను అందిస్తారు. ఆయన కాలంలో ఈతరం జీవించడం గొప్ప విషయం.