బీజేపీకి మోకరిల్లిన కాంగ్రెస్
నీళ్లు, నిధులు, నియామకాలు, వనరులు... ఇలా ప్రతి రంగంలో మన వాటా మనమే దక్కించుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష మొదలై, సాకారమైంది. ఉద్యమ అనుభవం లేని రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు, వనరులు… ఇలా ప్రతి రంగంలో మన వాటా మనమే దక్కించుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష మొదలై, సాకారమైంది. ఉద్యమ అనుభవం లేని రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నది. కేసీఆర్ అనే కంచె తొలగిపోయిందని, ఇక మాకు అడ్డూ అదుపు ఎవరూ లేరని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సహజ వనరులను కొల్లగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో కుమ్మక్కయింది. అందుకే, తెలంగాణ ఖనిజ సంపద అయిన ఇనుము, మాంగనీస్, బొగ్గు, సున్నపురాయి వంటి నిక్షేపాలను సుమారు 11 బ్లాకులుగా గుర్తించి, అందులోంచి కనీసం 6 బ్లాకులకైనా వేలం పాట నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రేవంత్ సర్కారుకు హుకుం జారీచేసింది.
యావత్ దేశానికే వెలుగులను ప్రసరింపజేసిన చరిత్ర మన సింగరేణికి ఉన్నది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అలాంటి సింగరేణిని కూడా వేలం వేయాలని ప్రయత్నించింది. నాడు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ బీజేపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను నిలువరించారు. ఆ వేలం ప్రక్రియను అడ్డుకొని సింగరేణిని ప్రగతిపథం వైపు నడిపించారు. వచ్చిన లాభాల్లోని వాటాను కార్మికులకు పంచారు.
ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాం తంలో మెండుగా ఉన్న యురేనియం నిక్షేపాలను తవ్వుకునేందుకు అనుమతినిచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యురేనియం తవ్వకాలకు అడ్డుకట్ట వేసింది. అంతేకాదు, భవిష్యత్తులో కూడా యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి శభాష్ అనిపించుకున్నది.
కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కాదు, గతంలో ఏపీలో ‘ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు’ అనే ఉద్యమం జరిగినప్పుడు కూడా కేసీఆర్ ప్రజలకు బలాన్నిస్తూ వారి సంకల్పానికి బాసటగా నిలిచారు. ఉక్కు కర్మాగారం వేలం టెండర్ల ప్రక్రియకు కేంద్రం బిడ్స్‌కు ఆహ్వానిస్తే తెలంగాణ నుంచి ఉన్నతాధికారులను పంపించి అధ్యయనం చేయించారు. ఆ టెండర్లను తెలంగాణకు చెందిన సింగరేణి ద్వారా దక్కించుకొని కార్మికులకు పెద్ద దిక్కు కాబోయారు. ఎప్పుడైతే కేసీఆర్ ఈ ప్రణాళికలను సిద్ధం చేశారో అప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ వంటి బీజేపీ పెద్దలకు ముచ్చెమటలు పట్టాయి. వెంటనే వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం ఉక్కు గనుల సహాయ మంత్రి ఫగ్గాన్ సింగ్‌తో వేలం ప్రక్రియను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో సహజ వనరులకు తూట్లు పొడవాలని ప్రయత్నించినా కేసీఆర్ సహించేవారు కాదు, కేసీఆర్ ఇలా పదవి దిగిపోయారో, లేదో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు ఆడిందే ఆట, పాడిందే పాట అయ్యింది. అందుకే రాష్ట్రంలో కార్పొరేట్ శక్తులకు దారులు చూపిస్తున్నాయి.
కేంద్రంలో బొగ్గు గనుల శాఖకు కేంద్రమంత్రిగా ఉన్న తెలంగాణ బిడ్డ కిషన్‌రెడ్డి, ఇదే శాఖకు సహాయ మంత్రిగా ఉన్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన శ్రీనివాస వర్మ ఇక్కడ సింగరేణి, అక్కడి విశాఖ ఉక్కుతో పాటు ఇతర గనులను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలి. లేకుంటే గనుల ప్రైవేటీకరణతో వేలాది మంది కార్మికుల భవిష్యత్తు అంధకారమవుతుంది. వారి కుటుంబాలు రోడ్డున పడుతాయి. మోదీ ప్రభుత్వం బొగ్గు, ఇంధన రంగాల్లో ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈక్విటీ ప్రతిపాదికన 51: 49 తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం సంయుక్త యాజమాన్యంతో నడుస్తున్న సంస్థ. సింగరేణి సంస్థ ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు 2011లో 11 వేల కోట్ల రాబడిని అర్జిస్తే, అది 2014 తర్వాత కేసీఆర్ హయాం నాటికి 33 వేల కోట్లకు పెరిగింది. అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి ఏమిటో స్పష్టమవుతున్నది.
కానీ, రేవంత్ అధికారంలోకి రాగానే 11 బ్లాక్‌లను గుర్తించిన కేంద్రం వేలానికి అల్టిమేటం కూడా జారీచేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఇప్పటిదాకా ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించకపోవటం గమనార్హం. ఇదే జరిగితే ప్రజా ఉద్యమంతో కార్మికుల చైతన్య ఆగ్రహావేశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గురికాక తప్పదేమో.
(వ్యాసకర్త: భారత్ జాగృతి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
– డాక్టర్ నలమాస శ్రీకాంత్‌గౌడ్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

