సీఎం యాత్రా వినోదం
అనుభవమైతే గానీ తత్వం బోధపడదు అని అన్నారు పెద్దలు. ఇన్నాళ్లూ ప్రధాని నరేంద్రమోదీని బడేభాయ్ అంటూ ఆకాశానికెత్తేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారు. హఠాత్తుగా వచ్చిన ఈ మార్పునకు తన అమెరికా పర్యటనకు కేంద్రం ఆమోదం తెలుపకపోవడమే కారణం. కేంద్రం చర్య యావత్తు రాష్ర్టాన్ని అవమానించడం అని ఆయన చెప్పుకొటుండటం విడ్డూరం.
అనుభవమైతే గానీ తత్వం బోధపడదు అని అన్నారు పెద్దలు. ఇన్నాళ్లూ ప్రధాని నరేంద్రమోదీని బడేభాయ్ అంటూ ఆకాశానికెత్తేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారు. హఠాత్తుగా వచ్చిన ఈ మార్పునకు తన అమెరికా పర్యటనకు కేంద్రం ఆమోదం తెలుపకపోవడమే కారణం. కేంద్రం చర్య యావత్తు రాష్ర్టాన్ని అవమానించడం అని ఆయన చెప్పుకొటుండటం విడ్డూరం. నిజానికి అవకతవకగా పర్యటనకు ప్రణాళిక వేసుకుని, ఆపై అభాసుపాలై ఆయనే రాష్ట్రం పరువు తీశారా? అనేది ప్రశ్న. సీఎం బ్రిటన్ పర్యటనకు ఆమోదం తెలిపిన విదేశాంగశాఖ ఆయన లండన్‌లో ఉండగానే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించినట్టుగా ప్రకటించడంతో ఆయన అక్కడి నుంచే తిరుగుప్రయాణం కావాల్సి వచ్చింది.
ఇది పెట్టుబడులు సేకరించడానికో లేదా విద్యావిషయకంగా విదేశీ యూనివర్సిటీలతో సంబంధాలు నెరపడానికో సంబంధించిన సమస్య కాదు. ఒక రాష్ట్ర సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడం అనేది ఆయన వ్యవహారశైలి మీద మచ్చగానే భావించాలి. ఇంతకూ ఈ వివాదానికి మూలం ఏమిటో పరిశీలిద్దాం. దీనిపై అధికారికంగా, అనధికారికంగా కొన్ని కారణాలు బయటకు వచ్చాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పిన ప్రకారం, ముఖ్యమంత్రి ప్రతిపాదించిన పర్యటన షెడ్యూల్, కార్యక్రమం ఆయన పదవికి ’తగిన విధంగా’ లేదని అభిప్రాయపడింది. విదేశీ పర్యటనలకు ముఖ్యమంత్రులకు కేంద్రం నుంచి ‘పొలిటికల్ క్లియరెన్స్’ తప్పనిసరి అనేది గుర్తుంచుకోవాలి.
ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలు సాధారణంగా పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వ స్థాయి సమావేశాలు, ఆర్థిక భాగస్వామ్యాలకు సంబంధించినవి అయి ఉండాలి. కానీ ఈ పర్యటనలో ఉన్న కార్యక్రమాలు ఆ ప్రమాణాలకు సరిపోలేదని కేంద్రం భావించింది. ఆ కారణంగానే పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించింది. ఇది పేరుకు పొలిటికల్ క్లియరెన్స్ అయినప్పటికీ పరిపాలనా సంబంధమైన అంశమే. ఈ క్లియరెన్స్ ఇచ్చేముందు ఎవరెవరిని కలుసుకోబోతున్నారు? పర్యటన ఉద్దేశం ఏమిటి? అది పూర్తిగా అధికారికమా? వంటి అంశాలు విదేశాంగ శాఖ పరిశీలనకు తీసుకుంటుంది.
ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ పర్యటనకు అనుమతి నిరాకరించాల్సి వస్తే దౌత్యపరమైన కారణాల వల్ల పరిమితమైన స్థాయిలో మాత్రమే కారణాలను వెల్లడిస్తుందనేది తెలిసిందే. భారత్‌పై, ప్రధాని నరేంద్రమోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యూయార్క్ గవర్నర్ జోహ్రాన్ మమ్దానీని సీఎం రేవంత్ కలుసుకోవాలని అనుకున్నారని, అదే తిరస్కరణకు కారణమని నిర్ధారితం కాని వార్తల ద్వారా తెలుస్తున్నది. ఈ వార్తలను విదేశాంగ శాఖ ధ్రువీకరించక పోవడం గమనార్హం.
కాగా రేవంత్‌రెడ్డి కేంద్ర నిర్ణయాన్ని’రాజకీయ ప్రేరేపిత చర్య’గా అభివర్ణించడం, కేంద్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నదని ఆరోపించడం సమస్యను పూర్తిగా పక్కదారి పట్టించడమే. నిన్నటిదాకా ఆకాశానికెత్తిన బడేభాయ్ గురించి మాట మార్చి విలన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కేంద్రానికి తెలంగాణ అభివృద్ధిపై ఎలాంటి ఆసక్తి లేదని సీఎం రేవంత్ కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడటం విడ్డూరం. తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడం వంటి ఆంశాలపై నిలదీశారు కూడా.
ఢిల్లీతో సోపతి చేసి అభివృద్ధికి అవసరమైన నిధులను సాధిస్తానని గప్పాలు కొట్టిన సీఎం రేవంత్‌కు తల బొప్పికట్టింది. దీంతో ఎదురుదాడికి దిగడం ఆయనలోని కుదురులేనితనాన్ని సూచిస్తున్నది. ఇంట్లో ఈగల మోతను వదిలిపెట్టి, బయట పల్లకీల మోతకు తయారుకావడం ఒక ఎత్తు. అందులో కేంద్రం ‘బేసబబు’గా భావించే అంశాలను చేర్చడం మరొక ఎత్తు. తీరా తిరస్కరణకు గురికాగానే గగ్గోలు పెట్టడం అసమర్థత, అవగాహనా రాహిత్యమే. అందుకు బదులుగా ఎన్ని పెట్టుబడులు రాకుండా పోయాయో అణాపైస సహా లెక్క చెప్తే బాగుండేది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

