‘ఏంటో మిత్రులిద్దరూ పడీ పడీ నవ్వుతున్నారు.. ఆ జోకేదో నాకూ చెప్తే నేనూ నవ్వుతా’ ఇద్దరం నవ్వుతున్నది నిజమే కానీ, ఇద్దరం కలిసి నవ్వడం లేదు. విడివిడిగా నవ్వుతున్నాం.. ఇద్దరి నవ్వులకు కారణాలు వేర్వేరు.. ఈ రోజు (ఫిబ్రవరి 1న) బ్రహ్మానందం బర్త్ డే.. జెమిని కామెడీలో బ్రహ్మీ కామెడీ సీన్స్ చూస్తుంటే నవ్వు ఆగడం లేదు.. ఒక జీవిత కాలానికి సరిపోయే మొత్తం నవ్వులు బ్రహ్మీ పుణ్యమాని ఈ ఒక్కరోజే నవ్వాను..
నా సంగతి సరే! నువ్వేంట్రా నాకన్నా ఎక్కువ గట్టిగా నవ్వుతున్నావు? ఏంటా కామెడీ? నాకూ చెప్పు.
బ్రహ్మానందం కామెడీ రోజూ ఉండేదే. నేను ఏడాదికి ఒక్కసారి వినిపించే బ్రహ్మానందం అమ్మమ్మ లాంటి కామెడీ వింటూ నవ్వుతున్నాను. అదేరా ఈ రోజు బ్రహ్మానందం పుట్టినరోజే కాదు, నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా.
బడ్జెట్ అంటే సిగరెట్ ధరలు పెంచే రోజు. అంతే కదా? ఇందులో పడీపడీ నవ్వడానికేముంది? కాసిన్ని సిగరెట్లు తాగడమైనా తగ్గించాలి, లేదా భార్యకు మల్లెపూలో, పిల్లలకు నెలకోసారి తెచ్చే స్వీట్బాక్స్నో మరిచిపోవాలి. నవ్వడానికి ఏముంది?
నేను చెప్పడం కాదు, నువ్వే విను. మేడమ్ బ్రహ్మాండమైన బడ్జెట్ అంటూ ఏం చెప్తున్నారో, విని నువ్వు నవ్వకుండా ఉంటే ఛాలెంజ్..
‘మేం అద్భుతమైన మహిళా పక్షపాత బడ్జెట్ ప్రవేశపెట్టాం. దేశంలోని మహిళా ఓటర్లందరూ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నారు. నేను పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతుండగానే కోట్ల మంది మహిళలు మద్దతుగా పార్లమెంట్ వైపు బయల్దేరారు. మేమే వద్దన్నాం..’
‘మేడమ్! నేను ఫలానా పేపర్ జర్నలిస్ట్‌ను. ఏ విధంగా ఇది మహిళా పక్షపాత బడ్జెటో చెప్తారా?’
‘ఒకటి కాదు, వంద చెప్తాను. సిగరెట్ల ధరలు పెరిగాయంటే మగవాళ్లు సిగరెట్ తాగడం మానేస్తారు, లేదా తగ్గిస్తారు. దీనివల్ల మహిళలకే కదా ప్రయోజనం. ప్రతి ఇంట్లో అత్తా కోడళ్ల మధ్య టీవీ రిమోట్ కోసం ఎన్ని గొడవలు జరుగుతాయో మీకు తెలుసా? ‘అత్తా ఒకింటి కోడలే’ సీరియల్ చూడాలని కోడలు, ‘తింగరి కోడలు తెలివైన అత్త’ సీరియల్ చూడాలని అత్త గొడవలు పడుతుంటారు. అందుకోసమే టీవీ ధరలు తగ్గించాం. ఇప్పుడు హాయిగా అత్త, కోడలు, కొడుకు ఒక్కొక్కరు ఒక్కో టీవీ చూసుకోవచ్చు’
‘తమ్ముడూ నీకు పెళ్లయిందో లేదో నాకు తెలియదు కానీ, ఆడవారికి వజ్రాలు అంటే ఎంత ప్రేమ ఉంటుందో.. వజ్రాల మీద పన్నులు తగ్గించాం. నీకు పెళ్ళయితే వెళ్తూ వెళ్తూ మీ ఆవిడకు ఓ వజ్రాల నెక్లెస్ కొనుక్కెళ్లు మేం ఎలాగూ పన్నులు తగ్గించాం’
‘అదేంటి మేడమ్! మూడు వందలున్న గ్యాస్ సిలెండర్‌ను మీ పాలనలో పన్నెండు వందల వరకు తీసుకువెళ్లారు. మహిళా పక్షపాతం అంటే గ్యాస్ ధరను మూడు వందలు చేయాలి కానీ, వజ్రాలపై పన్నులు తగ్గిస్తే మాకేంటి? ఉపాధి కూలీ పథకానికి నిధులు సగానికి సగం చేశారు. గ్రామాల్లో కూలీలు ఎలా బతకాలి మేడమ్?’
‘బ్రదర్ నీలో కరుడుగట్టిన పురుషాహంకారి కనిపిస్తున్నాడు. పదేపదే గ్యాస్ గురించి మాట్లాడుతున్నావంటే మహిళలు ఎప్పుడూ వంటింట్లోనే ఉండాలని కోరుకుంటున్నట్లున్నది. చక్కగా వజ్రాలహారం ధరించి అందంగా ముస్తాబైతే చూడలేని మగ దురంహంకారివి..’
‘ఆగండి మేడమ్. నాకింకా పెళ్లే కాలేదు. ఇంట్లో వంట వండేది నేనే. గ్యాస్ ధర భరించలేకపోతున్నా. నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన పేదల పరిస్థితి ఎలా ఉంటుందా అని అడిగాను కానీ మహిళలపై వ్యతిరేకతతో కాదు. పోనీ గ్యాస్ సంగతి వదిలేద్దాం. ఉపాధి హామీ నిధుల కోత సంగతేమిటి?’
‘అంటే పల్లెటూర్లలో మహిళలు జీవితమంతా ఎండలో కూలీ పనులు చేస్తూ బతకాల్సిందేనా? మధ్యతరగతి మహిళల కోసం వజ్రాలపై పన్ను తగ్గించినా మీకు నచ్చదు. గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళలను కూలీ పనులకు దూరం చేయడానికి కేటాయింపులు తగ్గించినా మీరు ఓర్చుకోలేరు’
‘వామ్మో వదిలేయండి మేడమ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపుల్లేవు. విభజన చట్టంలోని హామీలకు కూడా మొండిచేయి చూపించారు. దీనికేమంటారు?’
‘నీలో నిలువెత్తు అహంకారం దాగుంది అంటాను. దివ్యాంగులను మొండిచేయి అని అవమానిస్తున్నావు’
‘ఒక్క నిమిషం ఉండు. ఒక్క కాల్ చేసి నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. నువ్వు ఫలానా పత్రిక జర్నలిస్ట్ అని చెప్పావు కదూ… హలో! హలో! నేను.. నిర్మలా ప్రభాకర్‌ను మాట్లాడుతున్నా. ఇక్కడ ఫలానా పత్రిక మనకు ఇబ్బందికరంగా తయారైంది. మీరు ఉన్నఫలంగా ఆ పత్రికను కొనెయ్యాలి’
‘నిర్మలా జీ అదెంత పని. కానీ, వాడెవడో హిండెన్‌బర్గ్ నా కొంప ముంచాడు. మా కంపెనీ స్టాక్స్ రోజురోజుకు 20-25 శాతం మేర పడిపోతున్నాయి. నెత్తిన గుడ్డ వేసుకొని కూర్చున్నా. మీ వాళ్లేమో వాట్సాప్‌లో నన్ను ఆకాశానికి ఎత్తుతూ రాయడం, షేర్ చేయడం తప్ప ఒక్క స్టాక్ కొనటం లేదు. అబుదాబి కంపెనీతో ఏదో మేనేజ్ చేశాం. కాలం కలిసి వస్తే ఒక్క మీడియాను కూడా వదలకుండా అన్నీ కొనేద్దాం. ప్రస్తుతానికి నన్ను వదిలేయండి మేడమ్…’
‘మేడమ్! నేను తింగరి పత్రిక జర్నలిస్ట్‌ను. ఫలానా పత్రిక వాడిలా నేను అడగను. ఎందుకంటే తింగరి పత్రికను మీవాళ్ళు ఎప్పుడో కొనేశారు. ఫలానా పత్రిక జర్నలిస్ట్ మిమ్మల్ని కావాలనే అలా అడుగుతున్నాడు. ఫలానా పత్రికలో జీతాలు ఎప్పుడిస్తారో తెలియదు. పెరిగిన ధరలతో బతకలేకపోతున్నాడు. మిమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి రెచ్చగొట్టి మీ అదానీతో ఫలానా పత్రికను కొనిపించాలని వీడి ప్లాన్ మేడమ్!..’
(ఈ నెల 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో..)
బుద్దా మురళి