నియంతృత్వ పోకడలకు రాష్ర్టాలు బలి
జాతీయపార్టీల నియంతృత్వ పోకడలకు, అధికార దాహానికి రాష్ర్టాలు బలైపోతున్నాయి. ఈ హక్కులను హరించే ప్రక్రియ తీవ్రస్థాయికి చేరింది. రాష్ర్టాల ఆశలు, ఆకాంక్షలు కేంద్రంలోని పెద్దలు పట్టించుకోరు. కేంద్ర బడ్జెట్‌ను రూపకల్పన ప్రక్రియలో రాష్ర్టాలను సంప్రదించరు. రాష్ర్టాల ఆర్థిక అవసరాలను
జాతీయపార్టీల నియంతృత్వ పోకడలకు, అధికార దాహానికి రాష్ర్టాలు బలైపోతున్నాయి. ఈ హక్కులను హరించే ప్రక్రియ తీవ్రస్థాయికి చేరింది. రాష్ర్టాల ఆశలు, ఆకాంక్షలు కేంద్రంలోని పెద్దలు పట్టించుకోరు. కేంద్ర బడ్జెట్‌ను రూపకల్పన ప్రక్రియలో రాష్ర్టాలను సంప్రదించరు. రాష్ర్టాల ఆర్థిక అవసరాలను గుర్తించరు. పోనీ ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానిని కలిసి రాష్ట్ర అవసరాల గురించి విపులంగా చెప్తామంటే అపాయింట్మెంట్ దొరకదు. రాజకీయ ప్రయోజనాలకు ఎటువంటి జంకు లేకుండా రాజ్యాంగాన్ని పణంగా పెట్టే రోజులు ఇప్పుడు చూస్తున్నాం. ప్రతికూలంగా ఉన్నవారు ఇబ్బందులకు గురికావడం, అనుకూలంగా ఉన్నవారు పదవీ విరమణ తర్వాత కూడా ప్రతిఫలాన్ని అనుభవించడమూ చూస్తున్నాం.
మన దేశానికి అంతర్లీనంగా ఉన్న సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్రంలోని ప్రభుత్వాలు ఎందుకు వ్యవహరిస్తున్నాయి. చాన్నాళ్ల నుంచి దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇది ఒకటి. ఈ సమస్య ఉధృతి అయినప్పుడు దీనికి సమాధానంగా ఓ కమిటీనో, కమిషన్నో వేయటం, చేతు లు దులుపుకోవడం పరిపాటిగా మారింది. ఏమైంది సర్కారియా కమిషన్ రిపోర్టు? ఏమైంది బొమ్మై కేసులో సుప్రీం తీర్పు? ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.
మన రాజ్యాంగంలో కనుమరుగవుతున్న సమాఖ్య స్ఫూర్తి అన్న అంశం పలు సందర్భాల్లో తెరపైకి వస్తుంది. సమస్య జటిలమైనదైనా కేంద్రంతో సామరస్యంగా ఉండటం అవసరం కాబట్టి చాలామంది ముఖ్యమంత్రులు సర్దుకుపోతారు. ఇటీవల కేసీఆర్ కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు చాలామంది ముఖ్యమంత్రులకు ఉన్న కడుపుమంటకు, తీవ్ర అసంతృప్తికి అద్దం పట్టేలా ఉన్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధిష్ఠానం ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందనీ ఆయా ముఖ్యమంత్రులు నోరు మెదపరు. కాస్త గట్టిగా మాట్లాడినా పదవికే ప్రమాదం అని వారికి తెలుసు. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు లేవనెత్తే వాస్తవాలను పక్కనబెట్టి రాజకీయ కోణంలోనే చూస్తుంది మీడియా. వాక్స్వాతంత్య్రాన్ని పదేపదే నొక్కి వక్కాణించే మెయిన్ స్ట్రీమ్ మీడియా తమకు అనుకూలమైన వార్తలు, ఉద్దేశాలను మాత్రమే ప్రచారం చేస్తుంది. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఇదొక దురదృష్టకర పరిణామం.
మన సమాఖ్య స్ఫూర్తి బలహీనమవటానికి ప్రస్తుత గవర్నర్ వ్యవస్థ కూడా కారణం. పార్లమెంట్, శాసనసభల చేత ఎన్నుకోబడిన రాష్ట్రపతి తన విధి నిర్వహణలో కేంద్ర మంత్రిమండలి సలహా మేరకే వ్యవహరించాలని రాజ్యాంగం చెప్తున్నది. 1950 నాటి రాజ్యాంగంలో ఈ నిబంధన లేదు. ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ నిబంధన వచ్చింది. కానీ ఈ నిబంధన గవర్నర్‌కు వర్తింపజేయలేదు. గవర్నర్ రాష్ట్ర ప్రభుతం సలహా మేరకు వ్యవహరించాలని రాజ్యాంగంలో లేదు. ఈ విషయం చాలామందికి తెలియదు. దీన్ని అడ్డం పెట్టుకొనే గవర్నర్లు రాజకీయం చేస్తుంటారు, ముఖ్యంగా తామున్న రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంటే అంతే సంగతి. గవర్నర్‌ను నియమించటానికి, తొలగించటానికి ఒక పద్ధతి లేదు. ఎంతో బాధ్యత గల గవర్నర్ నియామకంలో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
సమాఖ్య స్ఫూర్తి బలపడాలి. భిన్నత్వానికి హాని జరగకుండా ఏకత్వం బలపడాలి. ఏకత్వం, ఏకీకరణ ఒకటి కాదు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం గమనించాలి. అన్నివర్గాలను కలుపుకొనిపోయే నాయకత్వం నేటి అవసరం. ఈ సత్యాన్ని పాలకులు గ్రహించాలి.
గవర్నర్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రతినిధి, కానీ కేంద్రానికి కాదు. జరుగుతున్నదేమిటి? క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న నేతలను, ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలను, వృద్ధ నేతలను ఎక్కువగా రాజ్భవన్లకు పంపుతున్నారు. రాజకీయ నేపథ్యం లేనివారిని గవర్నర్‌గా నియమించటం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతున్నది. వారికి కేంద్రంలోని పెద్దలను ప్రసన్నం చేసుకోవాలనే కోరిక కూడా ఉంటుంది. అంటే కేంద్రంలో పెద్దల అభీష్టం మేరకు నడుచుకోవటం! ఇది రాజ్యాంగస్ఫూర్తికి పూర్తిగా భిన్నం. రాజస్థాన్‌లో జరిగిన ఉందంతం ఒక ఉదాహరణ. అధికార పార్టీలో కొందరు శాసనసభ్యులు తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి తన ప్రభుత్వ బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవాలని అసెంబ్లీని సమావేశపరచమని గవర్నర్‌ను కోరారు. కానీ అందుకు గవర్నర్ సిద్ధపడలేదు. వాస్తవంగా గవర్నరే అడగాలి ముఖ్యమంత్రిని అసెంబ్లీలో బలం నిరూపించుకొమ్మని. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్న తంతు కూడా సమాఖ్యస్ఫూర్తిని దెబ్బతీసేదే. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి గవర్నర్ అడ్డంకులు సృష్టించటం రాజ్యాంగాన్ని మంటగలపటమే. కానీ అడిగేవారెవ్వరు? అడిగినా వినేవారెవ్వరు?
ఈ రోజు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు నోరు మెదుపుతున్నారు. సమస్య మరింత జటిలం కాకముందే సామరస్యపూర్వకంగా పరిస్థితిని చక్కదిద్దటం దేశ ప్రయోజనాలకు మంచిది. కీలక పదవుల్లో ఉన్న నేతలు విజ్ఞతతో వ్యవహరించాలి. రాష్ర్టాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది. కానీ కేంద్రం బలంగా ఉంటే రాష్ర్టాలు కూడా బలంగా ఉంటాయని చెప్పలేం. ఈ సత్యాన్ని కేంద్రంలోని పాలకులు గ్రహించి రాష్ర్టాల సహేతుకమైన ఆశలను, ఆకాంక్షలను అర్థం చేసుకొని వ్యవహరించాలి. లేనిపక్షంలో ఆందోళనలు, ఉద్యమాలు పుట్టుకొస్తాయి. సమాజం బలహీనపడుతుంది. ప్రజలు అయోమయానికి గురవుతారు. వ్యవస్థలు గందరగోళానికి గురవుతాయి. అభివృద్ధి కుంటుపడుతుంది. ఇది దేశానికి మంచిది కాదు.
ఇండియా, అనగా భారత్, అనే రాష్ర్టాల సమాహారం అభివృద్ధి దిశగా పయనిస్తుందని బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ ఆశించాలి. అందుకు మన వంతు కృషి మనం చేయాలి.
(వ్యాసకర్త: విశ్రాంత డైరెక్టర్, లోక్‌సభ సచివాలయం, ఢిల్లీ)
– గుమ్మడిదల రంగారావు
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

