శీతాకాలం రాత్రి ఎక్కువగా వుంటుందని
వెచ్చగా నిద్రపోయి, ఖరీదైనా కలలు కనకు,
ఊహలన్నీ ఖర్చయి పోయిన కళ్లు
పొద్దున ఖాళీగా కనిపిస్తాయి
జ్ఞాపకాలను, బట్టీ పట్టినట్టు
పదే పదే జ్ఞాపకం పెట్టుకోనవసరం లేదు
సీసాలో వున్నా అత్తర్ పరిమళిస్తుంది
ఎప్పటి నుంచో పిల్లల కోసం
ఇల్లు కట్టుకుందామనుకున్నాను
కానీ, కవిత్వం రాస్తున్నప్పటి నుంచీ
భూకంపాలు ఆగడమే లేదు
జీవించడానికి, డబ్బు, ఆహారం
వొంటి నిండా దుస్తులే కాదు
చుట్టూ సందడి వుండాలి
మనుషులు కలుసుకోని రోజు
నగరంలో కర్ఫ్యూ వుందేమోనని,
చిన్నగా భయమేస్తుంది..