ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆవరణలోని అడవిపై యంత్ర భూతాలు విరుచుకుపడ్డ తీరు హేయం. తెలుగువారికి అతిముఖ్యమైన ఉగాది పండుగ రోజు పోలీసు పహారాలో బుల్డోజర్లు పచ్చని చెట్లను ఎడాపెడా నరికివేయడం విచారకరం. అటు పోలీసు క్యాంపులా మారిన క్యాంపస్‌లో విద్యార్థులపై విరుగుతున్న లాఠీలు మరో భయానక దృశ్యం. విద్యార్థులను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లడం, చితకబాదడం ఏ తరహా ప్రజా పాలనో? రాత్రికి రాత్రే 400 జేసీబీలను మోహరించడం దేనికి? ‘అసలక్కడ అడవే లేదు, పశుపక్ష్యాదుల సంచారమే లేదు’ అంటున్నది రేవంత్ సర్కారు. మరి కూలుతున్న ఆ చెట్లు ఎక్కడివి? చెల్లాచెదురవుతున్న పిట్టలను అడగండి.. అది అడివో కాదో! పరుగులు తీస్తున్న నెమళ్ల ఆర్తనాదాలు వింటే తెలుస్తుంది ఎవరి గూడు చెదిరిపోతున్నదో? జేసీబీ చక్రాల్లో చిక్కుకున్న జింకపిల్ల కళేబ రం సాక్షిగా అక్కడ ప్రకృతి హననం జరుగుతున్నది.
తెలంగాణ తొలిదశ ఉద్యమ పర్యవసానంగా కేంద్రం రూపొందించిన ఆరు సూత్రాల పథకంలో భాగంగా హైదరాబాద్ వర్సిటీ ఏర్పడిందన్న సంగతి తెలంగాణ సోయి లేని సీఎం రేవంత్‌కు తెలుసా? 2300 పైచిలుకు ఎకరాల్లో ఏర్పడిన ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చుట్టూరా పరుచుకున్న అడవిలో దక్కన్ పీఠభూమి భౌగోళికతకు ప్రతీకగా నిలిచే రాతిగుండ్ల అమరికలు దండిగా ఉన్నాయని తెలుసా? వాటిని కాపాడేందుకు ‘సేవ్ రాక్ సొసైటీ’ వంటి పౌర సమాజ సం స్థలు పాటుపడుతున్నాయనే అవగాహన కించిత్తయినా ఉందా? చివరి గణన ప్రకారం ఆ అడవిలో 734 వృక్షజాతులు, 10 రకాల క్షీరదాలు, 15 రకాల సరీసృపాలు, 220 రకాల పక్షిజాతులు మనుగడ సాగిస్తున్నాయనే స్పృహ ఉందా? చితాల్ దుప్పి, కుందేళ్లు, ఏదు పందులు, అడవిపందుల ఆవాసం ఆ ఆడవి. బృహత్ శిలాయుగానికి చెందిన రక్షిత ప్రదేశం అక్కడే ఉంది.
ఇక్కడ రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి పర్యావరణం. రెండు, విద్యార్థుల హక్కులు. ఈ రెండూ సర్కారు ప్రాధాన్యా ల్లో ముందువరసలో ఉండాలి. ఆదాయం పెంచుకోలేక చతికిలపడుతున్న సర్కారు భూములను తెగనమ్మి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. ఎక్కడ ఏ అవాంతరం వచ్చిపడి భూముల వేలం ఆగిపోతుందోననే బెదురు సర్కారులో స్పష్టంగా కనిపిస్తున్నది. భూమి తనకే చెందుతుందని సర్కారు భావిస్తూ ఉండవచ్చు. ఆ సంగతి తేల్చడానికి కోర్టులున్నాయి. పోనీ అక్కడ ఏదైనా ప్రజోపయోగ ప్రాజెక్టు కడుతున్నారా? అంటే అదీ లేదు. ఏదో వాణిజ్య ప్రాంతం మధ్యలో చిన్న చిన్న సర్కారీ ప్లాట్లు వేలంలో అమ్మడం షరామామూలే. కానీ ఇక్కడున్నది ఓ విద్యాసంస్థలో భాగమైన 400 ఎకరాల పైచిలుకు పచ్చని భూమి. నగరం మధ్యలో వెలుగుతున్న ఆకుపచ్చని దీపాన్ని ఆర్పాల న్న ఆత్రం ప్రశ్నార్థకమవుతున్నది. నగరజీవికి ఊరటనిచ్చే ఆకుపచ్చని ఊపిరితిత్తులను ఛిద్రం చేయడానికి అంత దూకుడు ఎందుకు? కేసీఆర్ హయాంలో హరితహారం పేరిట అడవిని పెంచి చూపింది. కానీ, చిన్న మొక్కయిన నాటని రేవంత్ సర్కారు ఒక పెద్ద అడవినే పెరికి కుప్పలు పోస్తున్నది. హరితావరణంపైకి గొడ్డళ్లు విసురుతున్నది. దివాళాకోరు భూమి అమ్మకాల కోసం దిక్కుమాలిన వేలానికి ఉరుకులాడుతున్న సర్కారుకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.