నాడు పదెకరాల పొలమున్న పేదోళ్లమే మరి..
నాట్లేసే మోపుకు మా ఖాళీ కడుపులు నాగళ్లను పట్టమంటే..
కట్టుకున్నదాన్ని పైసల కోసం అవ్వగారింటికి దోలినం
ఉల్లే షావుకారింట్ల అప్పు కోసం కాలువెట్టినం
ఆడదాని మెడల పుస్తెల్తాడు కుదవెట్టినం
ఎవరికెర్క గడ్డివామెత్తున్న మా అప్పులు
ఎవ్వరు తొంగిజూసిండ్రు బోరెం కిందున్న మా రోత బతుకులను..
సాళ్లల్ల నీళ్లు లేక, చేతుళ్ల పైసల్లేక ఊరిడ్సి పోతాంటే
కచ్చురంల ఎదురచ్చి ఎన్కకు దోల్కపోయిండు మా సారు..
కట్టాలన్ని కొట్టంల గుంజకు కట్టేసి ముల్లుకట్టె వట్టుకొని
తొవ్వలున్న ముల్లకంపల్ని ఏరిపారేసికుంట… పొలాల దూపదీర్శి..
రైతుబంధుతో మా దుఃఖానికి కంచె గట్టి
ఎకరానికి ఐదు వేలిస్తే సద్దిగట్టిన్నట్టున్నదియ్యాల్ల..
కాలం కంటే ముందుగాల్నే మా తెలంగాణ సర్కారు
చింతచెట్టు నీడలా ఆదుకుంటే..
నేడు పచ్చని పొలాలు భూమికి పందిరేసినట్టున్నయ్..
కల్లంల వడ్లు కుప్ప పోస్తే బతుకమ్మ వోలె అవుపడే..
నేడు మా సారు తెలంగాణ రైతుల రాతలు మార్చితే…
వేపచెట్టు గాలిలా సల్లగ నిద్రవోతున్నం..
రైతుబంధంటే ఐదు వేల రూపాయలు ఇచ్చుడే గాదు..
లచ్చలమంది రైతులు తలెత్తుకొని సావడిల కాడ నడుస్తుర్రు..
ఆకాశి పండగ రాకముందే
రైతన్నలింట్ల నవ్వుల వానలు కురుస్తున్నయి…
తుమ్మల కల్పనా రెడ్డి: 9640462142