విప్లవాల యుగం మనది.. విప్లవిస్తే జయం మనది అనే నినాదాలు 70వ దశకంలో గోడల మీద దర్శనమిచ్చేవి. వామపక్ష విద్యార్థి ఉద్యమాల కాలంలో అది సర్వసాధారణంగా ఉండేది. కానీ కాలక్రమంలో ఉద్యమాలు వెనుకతట్టు పట్టాయి. ప్రజాసమస్యలపై ఆందోళనలు చేపట్టడంలో ఆరితేరిన కమ్యూనిస్టు పార్టీలు కలవో లేవో అన్నట్టుగా తయారయ్యాయి. కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై ఆందోళనలు లేవదీయడం అనేది గత చరిత్ర అయిపోయింది. విద్యార్థి ఉద్యమాలే కాదు, ఏ ఉద్యమాలూ తలెత్తని శూన్యం ఏర్పడింది.
కేంద్రంలో నరేంద్ర మోదీ పన్నెండేండ్ల పాలనా కాలంలో రైతులు ఢిల్లీని చుట్టుముట్టి, బైఠాయింపు వేయడమే చెప్పుకోదగ్గ ఆందోళనగా నిలిచింది. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు తెచ్చిన నాలుగు నల్ల చట్టాలను ఆ ఆందోళన ఫలితంగానే వెనుకకు తీసుకుని దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పుకున్నారు. ఆ తర్వాత మొన్న ఢిల్లీని హోరెత్తించిన జెన్-జీ ఉద్యమమే రెండో గొప్ప ఆందోళనగా ముందుకు వచ్చింది. అది కూడా సర్కార్ మెడలు వంచి కేంద్ర విద్యామంత్రితో రాజీనామా చేయించడంలో ఘనవిజయం సాధించడం విశేషం. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటే ఆందోళనలు బద్దలవుతాయి. ’తామే భువికధినాథులమని స్థాపించిన సామ్రాజ్యాలు.. ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేకమేడలై’ అనే కవి వాక్కులు మరోసారి గుర్తుకు వస్తున్న సందర్భం ఇది. జార్ఖండ్ విద్యార్థుల ఆందోళన ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నది.
జార్ఖండ్‌లో ఉధృతంగా ఎగిసిన యాంటీ-పేపర్ లీకేజీ ఉద్యమం దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో నెలకొన్న లోపాలను మరోసారి కండ్లెదుట నిలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీ అనేది కొత్త సమస్య కాదు. కానీ దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు చూపిన ఐక్యత, పట్టుదల, చివరికి ప్రభుత్వం తలొగ్గి వారి డిమాండ్లను అంగీకరించడం ప్రజాస్వామ్య విజయమేనని చెప్పాలి. ప్రశ్నాపత్రాల లీకేజీలతో పరీక్షలు విద్యార్థుల పాలిట విషమ పరీక్షలు అవుతుండటం కేవలం ఒక తప్పిదం కాదు. అది విద్యావ్యవస్థపై నమ్మకాన్ని ధ్వంసం చేసే ఘాతుకం.
జార్ఖండ్‌లో వరుసగా పేపర్ లీక్ ఘటనలు బయటపడడంతో విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. తమ కష్టానికి విలువ లేకుండా పోతున్నదనే భావన వారిలో ఆవేదనను రగిలించింది. పర్యవసానంగా నాయకుల పిలుపు, ప్రమే యం లేని అచ్చమైన ప్రజాందోళన ఉవ్వెత్తున ఎగిసింది. వీధులు యుద్ధరంగాలు అయ్యా యి. పోలీసు లాఠీలు విద్యార్థుల వీపులపై విరగడం సర్వసాధారణం అయిపోయింది. మొదట్లో ప్రభుత్వం ఈ నిరసనలను చిన్నచూపు చూసింది. కానీ రోజురోజుకూ పెరుగుతూ వచ్చిన ప్రజల మద్దతు, మీడియాలో చెలరేగిన దుమారంతో పరిస్థితి మారుతూ వచ్చింది. 25 రోజుల పాటు మొక్కవోకుండా సాగిన ఆందోళన ఫలితంగా రాష్ట్ర సర్కార్ దిగివచ్చింది. ప్రశ్నాపత్రాలు లీకైన పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా కఠినమైన వ్యవస్థను రూపొందించి అమలు చేయడం, ఇవీ విద్యార్థుల ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం ఒకవైపు విద్యార్థుల విజయం అయితే, మరోవైపు ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం.
ప్రజాస్వామ్యంలో విద్యార్థుల సంఘటిత పోరాట శక్తిని ఎవరూ నిలువరించలేరని జార్ఖండ్ ఉద్యమం మరోసారి చాటిచెప్పింది. ఇక్కడ జరిగిన యాంటీ-లీకేజీ ఉద్యమం కేవలం ఒక రాష్ట్ర స్థాయి విద్యార్థి నిరసన కాదు, ఇది దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్య పాలనకు గట్టి చెంపదెబ్బ. జార్ఖండ్‌లో వరుసగా పేపర్ లీక్‌లు జరుగుతుంటే బాధ్యులను పట్టుకోవడంలో, మాఫియాలను అరికట్టడంలో ఆయా ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వాలు (బీజేపీ గత పాలనలోనూ, కాంగ్రెస్ ప్రస్తుత పాలనలోనూ) వ్యవస్థను బలోపేతం చేయడంలో విఫలమయ్యాయి. అయితే, ఇవన్నీ రాత్రికి రాత్రే పరిష్కారమయ్యే సమస్యలు కావనేది తెలిసిందే. దేశంలోని ఇతర రాష్ర్టాలు కూడా ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని తమ పరీక్షా వ్యవస్థలను బలోపేతం చేయాలి. జార్ఖండ్ విద్యార్థుల పోరాటం దేశానికి ఒక స్ఫూర్తి కావాలి. వారి పట్టుదల, ధైర్యం దేశంలోని ప్రతీ విద్యార్థికి మార్గదర్శకంగా నిలువాలి. వ్యవస్థ మారాల్సిన సమయం వచ్చిందని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి.