తప్పుడు లెక్కలు ఇంకెన్నాళ్లు?
‘తాటిచెట్టు ఎందుకు ఎక్కావూ అంటే.. దూడ గడ్డి కోసం’ అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న సాకులు. అధికారంలోకి వచ్చి మూడేండ్లు దాటుతుంటే చేసిందేంటో చెప్పుకోలేని దుస్థితి ఈ సరారుది. వీళ్ల ఘనకార్యానికి ముఖ్యమైన రంగాలన్నీ మూలకు పడ్డాయి. ఆఖరికి ఎల్ నినో రాబోతున్నది, అప్రమత్తం కావాలని ఏడాది కిందటే నిపుణులు మొత్తుకుంటే, పాలకులు వినలేదు. ప్రతిపక్షాలు అప్రమత్తం చేస్తే ‘మీరు చెప్తే మేం చేయాలా?’
‘తాటిచెట్టు ఎందుకు ఎక్కావూ అంటే.. దూడ గడ్డి కోసం’ అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న సాకులు. అధికారంలోకి వచ్చి మూడేండ్లు దాటుతుంటే చేసిందేంటో చెప్పుకోలేని దుస్థితి ఈ సరారుది. వీళ్ల ఘనకార్యానికి ముఖ్యమైన రంగాలన్నీ మూలకు పడ్డాయి. ఆఖరికి ఎల్ నినో రాబోతున్నది, అప్రమత్తం కావాలని ఏడాది కిందటే నిపుణులు మొత్తుకుంటే, పాలకులు వినలేదు. ప్రతిపక్షాలు అప్రమత్తం చేస్తే ‘మీరు చెప్తే మేం చేయాలా?’ అంటూ అహంకారపూరిత ధోరణితో హస్తం పార్టీ పాలకులు విర్రవీగారు. వేల టీఎంసీల నీళ్లు వరద ఆంధ్రాకు తరలిపోతుంటే ఎవరి ప్రయోజనాల కోసమో ప్రేక్షక పాత్ర పోషించారు. ‘అయ్యా నీళ్లెత్తండి.. లేదంటే అన్నదాతలు ఆగమైతరు’ అని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు, ఇంజినీరింగ్, వ్యవసాయ నిపుణులు సైతం పాలకులను హెచ్చరించారు.
కానీ కాంగ్రెస్ పాలకులు ‘నీళ్లు ఎత్తబోం’ అంటూ నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. నేడు ఎల్ నినో కోరలు చాచింది. నీళ్లు ఇవ్వడం చేతగాని పాలకులు ప్రజాకోర్టులో తలదించుకొని నిలబడ్డారు. మూడేండ్ల పాలనలో రాష్ర్టాన్ని దివాలా తీయించిన కాంగ్రెస్ పాలకులే నేడు కింద పడ్డా తమదే పైచేయి అనే అహంభావంతో అడ్డగోలు వ్యాఖ్యలతో బుల్డోజ్ చేస్తున్నారు. ‘నీళ్లెత్తండి మహాప్రభో’ అంటే చీమ కుట్టినట్టు కూడా స్పందించని నేతలు, ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా రంకెలేస్తున్నారు. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన కారణంగా ప్రజల ముందుకు వెళ్లడానికి ముఖంలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కరువు చర్చను పక్కదోవ పట్టించాలని చూస్తున్నారు. కానీ ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయి. ప్రజలకు ఎదురవుతున్న కరువు, కన్నీళ్లు, కష్టాలు, బాధల నుంచి దృష్టి మరలడానికి అవేమీ చిన్న సమస్యలు కాదు. కానీ తోలుమందం సర్కారుకు అవి పట్టవు.
నిజాలను దాచడానికి సోమవారం కొడంగల్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ పాలనపై మరోసారి అడ్డగోలు, నిరాధార ఆరోపణలు చేశారు. కేసీఆర్ పాలనలో రూ.8 లక్షల కోట్లు అప్పు తెచ్చారంటూ అబద్ధాలు వల్లెవేశారు. తాము అధికారంలోకి వచ్చి, వ్యవస్థను గాడిలో పెట్టామని చెప్పుకొన్నారు. రేవంత్ మాటల్లోనే తన పాలన డొల్లతనం బయటపడింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రూ.3.5 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్రం పార్లమెంటు వేదికగా ఎప్పుడో తేల్చిచెప్పింది. సమైక్య పాలనలో విధ్వంసమైన తెంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ తెచ్చిన అప్పులు తోడ్పడ్డాయి. ప్రాజెక్టులు, పథకాలు, మౌలిక సదుపాయాలు కార్యరూపం దాల్చాయి. మరి కాంగ్రెస్ సర్కార్ మూడేండ్లు గడువక ముందే తెచ్చిన రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు అప్పుతో ఏం చేసిందంటే చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నదా? ఇటీవల కాగ్ నివేదిక కూడా రాష్ట్ర ఆదాయం, అప్పుల స్థితిగతులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తేల్చిచెప్పింది.
సంక్షేమ పథకాలను అటకెక్కించి, రైతుబంధు ఎగ్గొట్టి, రైతుబీమాకు ప్రీమియం కూడా కట్టకుండా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని అధ్వాన పాలనతో సకల జనులు సతమతమవుతున్నారు. అధికారంలోకి వచ్చి చేసిన నిర్వాకం చాలదన్నట్టు, జీతాలు టైమ్‌కు ఇవ్వకపోతే ఇంటి అద్దె, బిల్లులు, పిల్లల ఫీజులు, దవాఖాన ఖర్చులు ఎలా గడుస్తాయని రేవంత్‌రెడ్డి నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే దవాఖాన ఖర్చులకు కూడా అవస్థలు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల అవస్థలు ఎందుకు గుర్తుకురావడంలేదో! పాలమూరు గడ్డపై రేవంత్‌రెడ్డి మాట్లాడిన పచ్చి అబద్ధాలు ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అనే చందంగా ఉన్నాయి. కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగిపోయాయి. చెట్టుకొకరు పుట్టకొకరుగా పోయినవాళ్లు సొంతూర్లకు తిరిగి వచ్చారు.
సాగు చేసుకుంటూ సుభిక్షంగా బతికారు. కానీ నేడు కాంగ్రెస్ మళ్లీ ఆనాటి సమైక్య పాలనలోని రోజులు తెచ్చింది. వలసలు తీవ్రమయ్యాయి. కేసీఆర్ పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 95శాతం పూర్తయింది. కానీ మిగిలిన 5 శాతం పనులకు సంబంధించి మూడేండ్లలో కాంగ్రెస్ సర్కార్ తట్టెడు మట్టి తీయలేదు. మూడేండ్లుగా చోద్యం చూడటం వల్ల కృష్ణా జలాలను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వినియోగించుకోలేకపోతున్నది. నిజాలు ఇలా ఉంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం నిరాధార ఆరోపణలు చేయడం సూర్యుడిపై బురదజల్లడమే అవుతుంది. ఎవరు ఏంటో, మాటలు కాదు, చేతలే చెప్తాయి. ఇప్పటికే పాలు, నీళ్లు ప్రజలకు అర్థమైంది. పరిస్థితి అర్థమై ఆవేశం, అసహనంతో మాట్లాడితే, అబద్ధాలను గట్టిగా అరిచి చెప్తే, నిజాలు కావు. మూడేండ్లలో ప్రజల దృష్టిలో దోషులుగా తేలిన కాంగ్రెస్ పాలకులకు మిగిలింది ప్రజాతీర్పుతో వేసే శిక్షనే.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

