శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Mar 26, 2020 , 22:33:26

దాచిన చైనా.. దాగని కరోనా

దాచిన చైనా.. దాగని కరోనా

తన కుమారుడి మరణంపై వెన్లియాంగ్‌ తండ్రి లీ షుయింగ్‌ స్పందిస్తూ.. ‘నా కుమారుడు వదంతులను వ్యాపింపజేయలేదు. ఆయన చెప్పిన మాటలు ఈ రోజు నిజం కాలేదా? నా కొడుకు అద్భుతమైన వ్యక్తి’ అంటూ బరువెక్కిన గుండెతో వ్యాఖ్యానించారు. మరోవైపు, వెన్లియాంగ్‌ మరణం దేశంలోని కమ్యూనిస్టు సర్కార్‌పై చైనీయుల్లో ఉన్న అసంతృప్తిని బట్టబయలు చేసింది.

యావత్‌ ప్రపంచం కరోనా బారిన పడి గిలగిలా కొట్టుకుంటున్నది. ఈ మహమ్మారి నుంచి బతికిబట్టకడుతామా? అన్న ఆవేదన, ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, దేశాలు, సరిహద్దులు, ఆర్థిక అంతరాలు.. మానవులు ఏర్పాటుచేసుకున్న సమస్త గుర్తింపులు, విభజనలు ఈ వైరస్‌ తాకిడి ముందు కొట్టుకుపోతున్నాయి. యావత్‌ మానవజాతి ఒక్కటై కరోనా వైరస్‌ మీద పోరాడుతున్న అరుదైన దృశ్యం నేడు కనిపిస్తున్నది. అయితే, ఈ కీలక సమయంలో.. అసలు ఈ వైరస్‌కు మూలకారణమైన చైనాపై సందేహాలు కూడా అదేస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశం కావాలనే ఒక జీవాయుధాన్ని సృష్టించి ప్రపంచం మీద వదిలిందా? 

ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందే ఆర్థికమాం ద్యం నెలకొన్న నేపథ్యంలో పోటీనిస్తున్న దేశాల ను దెబ్బతీసి తన మార్కెట్‌ ప్రయోజనాలను కాపాడుకోవటానికి ఈ వైరస్‌ను సృష్టించిం దా? నిజంగానే ఆ దేశంలో అనుకోని పరిస్థితు ల్లో ఓ కొత్త వైరస్‌ పుట్టుకొచ్చి అదుపులేకుండా విస్తరించిందా? అంటూ రకరకాల సందేహాలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ సందేహాలకు ఇప్పుడు సమాధానం వెతకటం అసాధ్యం. ఎందుకంటే, అందుకు తగిన వనరులు ప్రస్తుతం ఎవరి వద్దా లేవు. రాబోయేరోజుల్లో దీనిపై పరిశోధనలు, అధ్యయనాలు జరిగితే ఏమైనా సమాధానాలు దొరుకుతాయేమో గానీ ప్రస్తుతానికి మాత్రం దీనిని వదిలేయాల్సిందే. అయితే, ప్రస్తుతం ఒక అంశంపై మాత్రం చర్చించుకోవచ్చు. కరో నా వైరస్‌ పుట్టుక, దాని వ్యాప్తి పట్ల చైనా అనుసరించిన రహస్య వైఖరి, పాటించిన గోప్యత గురించి మాత్రం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు ఇదే ప్రపంచానికి ఒక పెద్ద సమస్యగా మారింది కాబట్టి.

కరోనా గురించి చైనా తన వద్ద ఉన్న వివరాలను ముందుగానే వెల్లడించి ఉంటే ప్రపంచానికి, తమ దేశానికి ఇంతటి ముప్పు సంభవించి ఉండేది కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ట్రంప్‌ చేసే ప్రతీ వ్యాఖ్యతో ఏకీభవించాల్సిన పని లేదు గానీ.. కరోనా-చైనాపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యను మాత్రం పలువురు విశ్లేషకులు, ఆరోగ్య నిపుణులు సమర్థిస్తున్నారు. వీళ్లే కాదు.. చైనాకు చెం దిన పలువురు మేధావులు, ఆ దేశం లో ఉండే ఏకైక పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీకి చెందిన సభ్యులు, దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ విమర్శకులు, సాధారణ చైనీయులు కూడా ఇదే మాట అంటున్నా రు. కరో నా విషయంలో జిన్‌పింగ్‌ సర్కార్‌ పాటించిన గోప్యత, దేశంలో భావవ్యక్తీకరణపై ఉన్న కఠినమైన ఆంక్షలే పరిస్థితిని ఇక్కడివరకూ తెచ్చాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చైనాలో హుబీ రాష్ట్ర రాజధాని వూహాన్‌లో కరోనా వైరస్‌ పుట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఒక కొత్త వైరస్‌ పుట్టుకొచ్చిందని, సార్స్‌ వైరస్‌ తరహాలో ఉన్న ఈ వైర స్‌ వేగంగా వ్యాపిస్తున్నదని, రోగులకు చికిత్స అందిస్తున్నప్పుడు దీనినుంచి కాపాడుకోవటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వూహాన్‌లోనే ఒక యువ డాక్టర్‌ తన సహచర వైద్యులకు గతేడాది డిసెంబర్‌ 30నే ఫోన్‌లోని చాట్‌గ్రూప్‌లో సందేశాలు పంపించాడు. అత డి పేరు లీ వెన్లియాంగ్‌. అతడొక నేత్ర వైద్యు డు. వెన్లియాంగ్‌.. ప్రపంచంలో తొలిసారిగా కరోనా ముప్పును పసిగట్టిన ప్రతిభావంతుడు మాత్రమే కాదు, దానిగురించి తన చుట్టూ ఉన్నవారికి తెలియజేసి, వారి ప్రాణాలు కాపాడటానికి పరితపించిన సామాజిక బాధ్యత కూడా ఉన్న వైద్యుడు. కానీ, ఆయన చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరయ్యా యి. తన విధానాలను ప్రశ్నించే వారిపై కన్నెర్ర చేసినట్టుగానే.. ఈ వైద్యుడిపైనా కమ్యూనిస్టు చైనా సర్కార్‌ కొరడా ఝుళిపించింది. అబద్ధాలను, వదంతులను ప్రచారం చేస్తున్నావని, సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తున్నావం టూ ఆయన మీద జనవరి 3న కేసులు నమో దు చేసింది. ఇక మీదట ఇలా చేయవద్దని హెచ్చరించి వదలిపెట్టింది. నియంతలు మనుష్యులను నియంత్రించగలరు గానీ.. వైరస్‌ల ను కాదు కదా!కరోనా వైరస్‌ విజృంభించింది. దానిగురించి తొలిసారిగా హెచ్చరించిన డాక్టర్‌ వెన్లియాంగ్‌ కూడా దాని బారినపడ్డారు. జనవరి 10 నుంచి ఆయనలో దగ్గు మొదలైంది. మరుసటిరోజు జ్వరం వచ్చింది. దవాఖానలో చేరారు. ఆయనకు కరోనా సోకిందని జనవరి 30న తెలిసింది. ఆ జబ్బుతోనే ఫిబ్రవరి 7న వెన్లియాంగ్‌ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు కేవలం 33 ఏండ్లు. వెన్లియాంగ్‌ భార్య ప్రస్తుతం గర్భవతి. ఆమెకు జూన్‌లో ప్రసవం కానుంది. తన కుమారుడి మరణంపై వెన్లియాంగ్‌ తండ్రి లీ షుయింగ్‌ స్పందిస్తూ.. ‘నా కుమారుడు వదంతులను వ్యాపింపజేయలేదు. ఆయన చెప్పిన మాటలు ఈ రోజు నిజం కాలేదా? నా కొడుకు అద్భుతమైన వ్యక్తి’ అంటూ బరువెక్కిన గుండెతో వ్యాఖ్యానించారు. మరోవైపు, వెన్లియాంగ్‌ మరణం దేశంలోని కమ్యూనిస్టు సర్కార్‌పై చైనీయుల్లో ఉన్న అసంతృప్తిని బట్టబయలు చేసింది.

‘వెన్లియాంగ్‌ మృతికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి’, ‘ఇది ఒక విజిల్‌బ్లోయర్‌ మృతి కాదు.. ఇది ఒక హీరో అస్తమయం’,  ‘మాట్లాడే స్వేచ్ఛ మాకు కావాలి’ అన్న నినాదాలు చైనా సోషల్‌ మీడియా ‘వీచాట్‌' తదితర వేదికల్లో వైరల్‌ అయ్యాయి. ఈ కామెంట్లను ప్రభుత్వ సంస్థలు ఎప్పటికప్పుడు తొలిగించి నా కూడా మళ్లీ మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. వెన్లియాంగ్‌ అస్తమయం వార్త టాప్‌ ట్రెండింగ్‌ అయ్యింది. దాదాపు 150 కోట్ల మంది ఆ వార్తను చూసినట్లు అంచనాలు వెలువడ్డాయి. చైనాలో ఇటీవలి కొన్నేండ్లలో ఒక అంశంపై ఇంతటి ప్రజాగ్రహం ఎన్నడూ వెల్లడి కాలేదు.

కరోనా వైరస్‌ గురించి తొలి హెచ్చరిక చేసి న వైద్యుడిని మాత్రమే కాదు.. ఈ వైరస్‌ కట్టడి విషయంలో ప్రభుత్వం పాటించిన గోప్యతను ప్రశ్నించిన వారి పట్ల చైనా ప్రభుత్వం అణిచివేత ధోరణితోనే వ్యవహరించింది. చైనాకు చెందిన రెన్‌ ఝిక్వియాంగ్‌ ఒక ప్రముఖ రియ ల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త. చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ముఖ్యనేతల్లో ఒకరు. ఆయన తండ్రి ఆధునిక చైనా వ్యవస్థాపకుడు మావోజెడాంగ్‌తో కలిసి పనిచేశారు. మాట్లాడుకునే స్వేచ్ఛపై ప్రభుత్వం విధించిన నిర్బంధం వల్ల నే కరోనా ముప్పు ఇంతగా పెరిగిపోయిందని రెన్‌ ఝిక్వియాంగ్‌ విమర్శలు గుప్పించారు. వైరస్‌ను కట్టడి చేసినట్లు జిన్‌పింగ్‌ చేసుకుంటున్న స్వోత్కర్షను తూర్పారబట్టారు. బంగా రు బట్టలు ధరించాననే భ్రమతో దిగంబరంగా వీధుల్లో తిరిగే చక్రవర్తితో పోల్చి ఎద్దేవా చేశా రు. దీంతో ఆయన ఈ నెల 14 నుంచి అదృశ్యమయ్యారు. ఇప్పటికీ ఆయన ఆచూకీ తెలియదు. ఝూ ఝియాంగ్‌ అనే ప్రముఖ న్యాయనిపుణుడు, కార్యకర్త.. కరోనా విషయంలో ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను తీవ్రంగా విమర్శిస్తూ జిన్‌పింగ్‌కు ఇటీవల ఒక బహిరంగలేఖ రాశారు. ప్రస్తుతం ఆయన పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. ఈ విధంగా కమ్యూనిస్టు ప్రభుత్వం విధించిన నిర్బంధం ఫలితంగానే కరోనా గురించి ప్రజలకు తొలిరోజుల్లో తెలియకుండా పోయిందని, దానివల్లే వేలమంది ప్రాణాలు కోల్పోయారని చైనాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా, జిన్‌పింగ్‌ సర్కార్‌ మాత్రం తమ కట్టుదిట్టమైన చర్యల వల్లనే వైరస్‌ను అదుపులోకి తెచ్చామని ప్రచారం చేసుకుంటున్నది. చైనా సంగతి ఇలా ఉన్నప్పటికీ.. మరో కమ్యూనిస్టుదేశమైన క్యూబా మాత్రం.. తమ దేశం నుంచి పెద్ద ఎత్తున వైద్య బృందాలను కరోనా పీడిత దేశాలకు పంపిస్తూ సేవలను అందించ టం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకోవటం.. ‘కరోనా-కమ్యూనిజం’ అంశంలోని మరో కోణం.


logo