సూర్యాపేట, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : పారిశుధ్యం లోపించినా, వీధుల్లో గుంతలు ఏర్పడినా, వీధి లైట్ల సమస్య, దోమల బెడద ఉన్నా సరే.. సెల్ఫోన్లో ఫొటో తీసి పంపితే చాలు.. మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. గంటల వ్యవధిలో సమస్య పరిష్కారం అవుతుంది. మున్సిపల్ సిటిజన్ బడ్డీ యాప్ ద్వారా ఈ అవకాశం లభిస్తున్నది. ఎలాంటి ఫిర్యాదులైనా, దరఖాస్తులైనా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. వాటి పురోగతిని తెలుసుకోవచ్చు. ఫిర్యాదులు, దరఖాస్తుల విషయమై పురోగతి ఏ స్థాయిలో ఉంది? దరఖాస్తు ఏ సెక్షన్ వద్ద ఉందనేది సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రతి పనికీ నిర్ణీత గడువు ఉంటుంది. ఉద్యోగి ఆలస్యం చేస్తే కమిషనర్‌కు, అక్కడ కూడా స్పందించని పక్షంలో నేరుగా మున్సిపల్ డైరెక్టర్‌కు మెసేజ్ వెళ్తుంది. ఈ యాప్ ప్రారంభమై రెండేళ్లు గడుస్తుండగా అవగాహన లోపం కారణంగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించడం లేదు.
రోజురోజుకూ పెరుగుతున్న టెక్నాలజీతో పనులు సులువుగా పూర్తవుతున్నాయి. ప్రస్తుతం వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో చెప్పులరిగేలా తిరిగినా కాని పనులు ఇపుడు అధికారులు, సిబ్బందే ప్రజల వద్దకు వచ్చి పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పురపాలక శాఖ ప్రవేశపెట్టిన సిటిజన్ బడ్డీ యాప్ ద్వారా ఇండ్ల నుంచే ఫిర్యాదులు, దరఖాస్తులు చేసుకునే అవకాశం వచ్చింది. దాంతో ప్రజలకు పనులు సులువుగా, పారదర్శకంగా జరుగుతున్నాయి.
సేవలకే కాదు.. ఫిర్యాదులకూ బడ్డీ యాప్
ప్రజల్లో అవగాహన లేకపోవడంతో బడ్డీ యాప్‌కు ఆదరణ తగ్గింది. యాప్‌ను సేవల కోసం తప్ప ఫిర్యాదులకు వినియోగించడం లేదు. దీనిని ప్రతి ఒక్కరూ విరివిగా వినియోగిస్తే పరిసరాలు పరిశుభ్రంగా మారడంతోపాటు సమస్యలు పరిష్కారం అవుతాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో ఇప్పటి వరకు పలు సేవల కోసం 3,774 దరఖాస్తులు చేయగా వీటిలో 3,069 గడువులోపు పరిష్కారమయ్యాయి.
స్పందించని ఉద్యోగుల వేతనం కట్…
ఎవరైనా బడ్డీ యాప్ ద్వారా సేవలు లేదా ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఫిర్యాదు చేసినా అధికారులు సత్వరమే స్పందించాల్సి ఉంటుంది. గడువులోపు పరిష్కరించని సంబంధిత ఉద్యోగి వేతనం కట్ చేసి దరఖాస్తుదారుడికి అందజేస్తారు. ఇలాంటివి సూర్యాపేటలో చోటు చేసుకోలేదని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
యాప్ డౌన్ లోడ్ ఇలా..
ప్లే స్టోర్‌లో సిటిజన్ బడ్డీ అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసే సమయంలో పేరు, సెల్ నంబర్, జిల్లా, మున్సిపాలిటీ తదితర వివరాలు నమోదు చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. యాప్ ఓపెన్ చేస్తే అన్ని రకాల సేవలతో పాటు ఫిర్యాదులు డిస్ప్లే అవుతాయి. వాటిపై క్లిక్ చేసి సెండ్ కొడితే సరిపోతుంది.