కొండాపూర్ : వెనుకబాటుతనం రూపుమాపే దిశలో వాస్తవికత ఆధారంగా డిమాండ్లు ఉండాలని, అలాంటప్పుడే ఆయా వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు.
మంగళవారం చందానగర్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో నిర్వహించిన శిష్టకరణం కుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కుల సంఘ ప్రతినిధులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలపై రొటీన్‌కు భిన్నంగా, వైవిధ్యంగా ఆలోచించి ప్రభుత్వానికి నివేదించాలన్నారు. స్పష్టతలేని వినతుల ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు. రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేకించి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.
నిరంతరం ఆత్మన్యూనతా భావంతో తమను తాము తక్కువ చేసుకోవడం కాకుండా చైతన్యవంతంగా వ్యవహరించాలని కుల సంఘ ప్రతినిధులకు సూచించారు. కాలంతో పాటుగా వేగంగా ఆడుగులు వేయడం అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శిష్టకరణ జాతీయ అధ్యక్షులు డీవీ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.