హఫీజ్పేట్, కొండపూర్ : బతుకమ్మబతుకమ్మ ఉయ్యాలో.. బంగారుబతుకమ్మ ఉయ్యాలో..ఒక్కేసిపువ్వేసి చందమామ ఒక్కజాముఅయే చందమామ అంటూ మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఉత్సవాలు రెండోరోజు వైభవంగా జరిగాయి.
ఉత్సవాలలో భాగంగా రెండోరోజు అటుకుల బతుకమ్మను పురస్కరించుకొని మహిళలు తీరొక్కపూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది వాడవాడలా సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా గౌరీదేవిని ఆరాధిస్తూ పాటలుపాడి భక్తిశ్రద్ధలతో కొలిచారు. హఫీజ్పేట్ డివిజన్లో పలుచోట్ల నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో కార్పొరేటర్ పూజితజగదీశ్వర్గౌడ్ ముఖ్యఅతిధిగా పాల్గోని మహిళలతోకలిసి ఆడిపాడారు.
అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ… ప్రపంచంలో పూలను పూజించే ఏకైక సంస్కృతి మనదన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతిఅధ్యక్షురాలు కవితదేనన్నారు. కార్యక్రమంలో స్ధానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు. అలాగే కొండపూర్ రాఘవేంద్రకాలనీ మహిళలు బతుకమ్మలు ఆడి పాడి సందడి చేశారు.