బంజారాహిల్స్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుబయట వాకింగ్‌కు వచ్చిన సినిమా నటిపై గుర్తుతెలియని దుండ గుడు దాడికి పాల్పడడంతో పాటు సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండా పూర్లోని బొటానికల్ గార్డెన్స్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న టాలీవుడ్ నటి షాలూ చౌరాసియా గత మూడేండ్లుగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వస్తుంటుంది.
ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం 6.30 ప్రాంతంలో కేబీఆర్ పార్కు బయట ఉన్న జీహెచ్ఎంసీ వాక్‌వేలో షాలూ చౌరా సియా ప్రవేశించింది. రాత్రి 8.40 ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న షాలూను కొంతదూరం అనుసరించిన గుర్తుతెలియని యువకుడు అమె జూబ్లీహిల్స్ రోడ్ నెం 92లోని స్టార్‌బక్స్ ఎదురుగా నిర్మానుష్య ప్రాంతంలోకి రాగానే వెనకనుంచి గట్టిగా పట్టుకున్నాడు.
కేకలు పెట్టకుండా నోటికి గుడ్డలు అడ్డుపెట్టి ఆమెను పక్కనే ఉన్న బండరాయికి అదిమిపెట్టాడు. బంగారం.. నగదు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు..దాంతో తీవ్ర ఆందోళనకు గురయిన షాలూ తప్పించుకునే ప్రయత్నం చేయగా ఆమెను కిందపడేసిన దుండగుడు కాళ్లతో తన్నడంతో పాటు కిందపడేసి కాలుతో తొక్కిపెట్టాడు.
ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కున్నాడు. పక్కనే ఉన్న బండరాయిని ఆమె తలపై వేసేందుకు ప్రయత్నించడంతో గట్టిగా ప్రతిఘటించడంతో పాటు ఒక్క ఉదుటున పైకిలేచి పక్కనున్న గేటువద్దనుంచి బయటకు పరిగెత్తింది. సుమారు 5 నుంచి 10 నిమిషాలపాటు పెనుగులాట జరగడంతో ఆమె చేతులతో పాటు కడుపు, గొంతు ప్రాంతంలో గాయాలయ్యాయి.
బయటకు వెళ్లిన షాలూ చౌరాసియా స్టార్ బక్స్ వద్ద పనిచేస్తున్న కొంతమంది డ్రైవర్ల సాయంతో జరిగిన విషయాన్ని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయగా బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాగా దాడి విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులు కొంతమంది రాత్రి 9.30 ప్రాంతంలో సంఘటనా స్థలానికి వచ్చి షాలూను ప్రాథమిక చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు.
ఈ మేరకు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం జరిగిన విషయాన్ని గురించి రాత్రి 11.30 ప్రాంతంలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు..
నగరంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేబీఆర్ పార్కులో నిత్యం వందలాది మంది వీఐపీలు వాకింగ్‌కు వస్తుంటారు. ఈ నేపథ్యంలో సినీనటి షాలూ చౌరాసియాపై దుండగుడు దాడికి పాల్పడడంతో పాటు సెల్‌ఫోన్ లాక్కుని పరారు కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
సంఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. షాలూపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరనే అంశాన్ని తెలుసుకునేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేవలం ఆభరణాల కోసం, సెల్‌ఫోన్ కోసమే దాడికి పాల్పడ్డాడా. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలిసిన వారెవరైనా ఆమెను వెంబడించి దాడి చేసి ఉంటారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి 6.30కి కేబీఆర్ పార్కు మూతపడడంతో చాలామంది పార్క్ బయట జీహెచ్ఎంసీ వాక్‌వేలో వాకింగ్ చేస్తుంటారు. ఇదే విధంగా షాలూ చౌరాసియా కూడా రోజూ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆమెపై దాడి జరగడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.