ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పలుచోట్ల ఏకధాటిగా కురిసిన వానతో వాగులు పొంగిపొర్లాయి.. చెరువులు, కుంటలు అలుగుపోశాయి. సూర్యాపేట మండలంలో 14.5 సెంటీమీటర్లు, నకిరేకల్, కట్టంగూరు మండలాల్లో 11 సెంటీ మీటర్ల వర్షం కురువగా మిగతా మండలంలో మోస్తరు వర్షపాతం నమోదైంది.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండగా మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సూర్యాపేట,జనవరి 16 : సూర్యాపేట జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. శనివారం రాత్రి 12:30 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునిగాయి. జిల్లా కేంద్రం సమీపంలోని ఎర్కారం వెదర్ స్టేషన్ పరిధిలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. పది గంటల వ్యవధిలో 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపట పరిసర ప్రాంతాల్లో 20 ఏండ్లలో ఇదే రికార్డు. భారీ వర్షంతో సూర్యాపేట పట్టణంలోని పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. పలుచోట్ల ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరింది.
అర్ధరాత్రి కుండపోత..
అర్ధరాత్రి కుండపోత వర్షం కురువడంతో తెల్లవారేసరికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రం సమీపంలోని అన్ని చెరువులు అలుగులు పోశాయి. సద్దుల చెరువు రెండు ఫీట్ల మేర అలుగు పోయడంతో కింది ప్రాంతాలు, చెరువు పై ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. అలుగు ఉధృతంగా పోయడంతో చెరువు కింది భాగంలో ఉన్న నాలా నిండి విద్యుత్ సబ్ స్టేషన్, ఎస్వీ డిగ్రీ కాలేజీ, మెడికల్ కళాశాలల్లోకి వెళ్లాయి. ఉమ్మడి జిల్లాలో సూర్యాపేట, నూతనకల్, ఆత్మకూర్.ఎస్, చివ్వెంల, నకిరేకల్, కట్టంగూర్, మునుగోడు, కేతేపల్లి, కనగల్, నార్కట్‌పల్లి, చండూరు, చిట్యాల, నల్లగొండ మండలాల్లో 2 నుంచి 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కట్టంగూరులో 11.5 సెంటీమీటర్ల వర్షం పడగా.. ఇదే మండలంలోని ఈదులూరులో అసలే లేదు. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లోని పంట పొలాలు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. చివ్వెంల మండలం పిల్లలజగ్గుతండాలో ఒక పూరిగుడిసె కూలింది. సూర్యాపేట-కాసరబాద మధ్య వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
భువనగిరి జిల్లాలో చిరు జల్లులు..
భువనగిరి కలెక్టరేట్, జనవరి 16 : జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చిరుజల్లులు పడ్డాయి. జిల్లాలో 4.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రామన్నపేట మండలంలో 22.8మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. యాదగిరిగుట్ట మండలంలో 12.2 మిల్లీమీటర్లు, బొమ్మలరామారంలో 6.4, చౌటుప్పల్‌లో 6, భువనగిరిలో 4.8, ఆత్మకూర్(ఎం)లో 3.8, తుర్కపల్లి(ఎం)లో 3.2, వలిగొండలో 2.4, రాజాపేటలో 2, భూదాన్ పోచంపల్లి మండలంలో 1.2మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో వర్షం పడలేదు.
ఉధృతంగా మునుగోడు, కొరటికల్ వాగులు…
మునుగోడు : మండల వ్యాప్తంగా రెండు గంటలకు పైగా భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో వీధులు జలమయమయ్యాయి. మునుగోడు పెద్దవాగు, కొరటికల్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
నల్లగొండ-నకిరేకల్ మార్గంలో రాకపోకలకు అంతరాయం
కట్టంగూర్ (నకిరేకల్), జనవరి 16 : మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి నకిరేకల్ పట్టణ శివారులోని తాటికల్లు వాగు ఉప్పొంగింది. దీంతో అక్కడే బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న వలస కూలీలు వరదలో చిక్కుకున్నారు. కాసేపటికి చాకచక్యంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాటికల్లు వాగు వరద కల్వర్టు పైనుంచి ప్రవహించడంతో నల్లగొండ-నకిరేకల్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నిండిన చెరువులు, కుంటలు..
కట్టంగూర్, జనవరి 16 : మండలంలో మూడు గంటలపాటు కురిసిన కుండపోత వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి జలకళను సంతరించుకున్నాయి. కట్టంగూర్‌లోని పెద్ద, చిన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దవాగు ఉధృతితో అంబేద్కర్‌నగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.
అకాల వర్షంతో అతలాకుతలం
అర్వపల్లి, జనవరి 16 : అకాల వర్షంతో మండలం అతలాకుతలమైంది. భారీ వర్షానికి పంట పొలాలు మునిగిపోయాయి. వెదజల్లే పద్ధతి, డ్రమ్‌సీడర్ ద్వారా సాగు చేసిన వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. అర్వపల్లిలో వరద నీరు ఇండ్ల మధ్యలోకి చేరింది.