కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ
అధికారులతో సమీక్షా సమావేశం
పెద్దపల్లి జంక్షన్, ఆగస్టు 26: ప్రత్యేక తరగతులు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లాలోని విద్యాలయాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. సంబంధిత అధికారులతో కలెక్టర్ తన చాంబర్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 1వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పంచాయతీ, మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో తరగతి, వంట గదులు, తాగునీటి ట్యాంకులు, పరిసరాలను శుభ్రం చేయించాలన్నారు. సోడియం హైపోక్లోరైట్/ బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేయించాలని సూచించారు. నీటి, విద్యుత్, చిన్న పాటి రిపేర్లు ఉంటే అందుబాటులో ఉన్న నిధులతో వెంటనే మరమ్మతు చేయించాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పని సరిగా మాస్కు ధరించేలా చూడాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఎవరికైనా జ్వర లక్షణాలుంటే కొవిడ్ టెస్ట్ చేయించాలని, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు. కొవిడ్ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీఈవో జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శానిటేషన్ చేయించాలి
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 26: తరగతి గదుల్లో తప్పని సరిగా శానిటేషన్ చేయించాలని ఉపాధ్యాయులను డీఈవో జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కూనారం జడ్పీ హైస్కూల్‌ను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలల ప్రారంభంపై హర్షం
రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారం భించాలనే ప్రభుత్వ నిర్ణయంపై పీఆర్టీయూ మండలా ధ్యక్షుడు కడారి ననీన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష బోధన లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు.
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయులను ఎంపీపీ నూనేటి సంపత్ ఆదేశించారు. జాఫర్‌ఖాన్‌పేట ప్రభుత్వ పాఠశాలను ఎంపీపీ పరిశీలిం చారు. విద్యార్థులు కచ్చితంగా మాస్కులు ధరించి వచ్చేలా సూచించాలని పేర్కొన్నారు. తాగునీటి వసతిపై ఆరా తీశారు. ఆయన వెంట ఎంపీవో గోవర్ధన్, సర్పంచ్ దొమ్మటి శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యా సంస్థలపై బల్దియా దృష్టి
కోల్‌సిటీ, ఆగస్టు 26: రామగుండం నగర పాలక సంస్థ విద్యా సంస్థలపై దృష్టి సారించింది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను తెరిచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేయర్ అనిల్‌కుమార్, కమిషనర్ ఉదయ్‌కుమార్ ఆదేశాలతో పారిశుధ్య విభాగం నడుం బిగించింది. గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం తదితర ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో పరిశుభ్రం చేసి శానిటైజేషన్ చేస్తున్నారు. గురువారం పారిశుధ్య పర్యవేక్షణ అధికారి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో ఆయా డివిజన్లలో సూపర్వైజర్లు, పారిశుధ్య కార్మికులతో విద్యా సంస్థల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగింపజేశారు.
వసతుల కల్పనపై శ్రద్ధ పెట్టాలి
ధర్మారం, ఆగస్టు 26: పాఠశాలల్లో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జడ్పీ సీఈవో శ్రీనివాస్ సూచించారు. పాఠశాలల ప్రారంభంపై సంబంధిత అధికారులతో మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట గదిని, ఎర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాలలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయశీల, ఎంఈవో చాయదేవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం, ఆగస్టు 26 : విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలనిఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల స్వర్ణలత అశోక్‌యాదవ్ సూచించారు. పోతారం బడిలో పారిశుధ్య పనులను వారు పరిశీలించారు. ఇక్కడ ఎంఈవో సంపత్‌రావు, సర్పంచ్ మహేందర్‌యాదవ్, ఎంపీటీసీ శ్యామల సదానందం, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో వేణుమాధవ్, ఉపాధ్యాయుడు సతీశ్ పాల్గొన్నారు.