వెంగళరావునగర్ : గుట్టుగా సాగుతున్న పేకాట స్థావరం పై పోలీసులు దాడులు నిర్వహించి రట్టు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
కల్యాణ్ నగర్ సమీపంలోని స్వర్ణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెం.జి4లో పేకాట కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. నిర్వాహకుడు రమాకాంత్ రెడ్డి పరారవ్వగా పేకాట ఆడుతున్న 19 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.4,88,260 నగదు, 104 పేక ముక్కలు, మరో 4 సెట్ల సీలు తీయని పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు.