సొంత ఖర్చులు రూ. 7లక్షలతో ఇల్లు కటించిన మంత్రి కేటీఆర్
మనువరాలి పెళ్లికి ముందురోజే కల్యాణలక్ష్మి చెక్కు
మంత్రి ఆదేశాలతో అందజేసిన అధికారులు
కేటీఆర్ సారు దేవుడని కొనియాడిన నీలవ్వ కుటుంబసభ్యులు
సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 7: ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మంత్రి కేటీఆర్ కష్టాల కడలిలో చిక్కుకున్న నిరుపేద మహిళ జీవితాన్ని నిలబెట్టాడు. అడుగడుగునా అండగా ఉంటూ వారికి పెద్దదిక్కయ్యాడు. సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించి ఇచ్చి దాతృత్వాన్ని చాటిన రామన్న, తాజాగా మహిళ మనువరాలి పెళ్లికి ముందుకు రోజే కల్యాణలక్ష్మి చెక్కు మంజూరు చేయించి కల్యాణకాంతులు నింపాడు.
తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్కు చెందిన మేడిపల్లి నర్సయ్య- నీలమ్మకు ఇద్దరు కొడుకులు సుదర్శన్, ప్రభాకర్, కూతురు వసంత ఉన్నారు. కూలీనాలీ చేసుకుంటూ జీవించేవారు. ఎనిమిదేండ్ల కిందట నర్సయ్య గొంతు క్యాన్సర్తో మృతి చెందాడు. భర్త మృతి చెందిన ఏడాదికే పెద్దకొడుకు సుదర్శన్ లీవర్ క్యాన్సర్తో మృతి చెందాడు. చిన్నకొడుకు ప్రభాకర్ పెళ్లయిన ఆరు నెలలకే 2016 జూలై 29న జ్వరంతో మరణించాడు. కూతురు వసంతకు వివాహం జరిపించగా భర్త వదిలి వెళ్లిపోయాడు. దీంతో తల్లి చెంతకు చేరింది. వసంతకు ఇద్దరు కొడుకులు రమేశ్, రోహిత్. బిడ్డ గీతాంజలి ఉన్నారు. పెద్దకొడుకు రోహిత్ ఐదేండ్ల క్రితం గ్రామంలోనే మురికి కుంటలో పడి మృతి చెందాడు. రెండేళ్ల క్రితం రమేశ్ కాలేయ సంబంధ వ్యాధితో కన్నుమూశాడు. దీంతో ఈ కుటుంబానికి మగదిక్కులేకుండా పోయింది.
చలించిపోయిన అమాత్యుడు కేటీఆర్
2017 ఫిబ్రవరి 23న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రామచంద్రాపూర్కు వచ్చిన మంత్రి కేటీఆర్కు నీలవ్వ కలిసి తన గోడును వెళ్లబోసుకున్నది. వీరి దయనీయస్థితిని చూసి చలించిపోయిన కేటీఆర్ వారికి అండగా నిలిచారు. అప్పటికప్పుడు రూ. 25 వేల ఆర్థిక సాయం అందించి సొంత ఖర్చులతో ఇల్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎనిమిది నెలల్లో రూ. 7లక్షలు వెచ్చించి ఇల్లు నిర్మించి ఇచ్చాడు. 2017 నవంబర్ 12న స్వయంగా గృహప్రవేశం చేయించి వారితో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. మంత్రి ఆదుకోవడంతో ఉన్నంతలో హాయిగా బతుకులు వెళ్లదీస్తున్నారు. నీలవ్వ మనుమరాలు గీతాంజలిని చదివిస్తున్నారు. ఆమె ఇటీవలే డిగ్రీ సెకండ్ ఇయర్ పూర్తి చేసింది. కాగా గీతాంజలికి మహబుబాబాద్కు చెందిన వ్యక్తితో శుక్రవారం వివాహం జరగనున్నది. స్థానిక నేతల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ పెళ్లికి ఒక్కరోజు ముందే కల్యాణలక్ష్మి కింద లక్షానూటపదహారు రూపాయలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాణి మంజుల,ఆర్బీఎస్ సిరిసిల్ల కన్వీనర్ వొజ్జల అగ్గిరాములు, మంత్రి కేటీఆర్ పీఏ గన్రాజు,ఆర్ఐ మధు, స్థానిక నేతలు, బట్టలు పెట్టి కల్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నీలవ్వ తల్లీబిడ్డలు భావోద్వేగానికి లోనయ్యారు. ఏదిక్కూ లేని మమ్మల్ని ఆదుకున్న కేటీఆరే మా దేవుడని, ఆయనకు బతికినంతకాలం రుణపడి ఉంటామని చెప్పారు.