కరోనా నిబంధనలు పాటిస్తూ హాజరు
కలెక్టర్, ఉన్నతాధికారుల పరిశీలన
ఉపాధ్యాయులు, స్థానిక సిబ్బందికి సూచనలు
విద్యాలయాల్లో బడి గంట మోగింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల రాకతో బడులకు పూర్వశోభ వచ్చింది. కలెక్టర్, ఉన్నతాధికారులు పరిశీలించి, ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
ప్రత్యేక శ్రద్ధ వహించాలి : కలెక్టర్
కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్1: ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. పెగడపల్లి హైస్కూల్లోని వంట గదులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణ ఆమె బుధవారం పరిశీలించారు. టాయిలెట్స్ సరిగా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ప్రతి విద్యార్థి మాస్క్ ధరించేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేయాలని , దోమల నివారణకు పకడ్భందీ చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పిల్లలకు జ్వరం, జలుబులాంటి లక్షణాలు కనిపిప్తే సమీప దవాఖానలో పరీక్షలు చేయించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించి, గ్రామస్తులకు ఎన్ని మొక్కలు పంపిణీ చేశారని కార్యదర్శి సౌజన్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సరీకి రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వం గళ తిరుపతిరెడ్డి, సర్పంచ్ అరెల్లి సుజాత రమేశ్, ఎంఈవో రాజయ్య, హెచ్ఎం రామగిరి సుదర్శనం, ఎంపీవో గోవర్ధన్ తదితరులు ఉన్నారు.
కొలనూర్ పాఠశాలలో..
ఓదెల, సెప్టెంబర్ 1: కొలనూర్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల పునఃప్రారంభం, ఇక్కడ పూర్వ విద్యార్థులు పాఠశాలలో చేసిన అభివృద్ధి, పరిసరాలను తిరిగి చూశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఇక్కడి పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు తీసుకున్న చొరవ గురించి సర్పంచ్ సామ మణెమ్మను అడిగి తెలుసుకున్నారు. సర్కార్ బడిని బతికుంచుకునేందుకు పూర్వ విద్యార్థులు సర్పంచ్, జీపీ పాలకవర్గం, గ్రామస్తులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. అలాగే గోపరపల్లి ప్రాథమిక పాఠశాలను కూడా సందర్శించి, విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశా రు. మధ్యాహ్న భోజనానికి బియ్యం లేకపోవడాన్ని గమనించి అధికారులను మందలించారు. ఇక్కడ సర్పంచ్ కర్క మల్లారెడ్డి, ఉప సర్పంచ్ పాకాల సంపత్‌రెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, ఎంఈవో ఆరెపల్లి రాజయ్య, ఎంపీవో వాజిద్, కార్యదర్శి భానుప్రసాద్, హెచ్ఎంలు శంకర్, నగునూరి కుమారస్వామి, ఉపాధ్యాయులు ఉన్నారు.
కమాన్‌పూర్, సెప్టెంబర్ 1: గుండారంలోని కమాన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి కల్పన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ విద్యార్థులకు బోధించాలని సూచించారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్ సునంద, అధ్యాపకులు ఉన్నారు. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కమాన్‌పూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలు 2, 3లో సర్పంచ్ నీలం సరిత పిల్లలతో అక్షరాలు దిద్దించారు. వారికి వర్క్ బుక్స్ అందజేశారు. కార్యక్రమాల్లో ఆయా అంగన్వాడీ టీచర్లు మల్యాల భాగ్య, కుక్కల జయసుధ తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం, సెప్టెంబర్ 1: మండలంలోని సీతంపేట, ఇప్పలపల్లి, ఖమ్మంపల్లి తదితర గ్రామాల్లోని పాఠశాలలకు ఉపాధ్యాయులు ఉదయం చేరుకొని విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఉపాధ్యాయులు సీతంపేటలో సర్పంచ్ పూలిపాక నగేశ్‌తో కలిసి విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. విద్యార్థులను పాఠశాలకు పంపించాలని కోరారు.
జ్యోతినగర్(రామగుండం), సెప్టెంబర్1: ఉమ్మడి రామగుండం మండల వ్యాప్తంగా పాఠశాలల్లో 8,288మంది విద్యార్థులకు గానూ 1,174 మంది హాజరయ్యారు. ముర్మూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ బాదరవేని స్వామి, కార్యదర్శి శంకర్, ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని టీచర్ సుజాత ప్రారంభించారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఇక్కడ అంగన్వాడీ టీచర్ విమల, ఏఎన్ఎం శిరీష, ఆశ వర్కర్ స్రవంతి, ఆయా పుష్పలీల ఉన్నారు.
సుల్తానాబాద్‌రూరల్, సెప్టెంబర్ 1: రామునిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీపీ బాలాజీరావు, గర్రెపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షురాలు వీరగోని సుజాత ప్రారంభి, మాట్లాడారు. కార్యక్రమంలో సీడీపీవో కవిత, సూపర్ వైజర్ సరళ, సర్పంచులు మల్యాల శ్రీనివాస్, ఎంపీటీసీలు మీస లక్ష్మి, పులి అనూష, ఉప సర్పంచులు రాంచంద్రారెడ్డి, మధుకర్ ఉన్నారు.
పెద్దపల్లి కమాన్, సెప్టెంబర్ 1: జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరైనట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ప్రతి విద్యార్థి మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు అందుబాటులో శానిటైజర్లు ఉంచారు. పెద్దపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను జిల్లా నోడల్ అధికారి కల్పన సందర్శించి, విద్యార్థులకు అధ్యాపకులు బోధించే తీరును పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు. ఇక్కడ ప్రిన్సిపాల్ సుదర్శన్ ఉన్నారు.
పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 1: పెద్దపల్లిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్ గౌడ్ సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో గర్భిణులకు సీమంతం చేసి పం డ్లు, ఫలహారాలు అందజేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పవతి, అంగన్వాడీ టీచర్ మెహరున్నీసాబేగం ఆయా భానుబీ, ఏఎన్ఎం సునీత పాల్గొన్నారు.
రామగిరి, సెప్టెంబర్ 1 : రత్నాపూర్‌లోని ప్రభు త్వ పాఠశాలను ఎంపీపీ ఆరెల్లి దేవక్క, ఎంపీడీవో విజయకుమార్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ పల్లె ప్రతిమ, సెక్రటరీ ఉప్పులేటి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.