ధర్మ సందేహం
గ్రామదేవతల ఆలయానికి వెళ్లినప్పుడు జంట (రెండు) కొబ్బరికాయలు కొట్టాలంటారు ఎందుకు?
గ్రామదేవతలను కొలిచే ఆచారం ప్రాచీనకాలం నుంచి ఉన్నది. గ్రామదేవతలు అంటువ్యాధుల నుంచి ఊరిని కాపాడుతూ, పాడిపంటలు అనుగ్రహిస్తూ ఉంటారని ప్రజలు విశ్వసిస్తారు. పొలిమేరలో కొలువుదీరిన గ్రామదేవతలు ఊళ్లోకి ఏ దుష్టశక్తులూ రాకుండా కాపుకాస్తాయని నమ్ముతారు. అందుకే, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా గ్రామదేవతలను పూజించే సంప్రదాయం ఉన్నది.
అమ్మవారి దర్శనానికి వెళ్లినప్పుడు రెండు కొబ్బరికాయలు కొట్టే ఆచారం ఉంది. సహజంగా గ్రామదేవతలు ఉగ్రమూర్తులు. ఈ దేవతలు ఎక్కువ దాహం, ఆకలి కలిగి ఉంటారని భావిస్తారు. అందుకే మద్య, మాంసాదులను అమ్మవారికి నివేదనగా సమర్పిస్తుంటారు. కొబ్బరికాయ విషయానికి వస్తే, ఆ దేవతలను తృప్తి పరచాలనే భావనతో రెండు కాయలను కొట్టి నైవేద్యం పెడతారు. అయితే, ఒక్క కొబ్బరికాయ కొట్టినా దోషం కాదు.