ఆలయం అంటే కేవలం ఓ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన స్థలం మాత్రమే కాదు. లేదా స్వయంభువుగా దేవత అవతరించిన ప్రాంతం మాత్రమే కాదు. ఆలయం అనంతమైన శక్తికి కేంద్రం. ఆలయ నిర్మాణాన్ని విస్తారంగా తెలిపే శిల్ప, ఆగమ శాస్ర్తాల్లో ఈ వివరాలన్నీ ఉంటాయి. శిల్పులు కూడా శాస్ర్తాలు చెప్పిన తీరులోనే ఆలయానికి సంబంధించిన గర్భగుడి మొదలు ఇతర మంటపాలు, ప్రాకారాలన్నీ నిర్మిస్తారు.
ఆలయాన్ని నిర్మించి, దేవతా ప్రతిష్ఠ చెయ్యటానికి ముందుగా ఆగమ శాస్త్ర పండితులు తగిన స్థలాన్ని ఎంపిక చేస్తారు. ఇందుకు అనేక నియమాలను వారు పాటిస్తారు. భూ అయస్కాంత రేఖల తీవ్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుందో ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం ఎంపిక చేస్తారు. ఎక్కడైతే భూ అయస్కాంత తరంగ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ స్థానంలో మూలవిగ్రహాన్ని దానితో పాటు రాగి యంత్రాలను కూడా ప్రతిష్టిస్తారు. రాగి యంత్రాలు భూ అయస్కాంత శక్తిని శోషించుకొని ఆ శక్తిని నలుదిశలా వ్యాప్తి చేస్తాయి. ఆలయానికి నిత్యం వెళ్లి, ప్రదక్షిణలు చేసేవారికి ఈ శక్తి తరంగాలు సోకి, అవి ఆ వ్యక్తుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. నిత్యం దేవాలయాలకు వెళ్లేవారిలో చక్కటి చైతన్యం కనిపించటం వెనుక ఉన్న రహస్యం ఇదే. ఈ శక్తి తరంగాలకు తోడు ఆలయంలోని అర్చకులు పలికే మంత్రాల నుంచి వచ్చే శబ్ద తరంగాలు కూడా భక్తుల్లో సకారాత్మకమైన శక్తిని పెంపొందిస్తాయి. మొత్తంగా ఆలయానికి చేరుకోగానే భక్తులకు కలిగే అనిర్వచనీయమైన అనుభూతికి ఇవన్నీ కారణాలుగా నిలుస్తాయి. ఈ కారణం వల్లనే నిత్యం ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతారు.
ఆలయాన్ని కేవలం నిర్మాణంగా చూడకూడదు. భగవంతుడి నిలయంగా గుర్తించాలి. ఏ దేవతకు సంబంధించిన ఆలయమైనా సరే అందులో ఆ ఆలయానికి అధిష్ఠాన దేవత అయిన ఆలయపురుషుడు అక్కడ ఎల్లప్పుడూ కొలువుదీరి ఉంటాడు. ఈ విషయాన్ని ప్రతి భక్తుడూ గుర్తించాలి. గుర్తుంచుకోవాలి. ఆలయంలో మొత్తం ఆరు భాగాలు ఉంటాయని ఆగమశాస్ర్తాలు చెబుతున్నాయి. అధిష్ఠానం, స్తంభవర్గం, ప్రస్తరం, కంఠం, శిఖరం, స్తూపి అనేవి ఈ భాగాలు. ఈ ఆరు భాగాలు ఆలయ పురుషుడి శరీరంలోని ఒక్కో భాగంగా ప్రకాశిస్తాయి.
అధిష్ఠానం: ఇది భూమి నుంచి పైకి లేచే మొదటి భాగం. ఆలయానికి ఇదే ఆధారం. రాజులకు సింహాసనం ఎలాగో ఆలయానికి అధిష్ఠానం అలాంటిది. ఆలయ పురుషుడి పాదాల నుంచి మోకాలు వరకు ఉండే భాగం.
స్తంభవర్గం: ఇది గర్భగుడి. ఇందులో అనేక రకాలైన తోరణాలు, దేవకోష్ఠం (దేవుని గూడు) మొదలైనవి ఉంటాయి. ఇది ఆలయ పురుషుడి చేతులవంటిది.
ప్రస్తరం: ఇది ఆలయానికి పైకప్పు. బయటనుంచి చూసే వారికి వంపుతో ఉండే ఆలయం చూరు మాత్రమే కనిపిస్తుంది. ఈ చూరు ఆలయ పురుషుడి బాహువులు. పరిశీలనగా చూస్తే మన బాహుమూలం ఎలాంటి వంపును కలిగిఉంటుందో ఈ భాగం కూడా అలాగే ఉంటుంది.
కంఠం: శిఖర భాగం మొదలయ్యే స్థలం ఇది. ఆలయ పురుషుడి కంఠంతో ఇది సమానం. మన శరీరంలో కంఠం ఎలాగైతే లోపలికి అమరి ఉంటుందో ఈ భాగం కూడా అలాగే ఉంటుంది. ఆగమశాస్త్ర విధానంలో ఇక్కడ కొందరు దేవతలను ప్రతిష్ఠిస్తారు.
శిఖరం: సాధారణ పరిభాషలో దీన్ని విమానగోపురం అంటారు. ఇది వికసించని పద్మాకారంలో ఉంటుంది. ఈ భాగం ఆలయ పురుషుడికి ముఖం.
స్తూపి: ఆలయానికి చిట్టచివరి భాగం ఇది. విశ్వంలో ఉండే అనంతమైన శక్తి ఈ మార్గం ద్వారానే ఆలయంలోకి చేరుతుంది. ఇది ముకుళిత పద్మం (మొగ్గగా ఉన్న పద్మం) రూపులో ఉంటుంది. ఆలయ పురుషుడికి ఇది శిఖ (జుట్టుముడి) వంటిది.
ఈ విధంగా ఆలయంలోని అన్ని భాగాల్లోనూ ఆలయ పురుషుడు దర్శనమిస్తాడు. ఆలయానికి వెళ్లినప్పుడు ఆ నిర్మాణాన్ని కేవలం ఓ కట్టడంగా కాకుండా, మనముందు సశరీరంగా సాక్షాత్కరించిన దేవతామూర్తిగా భావించాలి. అప్పుడే భగవంతుడిని మనం నిజంగా చూసినట్లవుతుంది.
– డాక్టర్ కప్పగంతు రామకృష్ణ