మహోత్కృష్టమైన మానవ జన్మ సార్థకం కావాలంటే కొన్ని విధులు పాటించాలి. పెద్దలు చూపిన బాటలో నడుస్తూ, ధర్మ పరిరక్షణకు పాటుపడాలి. కుటుంబ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఐదు రుణాలు తీర్చుకోవాలని శాస్త్రం చెబుతున్నది అవేంటంటే..
దేవ రుణం: ఇంద్ర, వరుణ, వాయు దేవతల సాయంతో సూర్యుడు భూమిపై వర్షాన్ని కురిపించటం వల్లే పంటలు సమృద్ధిగా పండి, పంటలు రైతు చేతికి అందుతాయి. తద్వారా మనిషి జీవన పోషణ జరుగుతుంది. అందుకే సూర్యుడికి అర్ఘ్యమివ్వడం ద్వారా దేవతల రుణం తీరుతుందని శాస్త్ర వచనం.
పితౄణం: పితృ తర్పణాలు, పిండోదక దానాలు, శ్రాద్ధకర్మలు మొదలైనవి ఆచరించడం ద్వారా, మరణించిన పితృ దేవతల రుణం కొంతైనా తీరుతుంది. అన్నిటినీ మించి పితృదేవతల పేరిట బీదసాదలకు చేసే దానం విశేష ఫలాన్ని ఇస్తుంది.
భూత రుణం: నీరు, భూమి, గాలి, ఆకాశం, అగ్ని వంటి పంచభూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతున్నాయి. అందుకే కృతజ్ఞతతో పంచభూతాలను కూడా పూజిస్తాం. పండిన పొలాల్లో పొంగలి మెతుకులు, పసుపు కుంకుమలు చల్లి ఎర్ర గుమ్మడి కాయను పగులకొట్టి దిష్టి తీసే ఆచారం కూడా కొన్నిచోట్ల ఉంది. పశుపక్ష్యాదులు, జంతువులకు గ్రాసం, ఆహారం అందివ్వడం కూడా భూత రుణంలో భాగమే!
మనుష్య రుణం: ఇతరుల సహాయ సహకారాలు లేనిదే సమాజంలో జీవనం సాగించలేం. అందుకు కృతజ్ఞతగా పరులకు సాయం చేసి వారి రుణం తీర్చుకోవాలి. నిరుపేదలకు, గురువులకు, సాటి మనుషులకు యథాశక్తి అన్నదానం, వస్త్రదానం, వారి అవసరాలను గుర్తించి సాయం చేయడం వల్ల మనుష్య రుణం తీర్చుకోవచ్చు.
రుషి రుణం: సత్ గ్రంథ పఠనం, ఆధ్యాత్మిక సాధన, సనాతన ధర్మ పరిరక్షణ, వేదవిద్యకు సహకారం అందించడం ద్వారా రుషి రుణం తీరుతుంది.
– శ్రీ భారతి