ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః
(కఠోపనిషత్తు 2-21)
‘ఆత్మ ఒక చోట ఉన్నా.. దూరంగా పయనించగలదు. పడుకొని ఉన్నా.. అన్ని వైపులకూ వెళ్లగలదు..’అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. శరీరానికి తప్ప ఆత్మకు దూరభారాలు లేవు. తరించిపోయిన పరమాత్మ స్వరూపులైన మహానుభావులకు అసలే లేవు. ప్రేమావతారులైన శ్రీ కుసుమ హరనాథుని జీవితంలో ఇలాంటి సంఘటనలెన్నో కనిపిస్తాయి. ఆయన ఎక్కడెక్కడి భక్తులనో వెళ్లి పలకరించేవాడనీ, రక్షించేవాడనీలోక ప్రసిద్ధి. హరనాథ భక్తులైన భావనారుషి అనుభవం పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతుంది.
ప్రభు హరనాథుని భక్తకోటిలో భావనారుషి గురించి తెలియనివారు ఉండరు. విజయనగరం జిల్లా, శృంగవరపు కోట సమీపంలోని తెన్నుబొడ్డవరలో ఉండేవారాయన. ఒక వేసవిలో దువ్వాడ శ్రీ హరనాథ ఆశ్రమంలో శ్రీమతి వీరమాచనేని అనసూయమ్మగారు ఏడు రోజులు శ్రీమద్భాగవత కాలక్షేపం జరిపారు. సప్తాహం అనంతరం భావనారుషి బస్సులో అరకులోయ మార్గంలో బయల్దేరారు. దారిలో ఒక లారీ అతి వేగంగా ఎదురుగా వచ్చింది. లోయ పక్కగా వెళ్తున్న వీరి బస్సు.. పట్టుదప్పి ఒక తాటిచెట్టు లోతు లోయలో పడిపోయింది. చాలామంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. భావనారుషి భయంతో ‘కుసుమహరా’ అని గట్టిగా గురునామం స్మరించారు. ఆశ్చర్యం. వెనుకనుంచి రెండు చేతులతో నడుమును గట్టిగా పట్టుకొని, లోతైన ఆ లోయ నేలపై తనను కూర్చుండబెట్టినట్టు అనిపించింది. భావనారుషి కండ్లు తెరిచి చూస్తే నేలపై ఉన్నారు.
శరీరాన్ని తడిమి చూసుకుంటే ఒక్క గాయమూ లేదు. చుట్టూ చూస్తే.. ఎవరూ కనిపించ లేదు. ప్రేమైక హరనాథుడే తనను రక్షించాడని భావనారుషి బలంగా విశ్వసించారు. మర్నాడు దినపత్రికల్లో దెబ్బతిన్న బస్సు ఫొటో వేశారు. భావనారుషికి జరిగిన అనుభవాన్ని దువ్వాడ శ్రీ కుసుమ హరనాథ పత్రికలో శ్రీ రాధే గోవిందపంతు వివరంగా రాశారు కూడా! ఆ వ్యాసంలో చిట్ట చివరన ఒక విచిత్రమైన చలోక్తి వాక్యమున్నది. ‘శ్రీ హరనాథునికి ఒక బలహీనత ఉన్నది. ఏమిటది? శ్రీ హరనాథుడు భక్త జనుల కష్టాలను విచారించకుండా ఉండలేరు. అది ఆయన బలహీనత’ అని భావనారుషి అనుభవానికి ముగింపు పలికారు గోవిందపంతు.