‘పొలాలనన్ని, హలాల దున్ని..’ అనే మాటలు ఎంత ప్రఖ్యాతమో, ‘జుట్టంతా ఉంగరాలు.. మెరిసేటి కండరాలు…’ అనేవి కూడా మరెంతో పరిచితం, ఆకర్షణీయం. పెద్దగా వాడని, ఇలా స్ఫురించని పదాలు వాడటం వల్ల రెండోది మరింత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఈ కవులకు శబ్దం మీద ఎంత అధికారం ఉన్నదని పాఠకులకు ముచ్చట కలిగిస్తుంది, ఇలాంటి పదాలు వీరికెలా దొరుకుతాయనే ఆలోచన కూడా కలుగుతుంది. ప్రాసలు మరీ ముఖ్యంగా అంత్యప్రాసలు చదవడానికి, వినడానికి పురి గొల్పుతాయి. దానికి కారణం అందులో నిబిడీకృతమైన సంగీతం.
తొట్ట తొలి తెలుగు అకారాది నిఘంటువు మామిడి వెంకయ్య రాసిన ‘ఆంధ్ర దీపిక’. అప్పటిదాకా నిఘంటువులు ఛందోబద్ధమైన శ్లోకాలే. దాంతో కంఠస్థం చేయక తప్పేది కాదు. ఒక పదానికి అర్థం కావాలన్నా మొత్తం శ్లోకం గుర్తు చేసుకొని తద్వారా బోధపరుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారి ఆల్ఫాబెటికల్గా డిక్షనరీ తేవడం అనే భావన చాలా రాడికల్. గర్వించదగిన విషయమేమంటే అకారాది నిఘంటువు అనేది భారతీయ భాషల్లోనే ఈ తెలుగు ‘ఆంధ్ర దీపిక’ ప్రయత్నమే ప్రథమం కావడం. మామిడి వెంకయ్యను అనుసరించే తర్వాత చిన్నయసూరి, సీపీ బ్రౌన్, బహుజనపల్లి సీతారామాచార్యులు మొదలైనవారు తమదైన పద్ధతుల్లో తెలుగులో నిఘంటువులు రూపొందించారు.
మళ్లీ అందరం ఆనందపడే సందర్భం తెలుగులో ‘రైమింగ్ డిక్షనరీ’ మొట్టమొదటిసారి రావడం. దాన్ని ఇంకోరకంగా చెప్పాలంటే ‘అంత్యానుప్రాస నిఘంటువు’. ఇలాంటి నిఘంటువులు ఇంగ్లీషులోనే కాదు, హిందీలో, తమిళంలో ఇదివరకే వచ్చి ఉన్నాయి. ఇరుగప దండనాథుడు 14వ శతాబ్దంలో ‘నానార్థ రత్నమాల’ను 1273 శ్లోకాలతో రచించారు. సంస్కృతానికి సంబంధించి ఇది తొలి అంత్యానుప్రాస నిఘంటువుగా చెప్పవచ్చు. అయితే తెలుగులో 2024 ఆగస్టులో డాక్టర్ అరిపిరాల నారాయణరావు మొదటి తెలుగు రైమింగ్ డిక్షనరీని ఏడు వందల పైచిలుకు పుటలతో వెలువరించారు.
మిగతా నిఘంటువులకు, ఈ అంత్యనుప్రాస నిఘంటువుకు స్థూలమైన తేడా ఏమంటే మనకు కావాల్సిన పదాన్ని వెతికే విధానం. మామూలు నిఘంటువులలో మొదటి అక్షరంపై దృష్టి పెట్టి అన్వేషిస్తాం. అయితే అంత్యానుప్రాస నిఘంటువులో చివరి అక్షరం పైనను, దానికి ముందున్న అచ్చు అకారాది క్రమంలో ఉంటుంది.
ఉదాహరణకు 381 పేజీలో ఒకచోట పరిణద్ధము (కట్టబడినది), పరిణయము (పెండ్లి), పరిణామము (మారు రూపు), పరిణాయము (సారెల యొక్క), పరిణాహము (వెడల్పు, వైశాల్యం) అనే పదాలు వరుసగా కనబడుతాయి. ఆ పదాల అర్థాలను సౌకర్యార్థం బ్రాకెట్లో చూపాను. మరోచోట అల్క (అలుక), అల్కా (తేలికైన, నీచమైన), హల్కా (అల్పమైన, నీచమైన), కల్కి (కలికి రూపాంతరం, అవతార విశేషం) అనే పదాలు వరుసగా కనబడుతాయి. ఇంకోచోట ఉవ్వు, జువ్వు, తువ్వు, దువ్వు, నువ్వు, పువ్వు, ప్రువ్వు, రువ్వు … అనే పదాలు వరుసగా కనబడుతాయి. అర్థాలతో ఇలాంటి పదాలు ఈ అంత్యానుప్రాస నిఘంటువు లో 50,000 దాకా ఉన్నాయి. 1937 నాటి ‘శబ్ద రత్నాకరం’ ఆధారంగా డాక్టర్ అరిపిరాల నారాయణరావు 2018 నుంచి శ్రమించి దీన్ని తనే వెలువరించారు. ఈ కృషి కొనసాగిస్తే మరో 50 వే ల పదాల దాకా సేకరించవచ్చ ని కూడా వీరే అంటున్నారు. ప్రస్తుతం 2వ ఎడిషన్ అందుబాటులో ఉంది, హార్డ్ బౌండ్ 718 పుటలు, రూ.600.