e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ఎడిట్‌ పేజీ అండగా ‘సుందరకాండ’

అండగా ‘సుందరకాండ’

అండగా ‘సుందరకాండ’

‘ఎన్ని కష్ట నష్టాలెదురైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మైస్థెర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడటం (ప్రాణత్యాగం) ఏ మాత్రం మంచిది కాదని’ రామాయణం ప్రబోధిస్తున్నది. లోకపావని సీతమ్మ వారికి, ప్రపంచానికి ధైర్యం చెప్పి కాపాడగల చిరంజీవి ఆంజనేయస్వామికీ అంతటి సంక్లిష్ట పరిస్థితులే ఎదురయ్యాయి. అనారోగ్యం, ఆర్థిక సంక్షోభాలు, అవమానాలు, కుటుంబ సమస్యలు వంటి అష్టకష్టాలు ఎన్ని మనల్ని చుట్టుముట్టినా ఓపికగా, లోతుగా విశ్లేషించుకోవాలి. ప్రాణత్యాగాలతో తలెత్తే దుష్పరిణామాలను, అపకీర్తిని అంచనా వేసుకోవాలి. ఈ రకంగా ‘మనో నిబ్బరంతో కష్టాలను ఎదుర్కొని గెలువాలని’ సుందరాకాండ ధైర్యాన్ని నూరిపోస్తుంది. కరోనా వంటి ఈ సంక్లిష్టకాలంలో ‘సుందరకాండ’ పారాయణం ఎంతో మంచిదని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.
సీతమ్మ, హనుమంతుని అనుభవాలు.., వారి సందేశాలు మనకు ఎక్కడ లేని ధైర్యాన్ని, మనసుకు శాంతిని ఇస్తాయి. ‘రాక్షస స్త్రీల ఆధీనంలో నిప్పుల మధ్య బతుకుతున్న నేను ఎలాగూ భర్తను చేరలేను. అంతులేని శోకాగ్నిలో జీవితాన్ని చాలించడమే యుక్తం’ (వాల్మీకి రామాయణం, సుందరకాండ: 25వ సర్గ,19వ శ్లోకం). ‘ప్రతిరోజు రాక్షసులు అనేక విధాలుగా మాటలతోనే నన్ను హింసిస్తూ, బెదిరిస్తున్నారు. నికృష్టం, దుఃఖమయమైన జీవితం గడుపుతున్నాను’ అని సీతమ్మ ఒక దశలో ఆవేదన చెందుతుంది. కానీ, కొంతసేపటికి లోతుగా పలుకోణాల్లో ఆలోచిస్తుంది. ‘తాను శ్రీరామచంద్రమూర్తి భార్యను. ప్రాణం త్యజించే అధికారం తనకెక్కడిది? పాపపుణ్య విచక్షణ చేయగల వివేకం తనకున్నది. ప్రాణత్యాగం చేయడం ద్వారా శ్రీరామచంద్రమూర్తికి అప్రతిష్ట, అపకీర్తి తేకూడదు. వేలాది రాక్షసులను అవలీలగా వధించిన క్షాత్రం గలవాడు, శూరుడు, వీరుడు శ్రీరామమూర్తి. ఆయనపై సంపూర్ణ విశ్వాసం గల తాను ఆత్మహత్య చేసుకుంటే రాఘవుని అవమానపరిచినట్లే’ అని భావిస్తుంది. తనను తాను ఓదార్చుకుంటుంది. ‘దాశరథి తప్పకుండా రావణుడిని ఓడించి తనను తీసుకెళ్తాడని’ పూర్తిగా నమ్ముతుంది. విభీషణుని బిడ్డ త్రిజట, తన స్వప్న వృత్తాంతంలోనూ ‘రావణాసురుడు చావటం, రాముడు గెలవటం తథ్యం’ అని చెప్పటంతో మైథిలి మానసిక శాంతిని పొందుతుంది.
లంకలో సీతమ్మ జాడను కనుగొనలేక, ఒక బలహీన సందర్భంలో ఆంజనేయుడికి కూడా ‘ప్రాణత్యాగం చేసుకోవాలన్న’ ఆలోచన వస్తుంది. ధీమంతుడు, వివేచనాపరుడు కావటం వల్ల క్షణాల్లోనే తేరుకుంటాడు. తన ఆలోచనను మార్చుకుంటాడు. లంకలో ప్రవేశించినప్పటి నుంచి జానకి కోసం ‘చెట్టు, పుట్ట’ ఏదీ వదలక అంతటా వెతుకుతాడు. సీతమ్మను గోప్యంగా ‘పంజరం వంటిచోట దాచారేమోనని’ అనుమానిస్తాడు. ఎంత వెతికినా లాభం లేకపోయింది. ‘సీతమ్మ జాడ తెలియకుండా కిష్కింధకు వెళ్లి దొరకలేదని చెప్పటం యుక్తం కాదు. ఆ వార్త వింటే రాముడు జీవించడు. అన్న మృతితో లక్ష్మణుడు, భరత- శత్రుఘ్నలు, కౌసల్యాదేవిసహా ముగ్గురు మాతలు ప్రాణాలు విడుస్తారు. స్నేహితుడైన తన రాజు సుగ్రీవుడు అసువులు బాస్తాడు. ఇందరి చావుకంటే తానే సీతమ్మ జాడ ఎలాగైనా తెలుసుకోవడం ఉత్తమం. లేకపోతే యోగాగ్నిలో ప్రాణత్యాగమైనా చేసుకుంటాను. కాకులు, పులులకు బలవడమో లేదా జలసమాధి అయినా అవుతాను’- ఇలా అనేక విధాలుగా వీరాంజనేయుడు యోచిస్తాడు. అంతలోనే తన బలహీనమైన ఆలోచనలను నియంత్రించుకొని తనను తాను నిందించుకుంటాడు. దేహత్యాగం కంటే తాపసిగానైనా బతికి సాధించాలని నిర్ణయిస్తాడు. ‘ఎటువంటి పరిస్థితులు, కష్టనష్టాలకు భయపడి ఎదురైనా ప్రాణత్యాగం చేయకూడదు’ అనే సందేశాన్నిచ్చి, ‘చిరంజీవి’గా నిలుస్తాడు. అపురూపమైనది మానవజన్మ. ఎన్నో పుణ్యాల ఫలమైతేనే దక్కుతుంది. కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా? విలువైన ప్రాణాలు నిలుపుకోవటం బుద్ధిమంతుని లక్షణం. భీతి, పిరికితనం, భయం, అనారోగ్యం వంటి సమస్యలకు మానసికంగా క్రుంగిపోకూడదు. ‘రామాయణం’లో సీత, కేసరీసుతుని పాత్రలతో వాల్మీకి ఇదే సందేశాన్ని లోకానికి అందించాడు.

అండగా ‘సుందరకాండ’మాడుగుల నారాయణమూర్తి
94411 39106

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అండగా ‘సుందరకాండ’

ట్రెండింగ్‌

Advertisement