బాదరాయణి- శుకముని అవనీ (భూ) జాని విష్ణురాతునితో- రాజా! భ్రాంత- ప్రేమోన్మత్తలైన గోపకాంతలు పొంకం- సొగసుగా ఇరువంకల పరికిస్తూ ఆ అకలంకుని- హరిని గురించి ఇంకా ఇలా పడిపడి అడిగారు.. ‘ఓ మల్లె తీవలారా! నల్లనివాడు, కమలాల వంటి కన్నులు కలవాడు, దాసులపై అపార కృపారసం కురిపించి మురిపించువాడు. సిగపై తురగలించు- ప్రకాశించు మురిపాల నెమలి పురి కలవాడు, మందహాసం చెన్నొందు అందమైన మోము కల ఒక ‘చిన్న మగవాడు’- నగధీరుడు మా మగువల మానధనం కొల్లగొట్టాడు. సదయ హృదయలారా! మీ పొదల మాటున లేడు గదా! ఉంటే చెప్పరా?
ఉ॥ ‘నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై
జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో
మల్లియలార! మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే?’
నల్లనివాడు.. ‘మేఘశ్యామం’- నీలాంబుద శ్యామల కోమలాంగుడు. మేఘం క్షారజలం- ఉప్పునీరు గ్రహించి క్షీరం లాంటి తియ్యని మంచినీరు పంచి పెడుతుంది. భగవంతుడు బాలకృష్ణుడు పూతన నుంచి విషం స్వీకరించి ప్రతిగా ఆ బాలఘాతినికి పీయూషం- ముక్తిరూప అమృతం అనుగ్రహించాడు. ‘అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున’- ‘అమృతమూ నేనే, అంతమూ నేనే. సత్తు అసత్తూ కూడా నేనే’ అని భగవద్వాణి! నీల వర్ణం అనంతత్తానికి ప్రతీకం. అంతులేని ఆకాశం నీలం! అపారమైన అంబుధి- సాగరం నీలం! పద్మనయనంబులవాడు.. పద్మం సృష్టికి, అసంగత్వానికి సంకేతం. తుదిలేని సృష్టులే ఆదిదేవుని- అనాది నిధనుని కదిలే కడగంటి చూపులు! పరమాత్మ విలాసంగా తిప్పే చూపుల్లోంచి అనేక కోటి బ్రహ్మాండాలు రూపుదిద్దుకుంటాయి. సృష్టి స్థితి లయాలు లీలలు. కాన, ఆయన అకర్త, అసంగుడు, నిర్లిప్తుడు! ‘పద్మపత్ర మివాంభసా’- ‘అనాసక్తితో కర్మలాచరించువానికి తామరాకుపై నీటి బిందువుల వలె పాపాలు అంటవు’ అని గీత. నెమలి పింఛం అనాది బ్రహ్మచర్యానికి చిహ్నం. మానవులకు పిచ్చెత్తించే మాయా విశేషాలే మాధవుని నవ్వులు. ఓ లవంగ వృక్షములారా! లుంగ- మాదీఫల మహీజములారా! నారంగ- నారింజ తరువులారా! చూచినంత మాత్రాన మదికి ఇంపు గొలిపి మదనుని కూడా కరగించేవాడూ, శ్రీవత్సాంకుడు- ఉరమున సిరి గలవాడూ, మధురమైన వేణు రవముల వాడూ అయిన కరి వరదుడు హరి మమ్ములను అసమశరుని- మన్మథుని కుసుమ బాణాలకు గురిచేసి మీ దరికి వచ్చి దాగలేదు కదా! వస్తే మాకు దయతో చూపండమ్మా! చెలువారే కలువపూల వలపుల నెత్తావులు వెలవరిస్తూ చవులూరించే పైరెండు మహత్తర వృత్తాలు పోతన కవి చిత్త సంజాతాలు.
సీ॥ ‘మానినీ మన్మథు మాధవు గానరే
సలలితోదార వత్సకములార!
సలలితోదార వత్సక వైరి గానరే
సుందరోన్నత లతార్జునములార!
సుందరోన్నత లతార్జునభంజు గానరే
ఘనతర లసదశోకంబులార!
ఘనతర లసదశోకస్ఫూర్తి గానరే
నవ్యరుచిర కాంచనంబులార!
ఆ॥ నవ్యరుచిర కాంచన కిరీటు గానరే
గహన పదవి కురవకంబులార!
గహన పదవి కురవక నివాసి గానరే
గణికలార! చారు గణికలార!
కమనీయాలూ, కరుణా భరితాలూ అయిన కుటజ- కొండమల్లె కుజము (వృక్షము)లారా! మగువల పాలిటి మన్మథుడైన మాధవుని కన్నారా? కమ్మని కొమ్మలతో కొమరారు (అందగించు) మద్ది మ్రానులారా! ముద్దులు మూటగట్టు హద్దులెరుగని అందగాడు, వదాన్యుడు, వత్సాసుర సంహారి అయిన శౌరిని కనుగొన్నారా? కమనీయమైన కంకేళి భూజ- వృక్షములారా! కడు రమణీయమైన నిడుపైన కొమ్ములు గల యమళార్జునాలను- మద్దిచెట్లను భంజించిన కంజనేత్రుని, కుంజ విహారిని సందర్శించారా? ఇంపుసొంపుల కాంచన- సంపెంగలారా! వగ (దుఃఖం) లేక వెలుగు అగ (గోవర్ధన)ధరుని- పన్నగశాయిని వీక్షించారా? గణిక- ఓ అందమైన అడవి మొల్లలారా! చారు గణిక- సుందరమైన నెల్లి చెట్టులారా! బృందావనంలో కనువిందు చేసే నంద కిశోరుని- గోవిందుని గమనించారా?
ఉ॥ ‘అంగజునైన జూడ హృదయంగముడై కరగించు వాడు శ్రీ
రంగదురంబు వాడు, మధురంబగు వేణురవంబు వాడు మ
మ్మంగజు పువ్వు చూపులకు నగ్గము సేసి లవంగ లుంగ నా
రంగములార! మీ కడకు రాడు గదా! కృప నున్న జూపరే!’
శుకుడు- రాజా! ఇలా మధుర గుణ, స్వభావ సింధువైన లోక బంధువు మాధవుని వైభవాన్ని భావ బంధురంగా కీర్తిస్తూ బృందావనంలోని వివిధ వనాలలో- అరణ్యంలో వెదికారు. మూలాన్ని అతిక్రమించి ‘సహజ పండితుడు’గా వినుతి వహించిన పోతన వెలయించిన ఆపాత మధురాలైన ఇట్టి అనేక అమూలక పద్యాలు నిసర్గమైన ఆయన సర్వంకష కవితా విద్యకు నికషోపలాలు – గీటురాళ్లు.
గోప వనితలు ఇంకా ఇలాగని ప్రశ్నించారు.. ఓ తులసీ! నీవు హరికి ప్రియురాలవు గదా! ఆ కరివేలుపు, నరహరి నీ దరికి చేరితే మాకెరిగించి పుణ్యం కట్టుకో. ఓ పొగడలారా! పొగడదగిన వాని పొడ (రూపు) గాంచారా? ఓ మొల్లలారా! వెల్లి విరిసిన కీర్తిగల నల్లనయ్య ఏడ? ఓ కింశుకము- మోదుగ వృక్షములారా! శుకునిచే కీర్తింపబడిన కృష్ణమూర్తి ఎక్కడున్నాడో వక్కాణించండి. ఓ హరిణీ!- ఆడులేడీ! ఈడెరుంగని- సరిజోడు లేని వన్నెకాడిని- వెన్నుని నీవు కన్నట్లున్నది. నీకు పున్నెముంటుంది. వాని తెన్ను- జాడ తెలుపు.
కం॥ ‘కిటియై కౌగిట జేర్చెను
వటుడై వర్ధిల్లి కొలిచె వడి గృష్ణుండై
యిట పద చిహ్నములిడె గ్రిం
దటి బామున నేమి నోచితమ్మ ధరిత్రీ!’
ఓ ధరా (భూ) దేవీ! కిటియై- వరాహమై నిన్ను కౌగిట జేర్చుకొన్నాడు. వటుడై- విశ్వరూపుడై పటుతరంగా- సమర్థతతో నిన్ను కొలిచాడు. ఇప్పుడు కృష్ణుడై కడుప్రేమతో నీ ఎడదపై అడుగులుంచాడు. పూర్వజన్మల్లో నీవెట్టి నోములు నోచావో?
శుకుడు- రాజా! ఇలా అడుగుచూ వ్రేతలు మన్మథ వికారంతో వేదురు- వెర్రి గొన్న మనసులు కలవారై మాధవ తాదాత్మ్యం పొంది ఆయన లీలలు అనుకరింపసాగారు. ఇదే లీలా శ్రవణ ప్రయోజనం! కేవల వాచా-మాటలకు పరిమితమైన అస్తికత వలన ఆస్తికులం కాలేము. భగవత్ సంయోగ వియోగాలలో సుఖదుఃఖానుభవమే ఈశ్వర అస్తిత్వ విశ్వాస లక్షణం. ఇట్లు తనువులు మరచి గోప తరుణులు బృందావనంలోని తరువులనూ, తీవలను దామోదరుని జాడ అడుగుతూ, చొరరాని అడవిదారుల్లో కమలం, ధ్వజం, హలం, కులిశం- వజ్రం, కలశం, అంకుశం ఇత్యాది శుభలక్షణాలచే మనోహరాలైన హరి చరణాలను గుర్తించి గొప్పగా చెప్పుకొంటూ తమలో ఒప్పుగా కనువిప్పుగా ఇలా అనుకున్నారు..
సీ॥ ఈ చరణంబులే యిందు నిభానన
సనకాది ముని యోగ సరణి నొప్పు
నీ పాద తలములే యెలనాగ
శ్రుతివధూ సీమంత వీధుల జెన్ను మిగులు
నీ పదాబ్జంబులే యిభకులోత్తమయాన
పాలేటిరాచూలిపట్టు గొమ్మ
లీ సుందరాంఘ్రులే యిందీవరేక్షణ
ముక్తికాంతా మనోమోహనంబు
ఆ॥ ‘లీ యడుగుల రజమె యింతి బ్రహ్మేశాది!
దివిజ వరులు మౌళిదిశల దాల్తు
రనుచు గొంద రబల లబ్జాక్షు డేగిన
క్రమము గనియు నతని గానరైరి’
‘ఓ చంద్రముఖీ! ఈ చరణాలే సనక సనందనాది మునీశ్వరుల ధ్యానమార్గంలో విరాజిల్లేవి. ఓ పడతీ! ఈ పాదాలే వేదాలనే వెలదుల- స్త్రీల పాపటపై వెలుగులీనేవి. ఓ గజరాజ గమనా! ఈ పదరాజీవాలే క్షీరసాగర తనయ అయిన లక్ష్మీదేవికి ఆధారాలు. ఓ ఇందీవరేక్షణా!- కలువకంటీ! కెందామరల వంటి ఈ అందమైన అడుగులే మోక్షమనే మగువ మనసును మోహింపజేసేవి. ఓ పురంధ్రీ! ఈ పాదధూళియే పద్మజ (బ్రహ్మ) రుద్ర ఇద్రాది సురవరులు శిరసున ధరించేది’- అంటూ కొందరు మానవతులు వనమాలి వెళ్లిన తెరువు కనుగొని కూడా అతనిని కానలేకపోయారు. ఆ సమయాన, పతులు సతులకు లొంగి- లోబడిపోయి పొందే దైన్యాన్ని, ప్రమదలు చూపే దౌర్జన్యాన్ని లోకానికి ఎరుక పరచడానికి శ్రీకాంతుడు ఒక కాంతామణితో విహరించాడు. లేనిచో ఆత్మారాముడు, పూర్ణకాముడు, అంతాతానే అయిన శాంతుడు, దాంతుడు శ్రీకృష్ణస్వామి ఒక కాంతతో సలిపిన వింతగొలిపే ఈ ఏకాంత క్రీడకి ఇక అర్థమేంటి, పై పరమార్థం కాక! అంతలోనే ఆ రమణి, తక్కిన తరుణు- స్త్రీలందరినీ వదలి వల్లభుడు తననే వలచి తన వద్దనే ఉన్నాడని విర్రవీగింది. ఆ గర్వంతోనే ఆ మత్తకాశిని- మదించిన స్త్రీ ‘నేనిక నడచి రాలేను. నన్ను నీ మూపు- భుజంపై మోసుకొని పో’ అని మొరాయించింది. అలా అన్నంతనే మురారి- కృష్ణుడు అంతర్థానం చెందాడు. అప్పుడా తరుణి వేగుతూ- పరితపిస్తూ ‘ఓ హరీ! ప్రాణేశ్వరా! రమణా! ఎక్కడికేగినావు? నీ చరణదాసినవుతా, నిలు’ అంటూ విలపించింది. తరువాత కొందరు యువతులు ఆ సుదతిని చూసి ‘మగని మన్నన చే మదించి ఈ మృగనయని ఇట్టి దుర్గతికి- అగచాట్లకు గురి అయింది’ అని ఆశ్చర్యం పొందారు. ఇంతకీ ఎవరా బాధితురాలు? ఇంకెవరు? రాసేశ్వరి రాధాదేవే!