శ్రావణ శుక్రవారం సందడి. ఇంటింటా కోలాహలం. ఓ ముచ్చటైన ముత్తయిదువ అక్కడికొచ్చింది… వ్రతం పనుల్లో తలమునకలైన ఆ ఇంటి ఇల్లాలితో మాటకలిపింది..‘ఏమ్మా వరలక్ష్మి బాగున్నావా?’ అంది పెద్దావిడ. ‘నా పేరు అది కాదమ్మా’ అన్నది ఆ ఇల్లాలు..
‘అష్టలక్ష్ములను ఆవాహన చేసుకున్న అసలు లక్ష్మి అచ్చంగా నువ్వే. నువ్వేమిటి…
మన స్త్రీ జాతి అంతా లచ్చుమమ్మలే!
ఆ మాటకొస్తే నేనూ వరలక్ష్మినే..
ఏ ఇంట నువ్వు నవ్వుతుంటావో…
అక్కడ ఉండేది నేనే!
నీ నవ్వుల్లోనే కాదు.. నీలోనూ నేనున్నా!!
‘అదెలా..?’ అంటావేమో.. అయితే విను..
నేను శ్రావణ వరలక్ష్మిని. ఏడాదికోసారి ఇలా వచ్చి అలా వెళ్లిపోతాను. కానీ, అవనిలోని ఆడకూతుళ్లంతా నా ప్రతిరూపాలే! ఆ మాటకొస్తే నా అసలు రూపాలే!!
యుగాల నుంచి అతివలను చూస్తున్నా కదా! స్త్రీ సాధికారతను ఏ నాగరికతా సహించలేదు. అందుకే పేరుమోసిన నాగరికతలన్నీ కథల్లో శిథిలాల్లా మిగిలిపోయాయి.
మీ తరాన్ని చూస్తుంటే మాత్రం ఈ వరలక్ష్మికి ముచ్చటేస్తుంది! ఎంతలా ఎదిగిపోతున్నారో!!
చదువుల్లో మీరే టాపు.
ర్యాంకుల్లో మీదే గ్రాఫు.
కొలువుల్లో రాణిస్తున్నారు.
కోర్టుల్లో వాదిస్తున్నారు.
చట్ట సభల్లోనూ కోటా కొట్టేశారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా..
అమ్మగా మీకు మీరే సాటి.
బిడ్డగా అమ్మకు వరం.. నాన్నకు భాగ్యం.
ఈ తరం లక్ష్ములు సాధించిన విజయాలు ఎన్నని చెప్పమంటావ్!
పారిస్‌లో మన భారత కీర్తి పతాకను రెండుసార్లు రెపరెపలాడించిన మను బాకర్ విజయలక్ష్మి అంశ అనకుండా ఎలా ఉండగలను.
అధ్యక్ష పోరులో టెంపరి ట్రంప్‌ను ఢీ కొడుతున్న కమలా హారిస్ ఎన్నికల్లో గెలిస్తే… అమెరికా ఆదిలక్ష్మి కాకుండా ఉంటుందా!
గగనాంతర రోదసిలోకి దూసుకుపోయిన వ్యోమగామిని సునీతా విలియమ్స్ ధైర్యలక్ష్మికి ప్రతిరూపమే!!
వయనాడ్ విధ్వంసంలో వారధి కట్టి.. ఎందరో బిడ్డల ప్రాణాలను కాపాడిన మేజర్ సీతా అశోక్ షెల్కేను సంతాన లక్ష్మిగా ఆరాధించొచ్చు.
భారత సైన్యానికి చెందిన వైద్యసేవల విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఎంపికైన సాధనా సక్సేనా.. ఆరోగ్యాన్ని అనుగ్రహించే గజలక్ష్మికి ప్రతినిధి!!
సేంద్రియ సాగులో దేశానికి దిక్సూచిగా నిలిచి, మేలు రకం దేశీయ వంగడాలను జాతికి పునరంకితం చేస్తున్న రహీబాయి పోపెరే ధాన్యలక్ష్మికి నిండురూపం.
చదువే ఆడపిల్లకు అలంకారం అని, ఆఫ్గన్ వీధుల్లో, ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో ఎలిగెత్తి చాటిన ధీశాలి మలాలా విద్యాలక్ష్మికి వారసురాలే కదా!
కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఉద్యోగాలు చేస్తూ… పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ.. ఇంటిని నడిపిస్తున్న ఇల్లాలు అచ్చంగా ధనలక్ష్మే!!
ఈ అష్టలక్ష్ములను ఆవాహన చేసుకున్న వరలక్ష్మమ్మలు మీరే! మన ఆడబిడ్డలే!!
అందుకే, ఈ శ్రావణ శుక్రవారం మీకే అభినందన వాయనం ఇస్తున్నా…’
‘ఇస్తినమ్మా వాయనం…’ అంది వరలక్ష్మి
‘పుచ్చుకుంటిమమ్మా… నీ ఆశీర్వాదం’.. అన్నది ఆ ఇంటి వరలక్ష్మి.