ఓ ప్రవచనకారుడు పట్టణంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి ధార్మిక ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడు. ఆ ప్రవచనకారుడి అబ్బాయి సంస్కృతంలో డిగ్రీ చేస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాలన్నిటికీ తండ్రిని తన కారులో తీసుకుని వెళ్లేవాడు. కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండి తండ్రిని ఇంటికి తీసుకుని వచ్చేవాడు. వచ్చిన శ్రోతలు ఆసక్తిగా వినడం గమనించేవాడు. అయితే కార్యక్రమం అయ్యాక ప్రసాదం పంపకం దగ్గర వారు తోసుకోవడం గమనించాడు. ఒకరోజు ఆ అబ్బాయి తండ్రితో చిన్న అనుమానం వ్యక్తం చేశాడు. ‘సహృదయంతో నిర్వాహకులు వేల రూపాయలు ఖర్చుపెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మీరు కూడా ఎండైనా వానైనా వెళ్లి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. అక్కడికి వచ్చే జనం మీరు చెప్పే మంచి మాటలను అనుసరిస్తారా? వారు అనుసరించకపోతే మీ శ్రమ అంతా వృథానే కదా’ అని అడిగాడు.
దానికి తండ్రి నవ్వి రోడ్డు పక్కన ఉన్న స్పీడ్ లిమిట్ బోర్డులను కొడుక్కి చూపుతూ… ‘అధిక వేగం ప్రమాదమని, దారిలో వేగానికి పరిమితి ఉందని ప్రభుత్వం వారు హెచ్చరిక బోర్డులు పెడతారు. పాటించిన వారు సుఖపడతారు. లెక్క చేయకుండా వేగంగా వెళ్లినవారు ఇబ్బందుల పాలవుతారు. ‘మెరుపులాంటిది జీవితం. ఇది శాశ్వతం కాదు. ప్రకృతి ప్రసాదించిన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి’ అని గుర్తుచేసే సూచికలవి. అలాగే మేము చేసే కార్యక్రమాలు కూడా హెచ్చరిక బోర్డుల లాంటివి. హెచ్చరించడం అనేది మేధావుల బాధ్యత. విన్నవారిలో అందరూ కాకపోయినా కొందరైనా మంచి మార్గం వైపు నడుస్తారనేది మన ఉద్దేశం. అంతేకాదు, రైలుపట్టాల మీదనే రైలు నడిచినట్లు జీవితం నడవదు. ఎన్నో కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు ఉంటాయి. జీవితం పట్ల అవగాహన పెంచుకుని స్పృహతో జీవనం సాగిస్తారని ఈ కార్యక్రమ నిర్వాహకుల నమ్మకం. అన్నమాచార్యులు చెప్పిన ‘మాపులే మరణములు… రేపులే … పుట్టువులు’ అన్న విషయం జనం గుర్తు పెట్టుకుంటే చాలు’ అని వివరించాడు. ఆ మాటలు విన్న కొడుకు కారు వేగ పరిమితి తగ్గించి ఇంటికి దారితీశాడు.