e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home చింతన వాయు పుత్రం..మాటే మంత్రం

వాయు పుత్రం..మాటే మంత్రం

ఒక మాట సంధి కుదుర్చుతుంది, ధర్మాన్ని నిలబెడుతుంది, ధైర్యాన్ని నూరి పోస్తుంది, శత్రువులకు హెచ్చరిక అవుతుంది, అయిన వారికి భరోసానిస్తుంది. ఇన్ని మాటలూ ఒక్కడే మాట్లాడితే! ఆ మాటకారి ‘రామాయణం’లోని హనుమంతుడే అవుతాడు. హనుమ నవవ్యాకరణ పండితుడు. సందర్భోచితంగా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి. ఈ పవనసుతుడి వాక్పటిమను చాటే ఘట్టాలు ‘రామాయణం’లో ఎన్నో! ఈ ‘హనుమద్‌ జయంతి’ సందర్భంగా ఆ పురాణ పురుషుడి వాక్చాతుర్యాన్ని తెలుసుకుందాం.

వాయు పుత్రం..మాటే మంత్రం

ఎవరితో ఎలా మాట్లాడాలో హనుమనుంచి తెలుసుకోవచ్చు. రుష్యమూక పర్వత సానువుల్లో ధనుర్బాణాలు ధరించి వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. ‘తనను వధించడానికి వాలి వీరిని పంపి ఉండవచ్చని’ అనుమానించాడు. అతని భయాన్ని వారించి, వారి సంగతి తేల్చుకొని వస్తానంటూ బయల్దేరుతాడు హనుమ. మారురూపంలో వెళ్లిన మారుతి, రామలక్ష్మణుల ఎదుట నిలిచి, ‘మీరెవరు? ఏ పనిమీద వచ్చారు? మీ రూపానికి, ధరించిన ఆయుధాలకు పొంతన కుదరడం లేదు?’ అని అర్థం వచ్చేలా మూడు ప్రశ్నలు వేశాడు. ఆ మాటలు వినగానే శ్రీరాముడు ముచ్చట పడ్డాడు. హనుమంతుడి మాటతీరుకు కట్టుబడిపోయాడు. ‘అపశబ్దం లేకుండా ముఖంలో, శరీరంలో అనవసరమైన కదలికలు చూపకుండా, చెప్పదలచినదాన్ని ఆత్మవిశ్వాసంతో, మధ్యమస్వరంతో, తొట్రుపాటు, సందేహానికి తావు లేకుండా, సంక్షిప్తంగా పలికిన ఇలాంటి సచివుడు ఉన్నందుకు సుగ్రీవుడు ధన్యుడు’ అంటూ పవనసుతుడి ప్రజ్ఞను ప్రశంసించాడు రాముడు.

మాటే ధైర్యం
ధైర్యవచనాలు పలుకడంలోనూ హనుమ దిట్ట. సీతాన్వేషణలో అలసిపోయి, జానకి కానరాక, గత్యంతరం తెలియక ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకుందామని భావిస్తాడు ఆంజనేయుడు. కానీ, తనకు తానే ధైర్యం చెప్పుకొన్నాడు. కాగల కార్యాన్ని దీక్షతో సాధించాడు. మరోవైపు రాక్షసస్త్రీలకు బలికాక తప్పదని భావించిన సీతమ్మ ఆత్మార్పణకు సిద్ధమవుతుండుగా, అమ్మకు ధైర్యం చెప్పే ‘రామగానం’ అందుకున్నాడు. అప్పుడు ఆంజనేయుడు మరేమాట పలికినా మైథిలి వినేదో, లేదో! విన్నాక ఉండేదో, కాదో! బతుకుమీద ఆశలు వదులుకున్న సీతమ్మ వెనక్కి తగ్గాలంటే రామనామమే శరణు అనుకున్నాడు. అదే పలికి సీతమ్మకు కొండంత ధైర్యం చెప్పాడు. అంతేకాదు, రామదండులో తనను మించిన వీరులు కోకొల్లలుగా ఉన్నారని ఆ తల్లికి భరోసానిచ్చాడు. రాముడి చేతిలో రావణుడు అంతం కాక తప్పదని ధైర్యాన్నీ చెప్పాడు.

సమయానికి తగు మాటలాడి..
మాటకారితనం ఉంటే సరిపోదు. సమయానికి తగ్గట్టుగా మాట్లాడాలి. మనసును గాయపరిచేలానే కాక గుండె పగిలేలానూ కొందరి మాటలు ఉంటాయి. లంకలో సీతమ్మను చూసి వస్తున్న హనుమంతుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దక్షిణతీరంలో ఉన్న అంగద, జాంబవంతాది వానరులు వాయుపుత్రుడు కనపడగానే, ‘సీతమ్మ గురించి ఏం చెబుతాడా!’ అని ఆత్రంగా ఎదురుచూస్తూ కనిపించారు. ఆంజనేయుడు మొదట, ‘సీతా..’ అన్నాడు. తర్వాత ‘బతికి ఉందంటాడా! చదిపోయిందంటాడా..’ అని తేల్చుకోలేక వారి గుండెలు పగిలేలా ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన మృదుభాషి, ‘.. చూసితిని సీతను’ రెండు పదాల్లోనే అందరికీ ఆనందనం కలిగించాడు.

ఎక్కడ తగ్గాలి? ఎక్కడ నెగ్గాలి?
ఎవరితో ఎంత మాట్లాడాలో హనుమకు బాగా తెలుసు. లంకలో తను చేసిన కార్యాలను జాంబవంతుడితో ఎంతో గొప్పగా చెప్పిన రామదూత, రాముడి దగ్గర మాత్రం పరిమితంగానే పలికాడు. ‘లంకలోని అశోకవనంలో శింశుపావృక్షం నీడలో, మబ్బుపట్టిన చంద్రబింబంలా, మకిలిపట్టిన అద్దంలా, ఎండిపోయిన అరటిమోదులా ఉన్న సీతమ్మను చూశాను..’ అని సూటిగా విషయం చెప్పాడు. తాత వరుసయ్యే జాంబవంతుడి దగ్గర మనవడిగా తన ప్రతాపాన్ని వర్ణించాడు. సముద్రతీరంలోని వానరమూకతో ‘ఏ రాక్షసుడ్ని ఎలా చంపిందీ’ చెప్పుకొచ్చాడు. అదే రామయ్య దగ్గరికి వచ్చేసరికి తను ఎంతో సాధించినా, వినమ్రుడై ఆ స్వామికి ఊరటనిచ్చే విషయాన్ని మాత్రమే ప్రస్తావించాడు.

హనుమ వాక్చాతుర్యాన్ని తెలిపే మరెన్నో ఘట్టాలు ‘రామయాణం’లో కనిపిస్తాయి. అందుకే, ఆయనకు ‘శుద్ధబ్రహ్మ’ అని పేరు. వేదత్రయం, నవవ్యాకరణాలు ఆయనకు కరతలామలకం. ఆ కపిశ్రేష్ఠుడిని ఉపాసించడం అంటే శారీరక బలాన్ని ఇనుమడింపజేసుకోవడమే. బుద్ధిబలాన్ని ప్రోది చేసుకోవడమే. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడమే అవుతుంది.

డా॥ పార్నంది
రామకృష్ణ
94920 07002

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాయు పుత్రం..మాటే మంత్రం

ట్రెండింగ్‌

Advertisement