సాధారణంగా అన్ని ఆలయాల్లో మనం ఆలయంలోకి ప్రవేశించగానే స్వామిని చూసి భక్తి భావంతో నమస్కారం చేసుకుంటాం. శివాలయానికి వెళ్లినప్పుడు అలా నేరుగా స్వామిని చూసి నమస్కరించుకునే అధికారం, అవకాశం భక్తులకు లేవు. అక్కడ శివ లింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచే లింగరూపి అయిన పరమేశ్వరుడిని దర్శించు కోవాలి. నందీశ్వరుడి అనుగ్రహంతోనే శివదర్శనం చేసుకోవాలి. ఆలయాల్లో మరెక్కడా లేని ఈ ఆచారం కేవలం శివాలయాల్లోనే ఉంటుంది. నందీశ్వరుడికే ఎందుకంత ప్రాధాన్యం అనే సందేహం మనకు వస్తుంది. దీనివెనుక ఒక పౌరాణిక విశేషం కనిపిస్తుంది. అదేమిటంటే…
పూర్వం శిలాదుడనే మహర్షి ఉండేవాడు. ఆయన పరమ శివభక్తుడు. ఒకరోజున మహర్షికి చిత్రమైన కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా ఇంద్రుడి గురించి కఠోర తపస్సు చేశాడు. మహర్షి భక్తికి మెచ్చిన ఇంద్రుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. శిలాదుడు ‘నాకు అయోనిజుడు, చిరంజీవి, పరమభక్తుడైన కుమారుడు కావాలని’ కోరుకున్నాడు. ‘నేనే శాశ్వతం కాదు. నాకే చిరంజీవిత్వం లేదు. అటువంటి నేను నీకు అలాంటి వరం ఎలా ఇవ్వగలను. నువ్వు కోరుకున్న వరాన్నిచ్చే శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంది. కాబట్టి, నువ్వు శంకరుడి గురించి తపస్సు చెయ్యి’ అంటూ ఇంద్రుడు సలహా ఇచ్చి అంతర్థానమయ్యాడు.
వెంటనే శిలాదుడు పరమేశ్వరుడి గురించి తపస్సు ప్రారంభించాడు. ఏండ్లు గడిచిపోయాయి. కొన్నాళ్లకి శిలాదుడి భౌతికదేహం పూర్తిగా మాయమైంది. కేవలం అస్థిపంజరం మాత్రమే మిగిలింది. చెక్కుచెదరని శిలాదుడి భక్తికి శివుడు పరమానందం పొందాడు. గంగ, పార్వతి, సుబ్రహ్మణ్య, గణపతి సహా ప్రమథ గణాలన్నిటితో కలిసి శిలాదుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అయినప్పటికీ శిలాదుడికి బాహ్యదృష్టి కలగలేదు. బహిర్ముఖుడు కాలేకపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు తన కుడికాలి బొటనవేలితో శిలాదుడి కనుబొమల మధ్య ప్రాంతంలో ఆజ్ఞాచక్రం వద్ద నొక్కాడు. పరమేశ్వర శక్తి స్పర్శ కలగటంతో శిలాదుడు బహిర్ముఖుడయ్యాడు. కోరుకున్న దైవం కళ్లెదుట కనిపించే సరికి శిలాదుడు పరమానందభరితుడయ్యాడు. పట్టరాని ఆనందంతో పరమేశ్వరుడిని స్తోత్రం చేశాడు.
శంకరుడు ‘శిలాదా! నువ్వు తపస్సు చేసిన కారణం ఏమిటి? నీ కోరిక ఏమిటో చెప్పు. వరమిస్తా’నన్నాడు. ‘నీలాంటివాడు, అయోనిజుడు, పరమభక్తుడు అయిన కుమారుడు కావాలి’ అని కోరుకున్నాడు. అప్పుడు శంకరుడు నవ్వి ‘నాలాంటి కొడుకు వేరొకడు లేడు. నీ భక్తికి లొంగిపోయాను. కనుక నేనే నీ కొడుకుగా వస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు.
కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు శిలాదుడు పరమశివ సంబంధమైన యజ్ఞకార్యాన్ని నిర్వహించటం కోసం భూమిని దున్ని, యజ్ఞశాల నిర్మించాడు. అగ్నిహోత్రం చెయ్యటానికి వీలుగా కొన్ని హోమగుండాలు కూడా ఏర్పాటుచేసి, వాటిని నిర్వహిస్తున్నాడు. అప్పుడు ఓ యజ్ఞగుండం నుంచి దివ్యతేజస్సుతో ఓ మూర్తి ఆవిర్భవించాడు. అతను చంద్రరేఖవంటి కిరీటం ధరించి ఉన్నాడు. ఏ విధమైన మలినం లేకుండా ప్రకాశిస్తున్నాడు. తెల్లని శరీరం మీద భస్మం అద్దినట్లు కనిపిస్తున్న నాలుగు భుజాలు కూడా ఉన్నాయి. పరమశివుడి అంశతో బాలశివుడు ఆవిర్భవించినట్లు అనిపించింది. ఆ పిల్లవాడిని చూస్తుంటే శిలాదుడికి పుత్రవాత్సల్యం కలిగింది. మనసు ఆనందంతో నిండిపోయింది. పిల్లవాడిని చూడగానే ఎక్కడలేని ఆనందం పొంగి పొరలింది కాబట్టి ‘నందీ’ అని పిలిచాడు. (శిలాదుడు శివుడిని నీలాంటి కొడుకు కావాలని అడిగినప్పుడు పరమశివుడు వెంటనే ఆది వృషభాన్ని పిలిచాడు. దానికి ధర్మం అని పేరు. నీవు నా స్వరూపంగా నందీశ్వరుడుగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించమని శాసనం చేశాడు. ఆ కారణంగానే శిలాదుడికి అగ్నిగుండం నుంచి నందీశ్వరుడు అయోనిజుడిగా జన్మించాడు) ఆ పిల్లవాడు దినదినప్రవర్థమానం అయ్యాడు.
ఓ రోజున కొంతమంది దేవతలు శిలాదుడి దగ్గరకు వచ్చారు. పిచ్చి భక్తుడా! శివుడు నువ్వు కోరుకున్న స్వరూపాన్ని నీ బిడ్డకు ఇచ్చాడే కానీ ఆయుర్దాయం మాత్రం ఇవ్వలేదు. నీ పిల్లవాడిది అల్పాయుష్షు. జ్ఞానం చేత అతను చిరంజీవి అవుతాడు కానీ ఆయుర్దాయం చేతకాదు. ఈ పిల్లవాడికి ఆయుష్షు తీరిపోయిందని చెప్పారు. దీంతో శిలాదుడికి ఎక్కడలేని దుఃఖం కలిగింది.
ఇదంతా గమనిస్తున్న నందీశ్వరుడు ‘నాన్నగారూ! బాధపడకండి. నేను కూడా మార్కండేయుడిలాగా పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తాన’ంటూ శివాలయానికి చేరుకుని తపస్సు ప్రారంభించాడు. బాలుడి భక్తికి, శ్రద్ధకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ‘నాయనా! నువ్వు ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటావు. నీ పూజకు, తపస్సుకు ఎంతో సంతోషించాను…’ అంటూ తన మెడలో ఉన్న బంగారుపద్మాల హారాన్ని నందీశ్వరుడి మెడలో వేశాడు. ఆ హారాన్ని మెడలో వేయగానే పిల్లవాడికి కూడా మూడో కన్ను వచ్చింది. శివుడికి ఐదు ముఖాలు ఎలా ఉంటాయో అలాగే నందికి కూడా ఐదు ముఖాలు వచ్చాయి. పది భుజాలు కూడా వచ్చాయి. ఈవిధంగా వచ్చి పిల్లవాడు శివుడితో సమానంగా ప్రకాశిస్తూ పరమేశ్వరుడి ఎదుట నిలబడ్డాడు. అప్పుడు అమ్మవారు పుత్రప్రేమతో పరవశించిపోయింది. నందీశ్వరుడిని కొడుకుగా అక్కున చేర్చుకుంది.
పార్వతీదేవి ఆ పిల్లవాడిని ప్రమథ గణాలకు నాయకుడిగా ప్రకటించాలని శివుడిని అభ్యర్థించింది. వెంటనే శివుడు ఆ పిల్లవాడిని ప్రమథ గణాలకు నాయకుడిగా పట్టాభిషేకం చేసాడు. మరుద్గణాల కుమార్తె ‘సుయశ’ను నందికి భార్యగా నిర్ణయించి, వివాహం చేశారు. ఆ సందర్భంలో శివుడు నందీశ్వరుడితో ‘నీవల్ల నీ తండ్రి తరించాలి కదా. కాబట్టి నీ తండ్రిని, తాతని కూడా సమున్నతమైన అధికారం కలిగిన ప్రమథ గణాల బృందంలోకి తీసుకువస్తున్నాను. వారు కూడా నన్ను సేవించుకుంటారు’ అన్నాడు. దాంతో శిలాదుడు ప్రమథ గణాల్లో ఒకడుగా మారిపోయాడు.
శివుడు నందీశ్వరుడికి మరొక వరం ఇచ్చాడు. ‘నీవు ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా నేను కూడా అక్కడికి వస్తాను. నీతోటే ఉంటాను. అలాగే నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావు. చివరకు శివాలయాల్లో కూడా నువ్వు నా ఎదురుగా ఉండాలి’ అంటూ వరరూపంగా ఆదేశించాడు పరమేశ్వరుడు. ఈ వరం ప్రకారం నందీశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ శివుడు ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు.
నందీశ్వరుడు ఆది వృషభం కాబట్టి ఆయన వృషభ రూపంలో ఉంటాడు. శివాలయంలో శివలింగ దర్శనం చేసేటప్పుడు నందీశ్వరుడి పక్కనుంచి వెళ్లడం కానీ, నందికి శివుడికి మధ్యలో వెళ్లడం కానీ చేయరాదు. తోక పక్కకు పడేసి వృషణాలు కనపడేటట్లుగా నందీశ్వరుడి విగ్రహమూర్తి పడుకుని ఉంటుంది. ఎడమచేతి బొటనవేలిని, చూపుడు వేలిని నంది కొమ్ముల మీద వేసి కుడిచేతితో ఆయన వృషణాలను పట్టుకుని రెండు వేళ్ల మధ్యలోంచి శివలింగాన్ని చూస్తూ ‘హరహర మహాదేవ శంభోశంకర’ అంటూ శివ జయనామాన్ని పలకాలి. ఇలా చేసిన శివదర్శనమే ఫలితాన్నిస్తుంది. కాబట్టి నందికొమ్ములు తప్ప మరొకస్థానం నుంచి శివదర్శనం చెయ్యకూడదు. శాస్త్రం విధించిన నియమం ఇది.
నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడాలి అనటంలో మరొక అంతరార్థం ఉంది. నంది ఆది వృషభం. ధర్మానికి సంకేతం. నంది కొమ్ముల నుంచి శివుడిని చూడటం అంటే ధర్మమార్గంలో దైవదర్శనం చేసుకోవటం అని అంతరార్థం. దైవాన్ని దర్శించుకోవాలనుకున్న వ్యక్తి ధర్మమార్గంలో అందుకు ప్రయత్నించాలి. సాధన చెయ్యాలి. అంతే తప్ప అహంకారాన్ని ప్రదర్శించకూడదు. శాస్త్రానికి విరుద్ధమైన మరొక మార్గంలో దైవదర్శనానికి ప్రయత్నించకూడదు. అలాచేస్తే విగ్రహం కనిపిస్తుందే కానీ దైవం చల్లనిచూపు మనమీద పడదు. పైగా దైవాగ్రహానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది.
నందీశ్వరుడు జీవుడికి సంకేతం. శివుడు బ్రహ్మానికి సంకేతం. జీవ బ్రహ్మల మధ్య భేదం చెప్పడం కానీ, వారి మధ్యలోకి వెళ్లడం కానీ చెయ్యకూడదు. కాబట్టి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి కాకుండా మరొక విధంగా శివలింగ దర్శనం చెయ్యకూడదు. ఇందుకు ఒకే ఒక్క మినహాయింపు ఉంది. అదేమిటంటే… శివలింగానికి సాయంత్రం అభిషేకం ముగిసిన తర్వాత సర్పరూపంలో ఉన్న కవచం పెడతారు. అలా కవచం తొడిగి ఉంటే మాత్రం శివలింగాన్ని నందికొమ్ముల మధ్య నుంచి చూడాల్సిన అవసరం లేదు. నేరుగా శివదర్శనం చేసుకోవచ్చు.
-శ్రీ భారతి