చల్దులు ఆరగించిన యాగభోక్త
శుక మహర్షి పరీక్షిత్తుతో... భూవరా! ఏరికోరి క్రూర సర్పం కుక్షిలో దూరి మృత్యు బారినపడ్డ తన వారినందరినీ దూడలతో సహా వారిజాక్షుడు తన కరుణ అనే అమృత వీక్షణాలను కురిపించి బ్రతికించాడు.
శుక మహర్షి పరీక్షిత్తుతో… భూవరా!
ఏరికోరి క్రూర సర్పం కుక్షిలో దూరి మృత్యు బారినపడ్డ తన వారినందరినీ దూడలతో సహా వారిజాక్షుడు తన కరుణ అనే అమృత వీక్షణాలను కురిపించి బ్రతికించాడు.
ఆ॥ ‘అమర వరుల కొఱకు గమల జాండం బెల్ల
బలి దిరస్కరించి బలియు వడుగు
గోప సుతుల కొఱకు బాపపు బెను బాము
గళము దూటు గట్ట బలియ కున్నె?’
శక్రా(ఇంద్రా)ది అమరులకు కలిగిన ఆపదలను నివారించడానికి చక్రధారి హరి వామనుడుగా అవతరించి త్రివిక్రముడై బ్రహ్మాండమంతా వ్యాపించి బలి చక్రవర్తి తలమీద తన పాదతలం (అరికాలు) పెట్టి అతనిని సుతలలోకానికి అణగదొక్కాడు గదా! ఆ మహావిష్ణువు శ్రీకృష్ణుడై గోపబాలురను కాపాడాలని క్రూరమైన ఆ కొండచిలువ (అఘాసురుని) తుండం (నోరు) బ్రద్దలయ్యేటట్లు శరీరాన్ని పెంచడం ఏమంత ఆశ్చర్యం? కంత (మన్మథ) జనకుని శ్రీకాంతుని ఇంత అద్భుతమైన వింత లీల మరే ఇతర అవతారాలలో ఎంత వెదకినా కనిపించదు. అనఘుడు హరి ఎన్నో అవతారాలలో ఎందరో పాపాత్ములను తరింపజేశాడు. కాని, సాక్షాత్ అఘానికే పాపానికే ముక్తిని ప్రసాదించిన దివ్యలీల ఈ కృష్ణావతారంలోనే! ఉత్తరాదేవి కుక్షి ప్రవేశం చేసి ఔత్తరేయుని పరీక్షిత్తుని పరిరక్షణ! అఘాసుర గర్భ ప్రవేశం చేసి గోవత్స గోప అర్భకుల (బాలుర) సంరక్షణ!
క॥‘తన రూపొకమారైనను
మనమున నిడికొనిన బాపమయునై నను లో
గొని చను హరి తను మ్రింగిన
దనుజుని గొనిపోవకున్నె తన లోపలికిన్’…
తన రూపాన్ని ఒక్కమారైనా మనస్సులో నిలుపుకొంటే, ఎంతటి పాపినైనా ముకుందుడు ఆ నందనందనుడు ఆనందంగా తనలో చేర్చుకుంటాడు. ఇక, తనను మింగిన దనుజుని అసురుని రామానుజుడు తన ధామా గోలోకానికి చేర్చుకోకుండా ఉంటాడా?
అఘమోక్షణం వీక్షించిన (కన్న) సుమనస్సులు దేవతలు కుసుమ వర్షం కురిపించి జేజేలు పలికారు. ఆ జయ జయ ధ్వానాలు విన్న బ్రహ్మదేవుడు ఏదో గొప్ప లోక కల్యాణం జరిగిందన్న ఆనందంతో తిన్నగా భూలోకానికి వచ్చాడు. ఇంతటి మహాసర్పం నోటిలో చిక్కుకున్న లేగలను, బాలురను చిన్నికృష్ణుడు ఎలా బ్రతికించాడో! అని ముక్కున వేలేసుకున్నాడు. శుకుడు రాజా! ఆ కొండచిలువ చర్మం కొన్నాళ్లకు ఎండిపోయి చాలాకాలంపాటు గోపబాలురకు ఆటల్లో అండగా ఒక కొండగుహలాగా ఉండిపోయింది. ‘బాలకృష్ణుని కౌమార వయసులో అనగా ఐదవ ఏట జరిగిన ఈ అఘాసుర మోక్షణ లీల పౌగండ అంటే ఆరేళ్ల వయసులో జరిగిందని గొల్లపిల్లలు తలచారు’ అని పలికిన శుకమునిని అవనీపతి పరీక్షిత్తు ‘మహనీయా! నిరుడు జరిగిన దానిని ఈనాటిది అని భావించడం ఎవరికైనా ఎలా సాధ్యం? ఇదేదో వింతగా ఉంది. నాకు సాంతం వివరించి చెప్పండి’ అని అర్థించాడు. భావి (తరువాతి) కథ గుర్తుకు రాగానే బాదరాయణి (శుకుని)కి భావ సమాధి అంతర్ముఖత్వం కలిగింది. అప్పుడు శ్రోతలైన మహర్షులు ఎంతో కష్టపడి ఆయనకు బాహ్యస్మృతి బహిర్దృష్టిని కలిగించారు అని సూత ముని శౌనకాది మహర్షులతో పలికిన మాట. పిమ్మట శుకయోగి…
క॥‘ప్రియురాలి వలని వార్తలు
ప్రియజనులకు నెల్లప్రొద్దు బ్రియమగు భంగిన్
బ్రియుడగు హరి చరితంబులు
ప్రియ భక్తుల కెల్ల యెడల బ్రియములు గావే?’
రాజవర్యా! వినయధుర్యా! దివ్యమైన భగవల్లీలలను విన్నప్పుడల్లా నీవు నీ భవ్యమైన ప్రశ్నల ద్వారా వాటికి ఇతోధిక నవ్యత్వాన్ని, రసరమ్యత్వాన్ని కలిగిస్తావు. ‘ప్రియురాలిని గురించిన వార్తలు ప్రియులకు ఎల్లప్పుడూ చాలా ప్రియంగా ఉంటాయి. అలాగే ప్రియుని కథలు ప్రియురాండ్రకు కూడా మధురంగానే ఉంటాయి. అయితే, పారమార్థికంగా సృష్టికంతటికి భగవంతుడొక్కడే పురుషుడు పురుషోత్తముడు. జీవులందరూ అతనికి ప్రియురాళ్లే! వారందరికీ ఏకైక ప్రియుడు పరమాత్మ ‘నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!’. తమ చిత్తాలను భగవదాయత్తం చేసిన భాగవతోత్తములకు భగవత్కథలు ఇంకా ప్రియతరాలు, రసవత్తమాలు కదా!’ మూలంలోని ‘స్త్రియా విటానామివ సాధు వార్తా’ అన్న సొంపైన శ్లోక పంక్తికి మాకందం వంటి పై కందపద్యం, భక్త బృందానికి వందనీయుడైన బమ్మెరగారి కమ్మని పెంపుదల!
శుకుడు రాజా! బాలకృష్ణుని ఈ లీల చాల రసభరితం, రహస్యమయం! శ్రద్ధగా విను. యోగ్యులైన శిష్యుల వద్ద గురువులు రహస్యాలు దాచరు. అడవిలో దూడలు కలివిడిగా, విడివిడిగానూ పచ్చిక మేస్తున్నాయి. ఆటల్లో అలసిపోయిన బాలకులకు ఆకలి అయింది. అంతటి అఘాసురుని సంహరించావు కాని ఈ క్షుధా ఆకలి అసురుని హరించడం నీతో కాదు గదా కృష్ణా! అంటూ అపహాస్యం వేళాకోళం చేసుకొంటూ తెచ్చుకొన్న చద్ది అన్నం ఆరగించటానికి కొలను తీరంలో తీరి కూర్చున్నారు.
కమల కుసుమపు కర్ణిక (దుద్దు) చుట్టూ దట్టంగా అమరి ఉన్న అమలమైన రేకులవలె గోపబాలురు అనేక వరుసలలో వలయాకారంగా కూర్చుంటే మధ్య కర్ణిక లాగా కమలనేత్రుడు, మేఘవర్ణుడు, అమోఘుడు, కృష్ణుడు కూర్చున్నాడు. మడి తడి, అంటు సొంటు అని అనుకోకుండా, ఎగబడి ఒకరి చేతిలోని వంటకాన్ని మరొకరు గుంజుకుంటూ, నంజుకుంటూ; ఎంగిలి మంగళమని ఎంచకుండా ‘ఒరే! మువ్వగోపాలుడు ఎలా నవ్వుతున్నాడో అటు చూడు’ అంటూ మాయచేసి తనకు ఇరువంకల వారి మధుర పదార్థాలను దొంగిలించి తింటూ; చేతి వేళ్ల సందుల్లో ఊరుగాయ ముక్కలు ఇరికించుకొని, మాటి మాటికి ఉరుగాయు హరిని ఊరిస్తూ; పక్కవారికి పెట్టకుండా ఒక్కరే మెక్కుతున్న వారిని వెక్కిరిస్తూ వారిస్తూ… ఇలా నవ్వుతూ, నవ్విస్తూ, ముచ్చట్లు చెప్పుకొంటూ, మురిసిపోతూ తింటున్నారు.
పరమాత్మకు కూడా ఎడమచేతిలో చిక్కని మీగడ పెరుగన్నపు ముద్ద, కుడిచేతి వేళ్ల సందుల్లో పసందైన నిమ్మ, ఉసిరి పచ్చళ్ల ముక్కలు!.. ‘యాగభోక్త కృష్ణుడమరులు వెఱగంద, శైశవంబు మెరసి చల్ది గుడిచె’.. సర్వయజ్ఞాల ఫలాన్ని భుజించే శ్రీహరి బాల్యక్రీడల లౌల్యం (ఆసక్తి)తో అలా కూర్చుండి చల్ది ఆరగిస్తుంటే అమరులందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరుచుకు చూస్తున్నారు. పరమార్థంలో వ్రజభూమి (బృందావనం) యజ్ఞభూమికన్నా శ్రేష్ఠం, పవిత్రమన్నమాట! ‘భగవంతుని ఎంగిలి భక్తునికి ప్రసాదమైతే, భక్తుని ఎంగిలి భగవంతునికి మాత్రం ఎందుకు ప్రసాదం కాదు?’ అని ఆర్యవచనం. చిన్ని కృష్ణుని ఇదొక చిన్మయలీల! బాలకృష్ణుడు చల్ది ఆరగిస్తుండగా వేల్పుల పెద్ద, వయోవృద్ధుడు విధాత బ్రహ్మదేవుడు చూచి విస్మయం చెందాడు.
ఇతడేమి భగవంతుడు? విధి విధానం లేక ఉచ్చిష్టం ఎంగిలి తింటున్న ఇతడు ‘ఇష్టుడు, విశిష్టుడు, శిష్టేష్టుడు’ (విష్ణు సహస్రం) అయిన విష్ణువా? అని సురజ్యేష్ఠునికి బ్రహ్మకు కూడా సందేహం కలిగింది. ఆహా! హతవిధీ! విధాతకు కూడా విధి వక్రించింది! బ్రహ్మ కూడా భ్రమకు లోనయ్యాడు. పరమాత్మను పరీక్షించాలనే పాడు బుద్ధి పుట్టింది. ఇటు అటు పరికించి పితామహుడు పటుతరమైన తన ఇంద్రజాలంతో దూడలను మటుమాయం చేశాడు. క్షీరసాగరానికి వెళ్లి శేషశాయి శ్రీమన్నారాయణుని భూభార హరణం కొరకు అవతరణం చెయ్యమని ప్రార్థించిన పరమేష్ఠి బ్రహ్మ, దేవకీ గర్భస్థుడైన దేవదేవుని స్తుతించిన అబ్జయోని బ్రహ్మ, నేడు భగవంతుని సగుణ లీలను కని గ్రహించలేని వాడై తలక్రిందులై పోతున్నాడు. చతుర్ముఖుడే ఇలా చతికిల పడితే ఇక పతిత జీవనుల పామరుల పరిస్థితి ఏమిటి? నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవడం కొంత సులభమేమో గాని, సగుణ బ్రహ్మ లీలల అవగాహన అతికఠినం అని మనీషుల, మహాత్ముల అభిమతం.
శుకుడు రాజా! నందనందనునితో కూడి గోపబాలురు చల్దులు ఆరగిస్తుండగా దూడలు దొంగమేతలు మేస్తూ ఎంతో దూరం వెళ్లిపోయాయి. కనుచూపు మేరలో అవి కనపడక పిల్లలు భయపడుతుంటే నల్లనయ్య ‘మిత్రులారా! పర్వాలేదు. కంగారు పడకుండా మీరు తింటూ ఉండండి, నేను బంగారంగా వెదకి తెస్తా’ అంటూ సర్వదర్శనుడు బయల్దేరాడు. అనన్య శరణాగత భక్తుల యోగక్షేమాలు వహించే భరణం తనదే కదా! మూలంలో ‘సపాణి కవలో యయౌ’ (చేతిలో ఉన్న పెరుగన్నపు ముద్దతోనే కన్నయ్య బయల్దేరాడు) అని మాత్రమే ఉన్నది. వత్సాన్వేషకుడైన శృంగార రత్నాకరుని బాలగోపుని వన్నెచిన్నెల రంగారు విలాసయుక్తమైన రూపాన్ని మన పోతన్న ముద్దులు మూట కట్టినట్లు నేత్రోత్సవంగా ఎలా వర్ణించాడో ఆలకించండి..
శా॥ కర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయ హారాళితో
స్వర్ణా భాసిత వేత్ర దండకముతో సత్పింఛదామంబుతో
బూర్ణోత్సాహముతో ధృతాన్న కబళో త్ఫుల్లాబ్జ హస్తంబుతో
దూర్ణత్వంబున నేగె లేగలకునై దూరాటవీ వీధికిన్.’.
చెవుల వరకు వ్రేలాడుతున్న జులపాల జుట్టుతో, మెడలో మిలమిల లాడే హారాలతో, బంగారం వలె తళుకులీను చేతికర్రతో, సిగపై కన్నులపండువుగా కదలాడే నెమలిపింఛపు సొగసుతో, విప్పారిన ఎర్ర తామర వంటి అరచేతిలో తెల్లగా మెరుస్తున్న పెరుగన్నపు ముద్దతోనే ముద్దుకృష్ణుడు ఉత్సాహంతో లేగలను వెతుకుతూ వడివడిగా అడవి దారుల్లో చాలా దూరం వెళ్లాడు. దూడల జాడలు తెలియక తిరిగి కొలను వద్దకు వచ్చాడు. ఇక్కడ గోపబాలురను కూడా మాయంజేసి బ్రహ్మదేవుడు ఒక గుహలో రహస్య ప్రదేశంలో దాచి ఉంచాడు.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

