అల్లదుగో ప్రశ్న
తనకు తెలియని దానిని తెలిసిన వారిని అడిగి తెలుసుకునే ప్రశ్నా విధానానికి భారతీయ విద్యావిధానం పెద్దపీట వేసింది. సందేహం వచ్చినప్పుడు సమర్థుడైన గురువును ఆశ్రయించి ప్రశ్నించాలి. నిజాన్ని తెలుసుకోవాలనే కుతూహలానికి నాంది ప్రశ్న. ప్రశ్నలో జిజ్ఞాస ఉంటుంది. ఆరాటం ఉంటుంది. ఆవేదన ఉంటుంది.
దేవీ భాగవతం తృతీయ స్కంధంలోజనమేజయుడు వ్యాస మహర్షితో ‘మునీశ్వరా! ఏ పాలకుడైనా ఏ యాగాన్నైనా విధ్యుక్తంగా నిర్వహించినవేళ వారికి సిరిసంపదలు, సుఖసంతోషాలు లభిస్తాయని చెపుతారు కదా.. మరి పాండవులు రాజసూయ యాగాన్ని వైభవోపేతంగా నిర్వహించినా వారు సర్వస్వాన్నీ కోల్పోయి, అవమానాలను పొందారు, అరణ్యాల పాలయ్యారు. వారి భార్యను వారి కండ్ల ముందే సభలో దాయాదులు అవమానించారు. ఒక సామాన్య సామంతరాజును సేవించే దుస్థితిని పొందారు. ఇది ఎలా సంభవించింది?’ అని ప్రశ్నించాడు.
తనకు తెలియని దానిని తెలిసిన వారిని అడిగి తెలుసుకునే ప్రశ్నా విధానానికి భారతీయ విద్యావిధానం పెద్దపీట వేసింది. సందేహం వచ్చినప్పుడు సమర్థుడైన గురువును ఆశ్రయించి ప్రశ్నించాలి. నిజాన్ని తెలుసుకోవాలనే కుతూహలానికి నాంది ప్రశ్న. ప్రశ్నలో జిజ్ఞాస ఉంటుంది. ఆరాటం ఉంటుంది. ఆవేదన ఉంటుంది. తెలిసిన దానిని ఆధునికీకరించుకోవాలి, అన్వయించుకోవాలనే తపన ఉంటుంది. అవరోధాలను అధిగమించేందుకు కావలసిన అన్వేషణ ఉంటుంది. అవకాశాలను వినియోగించుకోవడంలో అవగాహన ఉంటుంది. ఏ మేరకు దేనిని ఎలా ఉపయోగించుకోవాలనే విచక్షణ ఉంటుంది. ప్రశ్న అజ్ఞతాంధం నుంచి విజ్ఞాన ఉషస్సులను దర్శించేందుకు ప్రేరణనిస్తుంది. ‘విమర్శరూపిణి’ అంటున్నది అమ్మవారిని లలితా సహస్రనామం. పరాతత్త్వాన్ని బుద్ధితో ఆలోచనతో విచక్షణతో విమర్శ చేయగలిగిన అంతశ్శక్తి లలితాదేవి.
ఆమే విమర్శరూపిణి. ఆ తత్వమే ప్రశ్నరూపంలో మన జిజ్ఞాసను పెంచుతుంది.
జనమేజయుని ప్రశ్న సూటిగా, జిజ్ఞాస పూరితంగా ఉన్నది. దానికి సమాధానంగా వ్యాస మహర్షి.. ‘యజ్ఞ నిర్వహణలో చిత్తశుద్ధి, ద్రవ్యశుద్ధి ముఖ్యమైనవి. పాండవులు రాజసూయ యాగ నిర్వహణలో ఇదివరకు ఏ చక్రవర్తి కూడా చేయడానికి సాహసించని రీతిలో ఉన్నతంగా చేశామన్న పేరుప్రఖ్యాతుల కోసం పరితపించారు. దర్పాన్ని చూపించుకోవాలనే కోరిక వారిలో ఉన్నది. కౌరవుల కన్నా ఉన్నతులుగా నిలిచామనే గర్వమూ కనిపిస్తున్నది. ఆ కారణంగా వారిలో చిత్తశుద్ధి లోపించింది. దానికి తోడు రాజులందరినీ జయించి, వారిని పీడించి, బలవంతంగా కప్పంగా తీసుకున్న ద్రవ్యాన్ని యాగానికి వినియోగించడం వల్ల ఆ ద్రవ్యంలో ద్రవ్యశుద్ధి లోపించింది. ఆ కారణంగా సాక్షాత్తూ కృష్ణ పరమాత్మే అగ్రపూజను అందుకున్నా, శుభాలు కోరుతూ ధౌమ్యాదులు ఆశీర్వచనాలు అందించినా, ధర్మజుడే యజమానిగా నిర్వహించినా, యాగంలో చిత్తశుద్ధి, ద్రవ్యశుద్ధి లోపించడంతో రాజసూయ యాగం విపరీత ఫలితాన్ని ఇచ్చింది’ అని వివరించాడు వ్యాసుడు.
దీనికి కొనసాగింపుగా యజ్ఞంలోని మూడు విధాల గురించి వ్యాసుడు ఇలా విశదపరిచాడు. ‘యజ్ఞయాగాదులను మనుషులు నిర్వహిస్తారు కాబట్టి, అది వారి గుణములపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ శాంతిని కాంక్షించి మునులు, రుషులు నిర్వహించే యజ్ఞాన్ని సాత్విక యజ్ఞంగా చెబుతారు. అలాగే పాలకులు తమ ప్రయోజనాలకై నిర్వహించే యజ్ఞాన్ని రాజస యాగంగా చెబుతారు. ఇతరుల వినాశనాన్ని కోరి నిర్వహించే యజ్ఞం తామస యజ్ఞం. కామరహితంగా పరిశుద్ధ ద్రవ్య వినిమయంతో, శ్రద్ధతో, మంత్ర సహితంగా నిర్వహించే సాత్విక యజ్ఞం అకామ కర్మగా పరిపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. అలాకాని నాడు అది విపరీత ఫలితాలను ఇస్తుంది. సకాములైన ద్రుపదుడు, దశరథుడు నిర్వహించిన యాగాలలో చిత్తశుద్ధి, ద్రవ్యశుద్ధి ఉన్నది కాబట్టి వారి యాగాలు రాజసమై తదనుగుణ ఫలితాన్ని ఇచ్చాయి. పాండవులలో కనిపించిన ద్వేషభావన, గర్వంతోపాటు ద్రవ్యశుద్ధి లేకపోవడం, వైగుణ్య యోగం కారణంగా వారికి కష్టాలు సంభవించాయి’ అంటాడు వ్యాస మహర్షి.
ఏ విషయమైనా బుద్ధితో, హేతుబద్ధంగా ఆలోచించి, నిర్ణయానికి రావడానికి ప్రశ్న ఉపయోగపడుతుంది. ఇతరులు ఎంత గొప్పవారైనా వారు చెప్పిందే వేదమని గుడ్డిగా నమ్మడం సమంజసం కాదు. సాక్షాత్తూ పరమాత్మయే గీతను బోధించినా అర్జునుడు తన సందేహాలను ప్రశ్నల రూపంలో సంధించాడు. అన్నిటికీ సహనంతో సమాధానాలిచ్చిన కృష్ణుడు.. చివరగా బాగా ఆలోచించి, వివేచనతో నిర్ణయం తీసుకో.. ‘యథేచ్ఛసి తథాకురు’ అని పేర్కొన్నాడు.
అలాగే.. ధర్మ విరుద్ధమైన ప్రశ్న సమంజసంగానే కనిపించినా… దానికి సమాధానం ఇచ్చే ప్రక్రియలో హింసకు అవకాశం ఉందనిపించినా, శాంతికి విఘాతం కలుగుతుందని భావన కలిగినా దానిని సమయస్పూర్తితో తప్పించడం కూడా అవసరమే. ఒకప్పుడు ఒక వేటగాడు ఒక లేడిని వేటాడుతూ వచ్చాడు. అతని బాణం దెబ్బకు గాయపడిన లేడిపిల్ల ఒక ముని ఆశ్రమంలో దూరింది. వేటగాడు దాని వెన్నాడుతూ వచ్చి మునిని… ‘అయ్యా! నేను నా భార్యాబిడ్డల పోషణకై వేటాడే సమయంలో ఒక లేడిని కొట్టాను. అది గాయపడి మీ ఆశ్రమం వైపు వచ్చింది. మీరు చూశారా?’ అని ప్రశ్నించాడు. దానికి మునిలో సందిగ్ధత.. ‘చెబితే హింసను ప్రేరేపించిన వాడనవుతాను, చెప్పకపోతే అసత్య దోషం కలుగుతుంది..’ అనుకున్నాడు. అందుకే ‘యా పశ్యతి న సా బ్రూతే! యాబ్రూతే సా న పశ్యతి. అహో వ్యాధ స్వకార్యార్థిన్ కింపృచ్ఛసి పునః పునః’.. మిత్రమా! నీ కార్యం సాధించేందుకు ఎందుకని పదే పదే ప్రశ్నిస్తావు. ఏదైతే చూసిందో (కన్నులు) దానికి చెప్పగలిగే సామర్థ్యం లేదు.. ఏదైతే చెప్పగలదో (నోరు) అది చూడలేదు. అందుకని నీ దారిని నీవు వెళ్లమ’ని చెబుతాడు. కాబట్టి ప్రశ్న ఎదురైన సమయంలో విజ్ఞతతో ఆలోచించి ధార్మికమైన మనసుతో, లోతుపాతులు విచారించి సమాధానం ఇవ్వాలని పెద్దల మాట.
నేనెవరు?
ఏ సిద్ధాంతానికీ కట్టుబడకుండా సత్యాన్వేషణ దీక్షతో, జిజ్ఞాసతో కూడిన ప్రశ్న, ప్రశ్నను తట్టిలేపుతుంది. విచక్షణకు
అద్దంపడుతుంది. సృజనాత్మక శక్తిని జాగృతం చేస్తుంది. విమర్శనా శక్తిని ప్రసాదిస్తుంది. సాంకేతికతను ఆధునికీకరిస్తుంది. నిద్రాణమైన అనంత శక్తికి చైతన్యాన్నిస్తుంది. బతుకునుంచి జీవితాన్ని ఆస్వాదిస్తూ ప్రభావవంతంగా, ప్రకాశవంతంగా సమన్వయ పూర్వకంగా అడుగు ముందుకు వేసేందుకు కావలసిన సర్వాంగీణ వికాసాన్ని కలిగిస్తుంది. పశు ప్రవృత్తితో బతుకీడ్చే మనిషిలో ‘నేనెవరు?’ అనే ప్రశ్న తన గురించి తెలుసుకోవాలనే తపనకు బీజం వేసింది. ఆ శోధనే ఆధ్యాత్మిక సాధనకు, మూల ప్రకృతి అన్వేషణకు దారితీసింది. ప్రశ్నించడమే ప్రధానం. ‘ప్రశ్నించడాన్ని ఏనాడూ ఆపకూడదు’ అంటారు ఐన్.
…? పాలకుర్తి రామమూర్తి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

