ఓ ఇంజినీరింగ్ పట్టభద్రుడికి క్యాంపస్ సెలెక్షన్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. లక్షల్లో వేతనం. నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. అతని తల్లి పల్లెటూళ్లో ఇంట్లో ఉంటుంది. ఆమెకు ఆరోగ్యం పూర్తిగా మందగించింది. విషయం తెలిసినా ఉద్యోగరీత్యా వెళ్లలేని పరిస్థితి కొడుకుది. ఓ రోజు హడావుడిగా గుడికి వెళ్లి అక్కడి ఆర్జిత సేవల వివరాలు చూశాడు. తను అనుకున్న ‘సేవ’ అందుబాటులో లేదని పూజారిని సంప్రదించాడు. ‘చాలా రోజులుగా మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది.
ఆమె ఎంతో కష్టపడి నన్నింతవాణ్ని చేసింది. కానీ, ఉద్యోగరీత్యా ఈ క్షణాల్లో అమ్మ దగ్గర ఉండలేకపోతున్నాను. మా అమ్మ రుణం తీర్చుకునే పూజలు, ఆర్జిత సేవలు ఏమైనా ఉంటే చెప్పండి’ అని పూజారిని అడిగాడు ఆ యువకుడు. ఆశ్చర్యపోయిన పూజారి చిరునవ్వుతో ‘ఈ ప్రపంచంలో ఎవరి రుణమయినా తీర్చుకోవచ్చేమో గానీ, తల్లి రుణం తీర్చుకోలేం. ఈ అవసాన దశలో అమ్మ సేవ చేసుకుంటే కొంతైనా ఆమె రుణం తీర్చుకోగలవు’ అని చెప్పాడు పూజారి. గుడి నుంచి నేరుగా ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821